సి-సూట్‌కి స్వాగతం!

ఐటీసీ సంస్థలో పనిచేసే మహిళా మేనేజర్లు... బిజినెస్‌ ట్రిప్‌కి వెళ్తూ నెలల పాపాయినీ... తనని చూసుకోవడానికి ఒక నానీనికూడా వెంటబెట్టుకుని వెళ్లొచ్చు. ఆ ఖర్చంతా ఆ సంస్థే భరిస్తుంది. ఒక ఐటీసీ అనేకాదు... మారికో, ఎల్‌ అండ్‌ టీ వంటి సంస్థలూ ఇలాంటి సదుపాయాలనే అందిస్తూ తమ సంస్థల్లో ఉన్నత హోదాల్లో మహిళలు ఉండాలని పట్టుబడుతున్నాయి.

Updated : 19 Jun 2024 02:54 IST

ఐటీసీ సంస్థలో పనిచేసే మహిళా మేనేజర్లు... బిజినెస్‌ ట్రిప్‌కి వెళ్తూ నెలల పాపాయినీ... తనని చూసుకోవడానికి ఒక నానీనికూడా వెంటబెట్టుకుని వెళ్లొచ్చు. ఆ ఖర్చంతా ఆ సంస్థే భరిస్తుంది. ఒక ఐటీసీ అనేకాదు... మారికో, ఎల్‌ అండ్‌ టీ వంటి సంస్థలూ ఇలాంటి సదుపాయాలనే అందిస్తూ తమ సంస్థల్లో ఉన్నత హోదాల్లో మహిళలు ఉండాలని పట్టుబడుతున్నాయి. ‘సి-సూట్‌ సూపర్‌ పవర్‌ మహిళల’కు ప్రపంచవ్యాప్తంగా ఎందుకింత డిమాండ్‌?

రియా... మేకప్‌ ఆర్టిస్ట్‌. తోటి మేకప్‌ ఆర్టిస్టులంతా స్పాంజ్‌లతో ఇబ్బందిపడుతుంటే తను మాత్రం స్పాంజ్‌ని ఒడుపుగా కత్తిరించి బ్యూటీ బ్లెండర్‌గా మార్చి దాంతో చకచకా మేకప్‌ వేసేది. ఆ తరవాత ఆ బ్యూటీ బ్లెండర్ల (నీటి బొట్టు ఆకృతిలో ఉండే స్పాంజ్‌లు) తయారీతోనే కోట్లకు పడగలెత్తి ఫోర్బ్స్‌ మెచ్చుకోలు అందుకుంది. అంతవరకూ ఎందుకు? గజల్‌ అలఘ్‌ కథ తెలుసుగా... తన పాపాయి కోసం తయారుచేసిన రసాయన రహిత ఉత్పత్తులతోనే ‘మామాఎర్త్‌’ని స్థాపించి కోట్లు కురిపించింది. సరిగా ఫిట్‌కాని బ్రాలతో ఇబ్బందులు పడీపడీ జివామె అనే ఇన్నర్‌వేర్‌ సంస్థను స్థాపించి ఆ రంగంలో తనదైన ముద్ర వేసింది రిచాకౌర్‌. మహిళలు చేసిన ఈ ఎక్స్‌క్లూజివ్‌ ఆలోచలు ఎంతగా ఎదురులేకుండా ఎదుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పాలా? ఈ సృజనాత్మకతనే ఇండియా ఇంక్‌ (ప్రభుత్వ, కార్పొరేట్‌ వ్యాపారసంస్థల్ని కలిపి ఇలా అంటున్నారు) సంస్థలూ కావాలనుకుంటున్నాయి.

నాయకత్వానికి శిక్షణ...

