Alia Bhatt: అప్పుడే మరింత దగ్గరయ్యాం!

మనసైన వాడు తనకోసం ఏం చేసినా ప్రేయసికి ప్రత్యేకమే! ఇక ప్రేమికులిద్దరి మధ్య జరిగే ప్రేమ ప్రపోజల్స్‌ తమకు మాత్రమే సొంతమనేలా ఉంటాయి. అలా రణ్‌బీర్‌ కపూర్‌ తనకు చేసిన ప్రేమ ప్రతిపాదన తన జీవితంలోనే ఓ అందమైన జ్ఞాపకమంటూ మురిసిపోతోంది అందాల....

Updated : 09 Jul 2022 17:34 IST

మనసైన వాడు తనకోసం ఏం చేసినా ప్రేయసికి ప్రత్యేకమే! ఇక ప్రేమికులిద్దరి మధ్య జరిగే ప్రేమ ప్రపోజల్స్‌ తమకు మాత్రమే సొంతమనేలా ఉంటాయి. అలా రణ్‌బీర్‌ కపూర్‌ తనకు చేసిన ప్రేమ ప్రతిపాదన తన జీవితంలోనే ఓ అందమైన జ్ఞాపకమంటూ మురిసిపోతోంది అందాల ఆలియా భట్‌. మూడు నెలల క్రితం తన కలల రాకుమారుడితో ఏడడుగులు నడిచిన ఈ చిన్నది.. తాజాగా ‘కాఫీ విత్‌ కరణ్‌’షోలో పాల్గొంది. తన ఇష్టసఖుడి గురించి, ప్రేమ-పెళ్లి, వైవాహిక బంధం.. ఇలా బోలెడన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. మరి, ఈ కార్యక్రమంలో ఆలియా ఏం చెప్పింది? రండి.. మనమూ తెలుసుకుందాం..!

ఐదేళ్ల ప్రేమను ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి పట్టాలెక్కించారు బాలీవుడ్‌ నటీనటులు ఆలియా భట్‌ - రణ్‌బీర్‌ కపూర్‌. పెళ్లికి ముందు, వివాహం తర్వాత ఈ మూడు నెలల్లోనూ తమ ప్రేమ, లవ్‌ ప్రపోజల్‌ గురించి ఏ ఒక్క విషయమూ బయటపెట్టలేదీ జంట. అయితే తాజాగా ఆ విశేషాలను ‘కాఫీ విత్‌ కరణ్‌’షోలో భాగంగా పంచుకుంది ఆలియా. ‘రాఖీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ చిత్ర సహనటుడు రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైన ఈ ముద్దుగుమ్మ.. షో వ్యాఖ్యాత కరణ్‌ జోహర్‌ సంధించిన ఆసక్తికర ప్రశ్నలకు అంతే ఆసక్తికరంగా సమాధానాలిచ్చింది. ఆ విశేషాలే ఇవి!

‘Mrs Hipster’ అర్థమదే!

మనసుకు నచ్చిన వాడితో ప్రేమ, అనుబంధం ఏ అమ్మాయికైనా ప్రత్యేకమే! ఇక వాళ్లు ప్రేమతో ఇచ్చే కానుకలు జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అలాగే రణ్‌బీర్‌ నా వేలికి తొడిగిన డైమండ్‌ రింగ్‌ (నిశ్చితార్థపు ఉంగరం) వెనుక ఓ చిన్న కథ దాగుంది. మా ప్రేమ బంధానికి గుర్తుగా దాన్ని ఎంతో ప్రత్యేకంగా తయారుచేయించాడు రణ్‌బీర్‌. ‘Mrs Hipster’ పేరును ఎంతో ఆకర్షణీయంగా దానిపై చెక్కించాడు. ఇందులో ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థముంది. అది మా ఇద్దరికే తెలుసు. రణ్‌బీర్‌ నాకిచ్చిన ఈ ప్రత్యేకమైన కానుక నా మనసు తనకు మరోసారి ఫిదా అయ్యేలా చేసింది.

అప్పుడే మరింత దగ్గరయ్యాం!

