హర్ట్ అయినా క్షమించేయండి!

స్నేహితుల మధ్య గొడవలు.. ప్రేమికుల మధ్య మనస్పర్థలు.. భార్యాభర్తల మధ్య అపార్థాలు.. ఇలా సందర్భమేదైనా ఇద్దరిలో ఒకరు ఇంకొకరిని హర్ట్‌ చేయడం, ఆ కోపంతో మనల్ని బాధపెట్టిన వారిని దూరం పెట్టడం, వారితో మాట్లాడడం పూర్తిగా మానేయడం.. వంటివి చాలామంది విషయంలో....

Published : 28 Dec 2022 18:38 IST

స్నేహితుల మధ్య గొడవలు.. ప్రేమికుల మధ్య మనస్పర్థలు.. భార్యాభర్తల మధ్య అపార్థాలు.. ఇలా సందర్భమేదైనా ఇద్దరిలో ఒకరు ఇంకొకరిని హర్ట్‌ చేయడం, ఆ కోపంతో మనల్ని బాధపెట్టిన వారిని దూరం పెట్టడం, వారితో మాట్లాడడం పూర్తిగా మానేయడం.. వంటివి చాలామంది విషయంలో జరుగుతూనే ఉంటాయి. అయితే తమ తప్పు తెలుసుకొని అవతలి వాళ్లు క్షమాపణ కోరినా.. ‘నాకు నచ్చని ఒకే ఒక పదం అది’ అంటూ సీరియసైపోతారు కొంతమంది. కొత్త సంవత్సరం నేపథ్యంలో అయినా ఇలాంటి మొండితనాన్ని వదులుకోమంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. ఇది ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని పూర్తిగా తెంచడమే కాదు.. మీరెంత మంచివారైనా ఎదుటివారికి మీరంటే వ్యతిరేక భావన కలిగేలా చేస్తుందంటున్నారు. వారు మిమ్మల్ని బాధపెట్టిన మాట వాస్తవమే అయినా.. అందులో తప్పొప్పుల్ని గ్రహించి, వారి పశ్చాత్తాప భావనను అర్థం చేసుకొని.. కాస్త పెద్ద మనసుతో వారిని మన్నించగలిగితే.. ఇటు మీకు, అటు వారికి మనసు తేలిక పడుతుంది. అనుబంధమూ నిలబడుతుంది. మరి, అదెలాగో చూద్దాం రండి..!

స్వీయ పరిశీలన చేసుకోండి!

మిమ్మల్ని మీకంటే బాగా ఇంకెవరూ చదవలేరు. మీలోని సానుకూలతలు, ప్రతికూలతల గురించి మీకు మాత్రమే పూర్తి అవగాహన ఉంటుంది. మిమ్మల్ని హర్ట్‌ చేసిన వారిని మన్నించే క్రమంలో ఇవే కీలకం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొంతమంది.. ‘తను చేసిన పని వల్ల నా మనసు విరిగిపోయింది.. తనను క్షమించడం ఈ జన్మలో జరగని పని’ అంటూ మొండికేస్తుంటారు. ఇదిగో ఇలాంటప్పుడే మీలోని సానుకూల అంశాలను ఒక్కసారి పునరావలోకనం చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇవే మనసును ప్రతికూలతల నుంచి పాజిటివిటీ వైపు మళ్లిస్తాయి. మనం తలచుకుంటే జరగని పని అంటూ ఏదీ ఉండదు. మన్నించడం కూడా అంతే! నిజంగా వారు మిమ్మల్ని బాధపెట్టి, అది తప్పే అని వారు ఒప్పుకుంటే.. సానుకూల దృక్పథంతో ఆలోచించి వారిని క్షమించేయండి.. బంధాన్ని నిలుపుకోండి!

అర్థం చేసుకోండి.. ప్లీజ్!

పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు పెద్దలు. మిమ్మల్ని బాధపెట్టిన వారు క్షమాపణ కోరే క్రమంలో.. వారిపై కస్సుబుస్సులాడటం, చెప్పేది వినకుండా అక్కడ్నుంచి వెళ్లిపోవడం, ‘జీవితంలో నీ మొహం నాకు చూపించకు’.. వంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం సరికాదు. ఏ సమస్యైనా మాట్లాడుకుంటేనే పరిష్కారమవుతుంది. కాబట్టి మిమ్మల్ని బాధపెట్టడానికి ఎదుటివారు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకోండి. వారు చెప్పే మాటలు పూర్తిగా విన్నాక.. అందులో ఇంకా సందేహముంటే వారిని నిలదీయచ్చు.. దానివల్ల మీరెంత బాధపడ్డారో వారికి వివరించచ్చు. నిజానికి ఈ భావోద్వేగాలే ఇద్దరినీ తిరిగి దగ్గర చేస్తాయంటున్నారు నిపుణులు.

మీ కోపం.. ఏ టైపు?

కొంతమందికి కోపం క్షణాల్లో మాయమవుతుంటుంది. ఇక ఆ తర్వాత అంతా మామూలే అన్నట్లుగా ఎదుటివారిని మన్నించేస్తుంటారు.. ఇక, మరికొంతమంది మాత్రం అదే విషయాన్ని పట్టుకు వేలాడుతుంటారు. రోజులకు రోజులు అదే కోపాన్ని కొనసాగిస్తుంటారు. ఇలాంటి వారు ఎదుటివారిని ఎప్పటికీ క్షమించరు సరికదా.. తమ చుట్టూ ఉన్న ఇతర బంధాల పైనా ఈ తరహా ప్రవర్తనను చూపుతుంటారట! తద్వారా దీని ప్రభావం సామాజిక బంధాలపై పడుతుందని, ఇదే దీర్ఘకాలంలో వారి మానసిక, శారీరక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఈ రెండింట్లో మీది ఏ తరహా కోపమో పరిశీలించుకొని.. ఎదుటివారి క్షమాపణను అంగీకరిస్తారో.. లేదంటే మీరే సమస్యల్ని కొనితెచ్చుకుంటారో నిర్ణయించుకోమంటున్నారు.

కౌన్సెలింగ్‌ ఎప్పుడంటే..!

కొంతమంది ఎదుటివారి తప్పును క్షమించినా, క్షమించకపోయినా నిరంతరం దాని గురించే ఆలోచిస్తుంటారు. క్షమించి పొరపాటు చేశామా? వాళ్ల దృష్టిలో చులకనయ్యామా? అంటూ తమను తామే నిందించుకుంటుంటారు. ఎక్కడికెళ్లినా, ఎవరితో మాట్లాడినా ఇదే ధ్యాసలో ఉండిపోతారు. దీనివల్ల అటు మానసికంగానే కాదు.. శారీరకంగానూ నష్టపోతారు. మీరూ ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారా? అయితే వెంటనే నిపుణుల కౌన్సెలింగ్‌ తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. తద్వారా సమస్య మీరకుండా, మీపై మీకు ప్రతికూల భావాలు ఏర్పడకముందే జాగ్రత్తపడమంటున్నారు. స్వీయ ప్రేమను పెంచుకోమంటున్నారు. ఇలాంటి సానుకూల దృక్పథం ఏర్పరచుకోగలిగితే.. అన్ని విషయాల్నీ పాజిటివ్‌ కోణంలోనే చూడగలుగుతారు. అనుబంధాల్ని కాపాడుకోవాలంటే ఇలాంటి పాజిటివిటీనే కావాలంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్