గడిచిన ఐదేళ్లలో మనదేశంలో సి-సూట్‌  హోదాల్లోకి 18శాతం మహిళలు వచ్చారు. సి-సూట్‌ అంటే... ఒక సంస్థకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటూ, దానిని అమలు అయ్యేట్టు చూసేవాళ్లు. అంటే... సీఈవో, సీఎఫ్‌ఓ, సీఓఓ వంటి వాళ్లందర్నీ ఇలా సి-సూట్‌ అధికారులు అంటారు. యాక్సెంచర్‌ టెక్నాలజీలో 29శాతం మహిళలు నాయకత్వ హోదాల్లో ఉన్నారు. ఇక దియాజియో ఇండియా... ప్రపంచంలోనే పేరున్న బెవరేజెస్‌ సంస్థ. దీనిలో 30శాతం మహిళలు లీడర్‌షిప్‌హోదాలో ఉన్నారు. ప్రముఖ నిత్యావసరాల సంస్థ మారికో తెలుసుగా! ఇందులో 30శాతం మహిళలు సి-సూట్‌లో ఉన్నారు. ఇక పెప్సికో తెలియనిదెవ్వరికి? వచ్చే ఏడాదికల్లా 50శాతం మహిళలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ప్రణాళికలు వేసుకుంది. ఎల్‌ అండ్‌ టీ సంస్థ అయితే ఎంపిక చేసిన మహిళలకి నాయకత్వ శిక్షణే ఇస్తోంది. ఈ మార్పంతా గత ఐదేళ్లలో జరిగిందే! అయితే ప్రతి సంస్థా ఇదే తీరు పాటిస్తుందా అంటే లేదు. తాజా అధ్యయనం ప్రకారం... 8 నుంచి 30శాతం మహిళలు మాత్రమే నాయకత్వ హోదాలని అందుకున్నారు. 9 శాతం సంస్థల్లో నామమాత్రంగా కూడా ఈ స్థాయిలో లేరు. ప్రపంచవ్యాప్తంగా నాయకత్వ హోదాల్లో 23 శాతం మహిళలు ఉంటే... మనదేశంలో 18శాతం మాత్రమే ఉన్నారు. ఇలా ఉన్నతహోదాలిచ్చి ప్రోత్సహిస్తున్న వాటిల్లో లైఫ్‌ సైన్సెస్, ఆరోగ్య రంగాలు ముందున్నాయి. ఇందులో 21 శాతం మహిళలు ఉన్నారు. ఆ తరవాత టెక్నాలజీ, మీడియా కమ్యునికేషన్స్‌లో 20శాతం మంది ఉన్నారు. కన్స్యూమర్‌ బిజినెస్‌లో 19 శాతం, మాన్యుఫాక్చరింగ్‌ రంగంలో 17 శాతం, ఫైనాన్స్‌లో 16శాతం మహిళలు బాస్‌లుగా సంస్థలకు సారథ్యం వహిస్తున్నారు.  

ఎందుకు ఉండాలి...

గతంలో మనల్ని ఉద్యోగాల్లోకి తీసుకోవడానికే అనేక ఆంక్షల్ని విధించిన సంస్థలు, ఇప్పుడు నాయకత్వ హోదాల్లోకి ప్రత్యేకించి ఎందుకు ఆహ్వనిస్తున్నాయి? బోర్డురూముల్లో  మహిళలు ఉండటం వల్ల... వ్యాపారధోరణిలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. నిర్ణయాల్లో సామాజిక ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తారు. అందుకే పెట్టుబడిదారులు కూడా నాయకత్వ హోదాల్లో మహిళలు ఉంటేనే పెట్టుబడులు పెడతామని షరతులు విధిస్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ, కన్స్యూమర్, ఫ్యాషన్, లగ్జరీ వ్యాపారాల్లో టాప్‌ లీడర్‌ పొజిషన్లలో మహిళలు ఉండితీరాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికితోడు సెబీ(సెక్యూరిటీ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) తప్పనిసరిగా లిస్టెడ్‌ కంపెనీల్లో కనీసం ఒక్కరైనా మహిళా డైరెక్టర్‌ ఉండాలనే నిబంధన పెట్టింది. దీనివల్ల నిఫ్టీఫిఫ్టీ సంస్థల్లో మొదలుకుని తక్కిన వాటిల్లోనూ మహిళా డైరెక్టర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. బోర్డు రూముల్లో మహిళా డైరెక్టర్లని తీసుకోవడం వల్ల 20శాతం ఉత్పాదకత పెరుగుతుందని ఐఎల్‌ఓ చెబుతోంది. అర్హతతోపాటు నాయకత్వ హోదాను అందుకొనే ఆత్మవిశ్వాసం పెంచుకుంటే సరి... అవకాశాలని అందిపుచ్చుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్