ఆ వ్యాధులు.. ఇలా కూడా రావచ్చట!

శృంగారం.. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది.. అయితే అదే శృంగారం కొన్నిసార్లు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కూడా చూపుతుంది.. అదెలా అనుకుంటున్నారా.. సుఖ వ్యాధుల రూపంలో! సాధారణంగా ఈ సమస్యలున్న భాగస్వామితో లైంగిక చర్యలో....

Updated : 21 Nov 2022 12:42 IST

శృంగారం.. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది.. అయితే అదే శృంగారం కొన్నిసార్లు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కూడా చూపుతుంది.. అదెలా అనుకుంటున్నారా.. సుఖ వ్యాధుల రూపంలో! సాధారణంగా ఈ సమస్యలున్న భాగస్వామితో లైంగిక చర్యలో పాల్గొనడం ద్వారానే సంక్రమిస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ శృంగారం చేయకుండా కూడా ఈ వ్యాధుల తాలూకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

ముద్దూ ప్రమాదమేనట!

లైంగిక చర్యలో భాగంగా భాగస్వామికి ముద్దు పెట్టడం వల్ల కూడా సుఖ వ్యాధుల తాలూకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అయితే పెదాలపై గాయాలు, పుళ్లు.. వంటివి ఉన్నప్పుడు ఈ తీవ్రత మరింత పెరుగుతుందంటున్నారు. ముఖ్యంగా ముద్దు వల్ల HSV-1, HSV-2, సిఫిలిస్‌.. వంటి పలు సుఖ వ్యాధుల తాలూకు వ్యాధి కారకాలు లాలాజలంతో కలిసి శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉందంటున్నారు. అలాగే ఓరల్‌ సెక్స్‌ మరింత ప్రమాదకరం అంటున్నారు. దీని ద్వారా Chlamydia, Gonorrhea.. వంటి వ్యాధి కారకాలు శరీరంలోకి వెళ్లే అవకాశం అధికంగా ఉంటుందంటున్నారు.

వాటిని పంచుకుంటున్నారా?

ఇంట్లో భార్యాభర్తలు చాలా వస్తువుల్ని ఉమ్మడిగా వాడడం తెలిసిందే! అయితే కొన్ని వస్తువుల వల్ల సుఖ వ్యాధులు సంక్రమించే ప్రమాదం పొంచి ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రేజర్లు, సెక్స్‌ టాయ్స్‌తో ఈ సమస్య తీవ్రమవుతుందంటున్నారు. అలాగే పొరపాటున సుఖ వ్యాధులున్న భాగస్వామి/ఇతర వ్యక్తి రక్తం ఎక్కించుకున్నా, వారికి ఉపయోగించిన సూదులు, ట్యాటూ మెషీన్లు ఇతరులకు వాడినా.. హెచ్‌ఐవీ వంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు హెపటైటిస్‌ సమస్య బారిన పడే అవకాశం ఉందంటున్నారు.

‘టచ్‌’ చేసినా..!

సుఖ వ్యాధులున్న భాగస్వామి శరీరంలో వ్యాధి కారకాలు రోజురోజుకీ వృద్ధి చెందుతుంటాయి. ఇక వాళ్ల శరీరంపై గాయాలు, పుళ్లు.. వంటివి ఉంటే.. వాటి ద్వారా కూడా ఈ వ్యాధులు సంక్రమిస్తాయంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. వారి జననేంద్రియాల్లో ఇలాంటివి ఉంటే.. వాటిని తాకడం, అదే చేత్తో మన శరీరంపై ఉన్న గాయాల్ని టచ్‌ చేయడం, ఇతర పనుల వల్ల కూడా వ్యాధి కారకాలు మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందంటున్నారు. ఇలా స్కిన్‌-టు-స్కిన్‌ కాంటాక్ట్‌ వల్ల హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం అధికంగా ఉంటుందట!

‘కండోమ్స్‌’.. సురక్షితమేనా?

చాలామంది సుఖ వ్యాధులు శృంగారం ద్వారానే సోకుతాయనుకుంటారు. కానీ పైవిషయాలను బట్టి ఈ రెండింటికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.. తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే భాగస్వామిలో ఇలాంటి ఆరోగ్య సమస్యలున్నప్పుడు చాలామంది ఎంచుకునే ఆప్షన్‌ కండోమ్స్‌.. వంటి సురక్షిత లైంగిక పద్ధతులు. కానీ అవీ పూర్తిగా సురక్షితమే అని చెప్పలేమంటున్నారు నిపుణులు. కాబట్టి వీటి గురించి మీ వ్యక్తిగత డాక్టర్‌ని అడిగి తగిన సలహా తీసుకోవచ్చు. అలాగే ఇతర సురక్షిత ప్రత్యామ్నాయ పద్ధతుల గురించీ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా.. శృంగారంలో చురుగ్గా ఉండేవాళ్లు, తరచూ లైంగిక చర్యలో పాల్గొనేవాళ్లు.. ఏడాదికోసారి సుఖ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ సూచిస్తోంది. తద్వారా ఈ వ్యాధి తాలూకు ఇన్ఫెక్షన్లను ముందే పసిగట్టి ఆదిలోనే చికిత్స తీసుకోవచ్చని చెబుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని