FIFO: వృథాకు చెక్ పెట్టండిలా..!

'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అంటారు పెద్దలు. అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలేవైనా.. అవి భగవంతుడితో సమానమన్నమాట. కానీ మనలో చాలామంది వండేటప్పుడు ఇష్టం వచ్చినంత మోతాదులో ఆహారపదార్థాలను వండేయడం.. ఆ తర్వాత వాటిని తినలేక పడేయడం..

Published : 29 May 2022 11:11 IST

'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అంటారు పెద్దలు. అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలేవైనా.. అవి భగవంతుడితో సమానమన్నమాట. కానీ మనలో చాలామంది వండేటప్పుడు ఇష్టం వచ్చినంత మోతాదులో ఆహారపదార్థాలను వండేయడం.. ఆ తర్వాత వాటిని తినలేక పడేయడం.. వంటివి ఎక్కువగా చేస్తుంటారు. అలాగే కొనుగోలు చేసే సమయంలో కూడా అవసరానికి మించి కొనుగోలు చేసేయడం.. అవి పాడైపోతే వృథాగా పారేయడం..! దీనివల్ల ఇటు విలువైన డబ్బు వృథా అవడమే కాకుండా.. ఆయా ఆహారపదార్థాలు ఎవరికీ పనికిరాకుండా పోతాయి. అందుకే ఇంట్లో ఆహారపదార్థాల వృథాకు ఎలా కళ్లెం వేయాలో తెలుసుకుంటే, వాటిని పాటిస్తూ.. ఇటు మీ బడ్జెట్‌ని, అటు ఆహారాన్ని కూడా కాపాడుకోవచ్చు.

షాపింగ్ నుంచే..

చాలామంది షాపింగ్‌కి వెళ్లేటప్పుడు ఇంట్లో ఏయే పదార్థాలున్నాయి.. ఏం లేవు.. అన్నవి చూసుకోకుండానే బయల్దేరుతుంటారు. దాంతో బజారుకు వెళ్లిన తర్వాత అన్నీ అవసరమే అనిపిస్తుంది. ఫలితంగా అవసరం లేని వస్తువులు సైతం కొంటుంటారు. దీనివల్ల పాతవి, కొత్తవి.. వస్తువులన్నీ కలిపి ఉపయోగించాల్సి రావడంతో కొన్ని పదార్థాలు పాడైపోయే అవకాశం లేకపోలేదు. అందుకే షాపింగ్‌కి వెళ్లేటప్పుడే ఏమేం కావాలో చూసుకోవడం మంచిది.

ఎక్కువ వద్దు..

మీరు వస్తువులను కొనాలనుకున్నప్పుడు ఎంత మొత్తంలో కావాలనుకుంటే అంతే మొత్తంలో కొనేలా చూసుకోండి. ఉదాహరణకు మీకు వారానికి కేవలం పావు కేజీ పచ్చిమిర్చి మాత్రమే అవసరం అనుకోండి. సూపర్‌మార్కెట్లో ప్యాకెట్ ఉంది కదా అని కేజీ కొనేయడం వల్ల అవి పాడయ్యే అవకాశం ఉంటుంది.

FIFO పద్ధతి పాటించండి..

నిత్యావసరాలు లేదా కూరగాయలు కొన్న తర్వాత కూడా అందులో ముందుగా పాడైపోయే వస్తువులేంటో గుర్తించి, వాటిని వీలైనంత త్వరగా ఉపయోగించడం వల్ల వృథాను అరికట్టే వీలు కలుగుతుంది. వృథాను అరికట్టడానికి FIFO అనే పద్ధతిని పాటించమని చెబుతారు నిపుణులు. ఫస్ట్ ఇన్, ఫస్ట్ అవుట్.. అంటే.. మొదట లోపల ఉంచిన లేదా కొనుగోలు చేసిన దాన్ని మొదట బయటకు తీసి, ఉపయోగించడం అన్నమాట. దీనికోసం కొత్తగా తీసుకొచ్చిన వస్తువులను వెనుకగా, అంతకంటే ముందు తీసుకొచ్చిన వస్తువులను ముందుగా ఉంచడం వల్ల ముందు వీటినే ఉపయోగించే వీలుంటుంది.

వృథాను రాసేయండి..

వండిన పదార్థాలను తినగా మిగిలినవి పడేయడం చాలామందికి అలవాటే. కానీ వాటిని వృథా చేయకుండా వీలైనంతగా తిరిగి ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఒకసారి వండిన పదార్థాలను మళ్లీ మరో రకంగా ఉపయోగించే వీలుందేమో ప్రయత్నించండి. ఫ్రిజ్‌లో 'క్విక్ ఈట్‌మీ బాక్స్' బాక్సును ఉంచడం వల్ల అందులో ఉంచిన పదార్థాలు త్వరగా తినే అవకాశం ఉంటుంది. తద్వారా వృథాకు చెక్‌ పెట్టవచ్చు. పాడయ్యే వస్తువులను, పడేసే వస్తువులను లిస్టు రాసుకోవడం వల్ల ఆ తర్వాత అలాంటివాటిని తక్కువగా కొనే వీలుంటుంది. అంతేకాదు.. ఫ్రిజ్ ఉష్ణోగ్రతను 1 నుంచి 5 డిగ్రీల మధ్య ఉంచుకోవడం వల్ల ఆహారపదార్థాలు తొందరగా పాడవకుండా జాగ్రత్తపడచ్చు.

చూశారుగా.. ఆహారపదార్థాల వృథాను ఎలా అరికట్టవచ్చో.. మరి, మీరూ వీటిని ప్రయత్నించి, వృథాకు కళ్లెం వేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్