నాకు ఊహ తెలిసినప్పట్నుంచీ రణ్‌బీర్‌నే వరించాను. బర్ఫీ సినిమా చూశాక అతడిపై ఇష్టం మరింత పెరిగింది. ఆ తర్వాత సినిమా ఆడిషన్స్‌, షూటింగ్స్‌, పలు కార్యక్రమాల్లో ఇద్దరం కలిశాం. ఒకరిపై ఒకరికి మనసు నిండా ప్రేమున్నా ఎదురుపడి పంచుకుంది లేదు. అయితే ‘బ్రహ్మాస్త్ర’ సినిమా చిత్రీకరణ సమయంలో మేం మరింత దగ్గరయ్యామని చెప్పాలి. ఈ చిత్ర వర్క్‌షాప్‌లో భాగంగా ఓ రోజు ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవివ్‌ పట్టణానికి విమానంలో బయల్దేరాం. ఆ సమయంలో రణ్‌బీర్‌ నా పక్క సీట్లోనే కూర్చోవాలని కోరుకున్నాడు. అనుకున్నట్లే కూర్చున్నాడు కూడా! దాంతో నా మనసులో ఏదో తెలియని ఉత్సాహం! అయితే కొద్ది సేపటికే సీట్లో ఏదో లోపం ఉండడంతో తను వేరే దగ్గరికి మారాల్సి వచ్చింది. అప్పుడు ఒక్కసారిగా ‘నా కలలన్నీ నీరు గారిపోతున్నాయా?’ అనిపించింది. కానీ ఆ తర్వాత తన సీట్‌ లోపాన్ని సవరించడంతో మళ్లీ నా పక్కనే వాలిపోయాడు. గమ్యం చేరే దాకా ఇద్దరం కలిసి సరదాగా ముచ్చటించుకున్నాం. అలా ఆ ప్రయాణం మా జీవితాల్లో ఎంతో ప్రత్యేకంగా మిగిలిపోయింది.

చిట్టడవిలో వేలికి ఉంగరం తొడిగాడు!

రణ్‌బీర్‌, అతడి ప్రణాళికలు నన్నెప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఎందుకంటే నేను ఊహించని విషయాలతో నన్ను సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు. మా లవ్‌ ప్రపోజల్‌ కూడా అలాగే జరిగింది. మా మనసులో ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమున్నా ఎప్పుడూ మనసు విప్పి మాట్లాడుకోలేదు. కొన్ని కారణాల వల్ల అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఓసారి కెన్యా వెకేషన్‌కి వెళ్లినప్పుడు ఓరోజు నన్ను మాసాయ్‌ మారా నేషనల్‌ రిజర్వ్‌కి తీసుకెళ్లాడు. ప్రపంచంలోని అత్యద్భుతమైన ప్రదేశాల్లో అదొకటి. ఆ చిట్టడవి మధ్యలోనే నా వేలికి ఉంగరం తొడిగి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగాడు. నా మనసులోని మాట తన పెదవి దాటే సరికి నా ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. నా జీవితంలో ఇదో మర్చిపోలేని మధుర జ్ఞాపకం. ఈ ప్రత్యేకమైన క్షణాన్ని గైడ్‌ సహాయంతో ఫొటోల్లో బంధించే ఏర్పాటు కూడా చేశాడు రణ్‌బీర్.

వాళ్లిద్దరూ నా బెస్ట్‌ ఫ్రెండ్స్!

మనం ఇష్టపడే వ్యక్తులతో జీవితాన్ని పంచుకోవడం అనేది అందరి విషయంలో సాధ్యం కాకపోవచ్చు. అలాగే మనతో జీవితాన్ని పంచుకున్న వారు గతంలో ఇతరులతో ప్రేమను కొనసాగించి ఉండచ్చు. అలాగని వారి మాజీలతో మనం శత్రుత్వం ఏర్పరచుకోవడం కరక్ట్‌ కాదన్నది నా భావన. నా విషయానికొస్తే.. రణ్‌బీర్‌తో గతంలో ప్రేమను కొనసాగించిన ఆ ఇద్దరు మాజీలతో నాకు మంచి అనుబంధం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. వాళ్లిద్దరూ నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌! వాళ్లతో కలిసి పలు షోలలో పాల్గొన్నా.. వాళ్ల పుట్టినరోజు, ప్రత్యేక సందర్భాలకు కూడా నేను, రణ్‌బీర్‌ కలిసి వెళ్లిన రోజులున్నాయి.

శోభనం.. అది నేను నమ్మను!

మన భారతీయ పెళ్లిళ్లలో వివాహానికి ముహూర్తం పెట్టినట్లే.. శోభనానికీ ప్రత్యేక ముహూర్తం చూస్తుంటారు. ఎందుకంటే ఆ శుభ ఘడియల్లో కొత్త దంపతులిద్దరూ ఒక్కటి కావాలని! కానీ నాకు దీనిపై నమ్మకం లేదు. ఎందుకంటే అప్పటికే పెళ్లి పనులు, హడావిడితో అలసిపోయి ఉంటాం. అలాంటప్పుడు వెంటనే ఒక్కటయ్యే అవకాశం ఎక్కడుంటుంది?

త్వరలోనే తల్లి కాబోతోన్న ఆలియా.. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ‘డార్లింగ్స్‌’, ‘బ్రహ్మాస్త్ర’, ‘రాఖీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’తో పాటు ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ అనే హాలీవుడ్‌ చిత్రం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని