అలాంటి విషయాలు చర్చించాలంటే..

స్నేహితులు, సహోద్యోగులు, దంపతులు, బంధువులు.. ఎవరైనా సరే.. అనుబంధాలలో సమస్యలు తలెత్తినప్పుడు సామరస్య పూర్వకమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు. అయితే అన్ని చర్చలు ఫలప్రదంగా ముగిసే అవకాశం ఉండదు. ముఖ్యంగా కొన్ని కీలకమైన, సున్నితమైన విషయాల గురించి చర్చించేటప్పుడు ఇలాంటివి....

Published : 28 Oct 2022 17:59 IST

స్నేహితులు, సహోద్యోగులు, దంపతులు, బంధువులు.. ఎవరైనా సరే.. అనుబంధాలలో సమస్యలు తలెత్తినప్పుడు సామరస్య పూర్వకమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు. అయితే అన్ని చర్చలు ఫలప్రదంగా ముగిసే అవకాశం ఉండదు. ముఖ్యంగా కొన్ని కీలకమైన, సున్నితమైన విషయాల గురించి చర్చించేటప్పుడు ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలాంటి చర్చల్లో ఆందోళన, ఆవేశం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇలాంటి చర్చలు ప్రారంభించేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి అవేంటో తెలుసుకుందామా...

అనుమతితో...

కఠిన నిర్ణయాల గురించి చర్చించేటప్పుడు ఆందోళన, ఆవేశం రావడం సహజం. కాబట్టి, చర్చను ప్రారంభించే ముందు ఎదుటి వ్యక్తి మానసిక స్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వారు ప్రశాంతంగా ఉన్నప్పుడు చర్చించడం వల్ల సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చర్చకు ముందే విషయ ప్రాధాన్యం గురించి అవతలి వ్యక్తికి తెలిపి.. వారి అనుమతి తీసుకోవడం మంచిది.

జాగ్రత్తగా వినాలి...

ఇతరులతో మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తి చెప్పే విషయాలను జాగ్రత్తగా వినాలి. అప్పుడు వారి అభిప్రాయాలను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మాటల మధ్యలో కలగజేసుకోవడం వల్ల లేనిపోని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అవతలి వ్యక్తి చెప్పే విషయం అర్థం కాకపోతే వివరించమని అడగాలి. ఇలా చేయడం వల్ల మీకు కొత్త విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అవతలి వ్యక్తి కూడా మీరు చెప్పే విషయాలను వినే అవకాశం ఉంటుంది. అయితే చర్చ మధ్యలో అవతలి వ్యక్తి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే మాటలు రాకుండా జాగ్రత్త పడడం మంచిదంటున్నారు నిపుణులు.

వారి వైపు నుంచి..

సాధారణంగా చర్చను మొదలుపెట్టే వారు అందుకు ముందుగానే సన్నద్ధమవుతుంటారు. కాబట్టి, వారి అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తుంటారు. ఈ క్రమంలో వారి మాటే నెగ్గాలని భావిస్తుంటారు. కానీ, అవతలి వ్యక్తి చెప్పే మాటలను పెద్దగా పట్టించుకోరు. కీలక విషయాల గురించి చర్చించేటప్పుడు ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే సమస్యను అవతలి వ్యక్తి దృష్టి కోణం నుంచి చూస్తేనే సరైన పరిష్కారం లభిస్తుందని అంటున్నారు నిపుణులు.

ప్రత్యామ్నాయం ఆలోచించాలి..

కీలక విషయాల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాల్లో భావోద్వేగానికి లోనయ్యే అవకాశమూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కొంత సమయం విరామం ఇవ్వడం మంచిది. అలాగే మరికొన్ని సందర్భాల్లో ఎంతసేపు చర్చించినా భేదాభిప్రాయాలు ఏకాభిప్రాయంగా మారవు. ఇలాంటి సందర్భాల్లో ఇరువురికీ అనుగుణంగా మూడో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడం మంచిదంటున్నారు నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్