Updated : 25/09/2021 16:33 IST

Dengue and Malaria : ఈ ఐదు చిట్కాలు మేలు చేస్తాయ్‌!

డెంగ్యూ, మలేరియా.. ప్రస్తుతం చాలామందిని కలవరపెడుతోన్న సీజనల్‌ వ్యాధులు. పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా వీటి బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దోమకాటుతో వచ్చే ఈ ఆరోగ్య సమస్యలు.. జ్వరం, వాంతులు, విరేచనాలు, తీవ్రమైన తలనొప్పి, కండరాలు-కీళ్ల నొప్పులు, ఆకలి మందగించడం.. వంటి ఎన్నో లక్షణాలను మోసుకొస్తాయి. డెంగ్యూ కారణంగా కొందరిలో ప్లేట్‌లెట్స్ పడిపోయి ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంటుంది. అయితే ఈ క్రమంలో పోషకాహారం, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే వీటి బారి నుంచి త్వరగా కోలుకోవచ్చంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. సరైన విశ్రాంతితో పాటు కొన్ని యోగాసనాలూ మేలు చేస్తాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సీజనల్‌ వ్యాధుల నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు సైతం సూచించారు రుజుత.

 

గుల్‌కంద్‌

అజీర్తి, తలనొప్పి, మలబద్ధకం, నిద్రలేమి, నీరసం, వికారం, వాంతులు.. తదితర లక్షణాల నుంచి ఉపశమనం కలిగించే గుణాలు గుల్‌కంద్‌లో పుష్కలంగా ఉంటాయి. అందుకే డెంగ్యూ, మలేరియా సోకిన వారు ఉదయం లేదా సాయంత్రం ఒక టీస్పూన్‌ గుల్‌కంద్‌ను తీసుకుంటే ఈ లక్షణాలన్నీ దూరమవుతాయి.

పసుపు పాలు

పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తినిస్తాయి. అదేవిధంగా ఇందులోని కర్క్యుమిన్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాబట్టి పసుపు పాలను తీసుకుంటే డెంగ్యూ, మలేరియా నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే.. గ్లాసు పాలలో చిటికెడు పసుపు, 2-3 కుంకుమ పువ్వు రేకలు, చిన్న జాజికాయ ముక్క వేసి.. పాలు సగానికి వచ్చేంత వరకు మరిగించాలి. రుచి కోసం కొద్దిగా బెల్లం కలుపుకొని వేడిగానైనా లేదా చల్లార్చుకొనైనా తాగాలి. ఫలితంగా శరీరంలోని వాపు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

గంజి

సాధారణంగా అన్నం ఉడికిన తర్వాత మిగిలిన గంజిని మనం పారబోస్తుంటాం. కానీ అలా చేయకుండా ఈ నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకుని తాగడం చాలా మంచిది. ఎందుకంటే ఈ గంజిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇక డెంగ్యూ, మలేరియా బాధితులు నీళ్లు ఎక్కువగా తాగాలని.. కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే వీటితో పాటు గంజిని కూడా తీసుకోవడం చాలా మంచిది. ఈ గంజిలో కొద్దిగా బ్లాక్‌సాల్ట్‌/రాక్‌సాల్ట్‌, చిటికెడు ఇంగువ కలిపి తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్యలు తొలగిపోతాయి. శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ క్షీణించవు. ఆకలి కూడా పెరుగుతుంది.

తగినన్ని నీళ్లు!

డెంగ్యూ, మలేరియా సోకిన వారు క్రమం తప్పకుండా నీళ్లు తాగుతూ ఉండాలి. అదేవిధంగా మూత్రం పరిమాణం, రంగు, పారదర్శకతలో ఏవైనా తేడాలున్నాయో గమనించి.. ఒకవేళ ఉంటే వెంటనే నిపుణుల్ని సంప్రదించాలి.

యోగా

డెంగ్యూ, మలేరియా బాధితులు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. అదే సమయంలో యోగా, ధ్యానం వంటి వ్యాయామాలకు కూడా ప్రాధాన్యమివ్వడం వల్ల వేగంగా కోలుకోవచ్చు. సుప్తబద్ధకోణాసనం వంటి యోగాసనాలు చేయడం వల్ల తలనొప్పి, ఒళ్లునొప్పులు, అలసట.. వంటి లక్షణాలు దూరమవుతాయి.


Advertisement

మరిన్ని