అపరాధ భావం వేధిస్తోందా..?
కొన్నిసార్లు.. తెలిసో తెలియకో.. కారణం ఉన్నా.. లేకపోయినా.. మన స్నేహితులను కోప్పడుతూ ఉంటాం. అక్కడితో ఆగకుండా వారిని మాటలతో లేదా చేతలతో బాధపెట్టే సందర్భాలు కూడా ఉంటాయి. ఆ సమయంలో 'నేను చేసేది సరైనదే' అనిపించినా.. కొంత సమయం గడచిన తర్వాత 'నేను అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది' అని పదేపదే అనుకుంటూ ఉంటాం.
కొన్నిసార్లు.. తెలిసో తెలియకో.. కారణం ఉన్నా.. లేకపోయినా.. మన స్నేహితులను కోప్పడుతూ ఉంటాం. అక్కడితో ఆగకుండా వారిని మాటలతో లేదా చేతలతో బాధపెట్టే సందర్భాలు కూడా ఉంటాయి. ఆ సమయంలో 'నేను చేసేది సరైనదే' అనిపించినా.. కొంత సమయం గడచిన తర్వాత 'నేను అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది' అని పదేపదే అనుకుంటూ ఉంటాం. తప్పు చేశాననే అపరాధభావం మనల్ని పట్టిపీడిస్తుంటుంది. పోనీ వారి దగ్గరకు వెళ్లి క్షమించమని అడుగుదామంటే అహం అడ్డొస్తుంటుంది. ఇలా బాధపడటం వల్ల మనకి కలిగే ప్రయోజనం కూడా ఏమీ లేదు. అందుకే ఈ అపరాధ భావన నుంచి బయటపడి తిరిగి మామూలుగా మారాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా..
సమస్యను గుర్తించాలి..
చాలామంది ఏదైనా పొరపాటు చేసినప్పుడో.. లేదా వివిధ కారణాల వల్ల ఇతరులపై కోపం ప్రదర్శించినప్పుడో తప్పు చేశామనే భావనలోకి వెళ్లిపోతుంటారు. అయితే ఇలా బాధపడే ముందు.. అసలు మనం చేసింది తప్పా? ఒప్పా? అని ప్రశాంతంగా ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు మనపై మనం నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే పొరపాటు చేయచ్చు. కాబట్టి జరిగిన సంఘటన మొత్తాన్ని ఓసారి గుర్తు తెచ్చుకోవాలి. దీనివల్ల పొరపాటు ఎక్కడ చేశామో తెలుస్తుంది. అప్పుడు దాన్ని సరిదిద్దుకుంటే మనలో ఉన్న అపరాధ భావన తొలగిపోతుంది.
పదే పదే తలుచుకోవద్దు..
ఏదైనా పొరపాటు జరిగినప్పుడు చాలామంది దాన్ని పదేపదే తలుచుకుంటూ బాధపడుతుంటారు. కొన్నిసార్లయితే జరిగింది చిన్న సంఘటనే అయినా.. దానివల్ల పెద్దగా నష్టమేమీ జరగకపోయినా.. చేసిన తప్పునే మళ్లీ మళ్లీ తలుచుకుంటూ బాధపడిపోతుంటారు. ఉదాహరణకి ఇంట్లో ఏదో ఒక అపురూపమైన వస్తువుని అనుకోకుండా పగలగొడితే.. దాన్నే వూరికే గుర్తు తెచ్చుకుంటూ 'నేను తప్పు చేశాను' అనుకుంటూ ఉంటారు. కానీ అది అపరాధ భావనలో కూరుకుపోయేంతటి పొరపాటు ఏమీ కాదు. ఇలాంటి చిన్న విషయాలకు కూడా అతిగా ఆలోచించడం వల్ల మీ మెదడు, మనసు మొత్తం తప్పు చేశామనే దృక్పథంతోనే నిండిపోయి.. మానసిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
క్షమాపణ కోరడం..
కొన్నిసార్లు అకారణంగా ఎవరినైనా నిందించినా లేదా దూషించినా వారి కంటే మనమే ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. కానీ వారి ముందు ఆ భావాలను బయటపెట్టలేం. అందుకే వారి ముందుకు వెళ్లడానికి కూడా సాహసించం. మరికొందరైతే కేవలం వారితోనే కాకుండా వారికి సంబంధించిన వారితోనూ స్నేహపూర్వకంగా మెలగలేరు. దీంతో అనవసరంగా నోరు పారేసుకున్నామనే భావన ఇంకా ఎక్కువైపోతుంది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే ఆ భారాన్ని దించేసుకోవడం మంచిది. దీనికోసం మీరు ఎవరిని దూషించారో వారి దగ్గరకు వెళ్లి క్షమాపణలు కోరండి. అసలు ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో వారికి వివరించండి. అలాగే జరిగిన సంఘటనను మళ్లీ పునరావృతం కాదని వారికి హామీ ఇవ్వండి. అప్పుడు పెద్ద మనసుతో వారే మిమ్మల్ని మన్నించేస్తారు. మీ మనసు కూడా తేలికపడుతుంది.
ఒప్పుకోవడం ద్వారా..
తెలిసి చేసినా.. తెలియక చేసినా కొంతమంది తాము చేసిన పొరపాట్లను దాచి ఉంచుతారు. ఆ తప్పు చేసింది తాము కాదని బుకాయిస్తారు. అది మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత నిజం బయటపడినప్పుడు మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే తప్పు చేస్తే అవతలి వ్యక్తికి నిజాయతీగా మీరు చేసిన తప్పు గురించి చెప్పండి. ముందు వారు కోపగించుకున్నా.. తర్వాత మిమ్మల్ని సరైన దారిలో నడిపే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల మళ్లీ మీరు తెలిసి పొరపాటు చేసే అవకాశం ఉండదు.
తప్పు చేశామన్న భావన కలిగిప్పుడు దాన్నే తలచుకొని బాధపడడం సరికాదు. దాన్ని మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి దొరికిన అవకాశంగా భావించాలి. అప్పుడే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.