Published : 04/10/2021 19:18 IST

బరువు.. తగినంత తగ్గామని తెలుసుకోవడమెలా?

అధిక బరువు.. చాలామందికి ఓ పెద్ద సమస్య ఇది.. ఈ నేపథ్యంలో తాము కోరుకున్న సంఖ్య వెయింగ్ స్కేల్‌పై కనిపించేవరకూ కష్టపడుతూనే ఉంటారు. ఇందుకోసం కొందరు విభిన్న రకాల డైట్లను ఫాలో అవుతుంటే, మరికొందరేమో చెమటోడ్చి వ్యాయామాలు చేస్తుంటారు. మంచి పోషకాహారం, చక్కటి వ్యాయామం ఈ రెండూ మన శరీరం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చాలామంది ఈ మార్గంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతారు. కానీ ఈ రెండూ ఎక్కడ ఆపాలన్న విషయం మాత్రం వారికి అర్థం కాదు.. ఇంతకీ బరువు తగ్గాల్సిన అవసరం లేదు అని మనకు ఎప్పుడు అనిపిస్తుంది? తగినంత బరువు తగ్గామని ఎలా తెలుసుకోవచ్చు? చూద్దాం రండి..

ఎనర్జిటిక్‌గా ఫీలవుతారు..

బరువు తగ్గడానికి మీ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మీరు ఎలా ఫీలయ్యేవారో మీకు తెలుస్తుంది. అక్కడి నుంచి ప్రారంభించి ప్రతి కేజీ తగ్గిన కొద్దీ మీ శరీరం తేలికవుతున్న భావన మీకు కలుగుతుంది. అయితే మీరు ఉండాల్సినంత బరువుకి చేరుకున్నప్పుడు మాత్రం మీ మనసు, శరీరం రెండూ ఉత్సాహంగా గంతులేసినట్లుగా ఉంటాయి. పట్టలేనంత శక్తి, ఉత్సాహం ఉరకలెత్తుతుంది. రోజులో ఏ నిమిషంలోనూ నిరుత్సాహం, బద్ధకం అనేవి మన దగ్గరికి చేరవని చెప్పుకోవచ్చు. ఇలా పూర్తి ఉత్సాహంతో ఉండడం మీరు తగినంత బరువు తగ్గారని చెప్పడానికి ప్రతీక అనుకోవచ్చు.

ఆరోగ్య సమస్యలు దూరం..

బరువు ప్రస్తుతం చాలామందికి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ తరహా సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. థైరాయిడ్, పీసీఓడీ వంటివి అధిక బరువు ఉన్నవారిలోనే కనిపిస్తాయి. దీనికి తోడు జీవనశైలికి సంబంధించిన సమస్యలు ఉండనే ఉంటాయి. వీటితో పాటు నిద్రపట్టకపోవడం, ఆయాసం, కీళ్ల నొప్పులు వంటివి కూడా కనిపిస్తాయి. అయితే మీరు చేరుకోవాల్సిన బరువుకి చేరుకున్న తర్వాత ఈ సమస్యలన్నీ దూరమవుతాయి. డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా అదుపులోకి వస్తాయి.

సరైన జీవక్రియలు..

మనం కాస్త లావుగా ఉన్నప్పుడు మన శరీరంలో జీవక్రియలు నెమ్మదిగా జరుగుతుంటాయి. అదే మనం బరువు తగ్గుతున్న కొద్దీ మన జీవక్రియల వేగం పెరుగుతుంది.. దీనివల్ల ఆహారం వేగంగా జీర్ణమవడమే కాదు.. క్యాలరీలు కూడా ఎక్కువగా ఖర్చవుతాయి. దీనివల్ల బరువు పెరగకుండా మన శరీరం తనని తాను కాపాడుకుంటుంది. మనం తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. సమయానుగుణంగా మనకి ఆకలవుతోందంటే అది మన బరువు తగిన స్థాయికి చేరుకుందని భావించేందుకు ఓ సూచనగా చెప్పుకోవచ్చు.

బరువు తగ్గట్లేదా?

'నేను 80 కేజీలుండేదాన్ని.. 50 కేజీలకు చేరుకోవాలనుకున్నా.. వ్యాయామం చేస్తూ.. మంచి ఆహారం తీసుకుంటూ 55 వరకూ చేరుకున్నా.. ఇక మరింత బరువు తగ్గడం నా వల్ల కావడం లేదు..' అంటూ చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ విషయమై మీరే ఒకసారి పునరాలోచించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ శరీరం ఒక స్థాయికి మించి బరువు తగ్గట్లేదంటే అంతకంటే తగ్గేందుకు మీ శరీరం సహకరించట్లేదని అర్థం. అందుకే మీరు పెట్టుకున్న లక్ష్యం సాధ్యమయ్యేదో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు అనుకున్న బరువుకి కాస్త దగ్గరలో ఆగిపోయినా పెద్దగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా మీరు తగ్గాల్సిన బరువు పది కేజీల కంటే ఎక్కువగా ఉంటే మాత్రం వ్యాయామం, ఆహార నియమాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడమూ మంచిదే.


Advertisement

మరిన్ని