ఎడమ వైపుకి తిరిగి పడుకుంటే ఎందుకు మంచిది?

మనలో చాలామందికి బోర్లా, వెల్లకిలా పడుకోవడం అలవాటు! కానీ ఈ రెండింటి కంటే ఎడమవైపుకి తిరిగి పడుకోవడమే మంచిదని చెబుతోంది ఆయుర్వేద శాస్త్రం. అలాగే దీనివల్ల భవిష్యత్తులో మెదడు సంబంధిత సమస్యలు....

Published : 11 Jun 2023 10:53 IST

మనలో చాలామందికి బోర్లా, వెల్లకిలా పడుకోవడం అలవాటు! కానీ ఈ రెండింటి కంటే ఎడమవైపుకి తిరిగి పడుకోవడమే మంచిదని చెబుతోంది ఆయుర్వేద శాస్త్రం. అలాగే దీనివల్ల భవిష్యత్తులో మెదడు సంబంధిత సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తపడచ్చని ఓ అధ్యయనంలో కూడా రుజువైంది. ఇదే కాదు.. ఏ వయసు వారికైనా ఈ నిద్రా భంగిమే మంచిదని, దీనివల్ల ఆరోగ్యపరంగా బహుళ ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..

జీర్ణవ్యవస్థకు మేలు!

జీవక్రియలన్నీ సజావుగా జరగాలంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమని చెబుతుంటారు నిపుణులు. అయితే ఎడమవైపుకి తిరిగి పడుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు. అదెలాగంటే.. మనం తిన్న ఆహారం జీర్ణం కాగా మిగిలిన వ్యర్థాలు, టాక్సిన్లు మొదట పెద్ద పేగు ప్రారంభ భాగమైన సెకమ్‌లోకి చేరుతాయి. అది మన శరీరంలో కుడివైపు ఉంటుంది. ఆపై ఇవి క్రమంగా మన శరీరానికి ఎడమవైపు ఉన్న పెద్ద పేగు చివరి భాగమైన పురీష నాళంలోకి వెళ్తాయి. మనం ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు.. గురత్వాకర్షణ కారణంగా కుడి నుంచి ఎడమకు ఈ వ్యర్థాలన్నీ సులభంగా కిందికి వెళ్లిపోతాయి. తద్వారా ఉదయాన్నే ఈ వ్యర్థాలన్నీ మలం రూపంలో బయటికి వెళ్లిపోవడం కూడా సులువవుతుంది. ఇలా పెద్ద పేగు ఎప్పటికప్పుడు పూర్తిగా ఖాళీ అవడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికీ దోహదం చేస్తుంది. అందుకే రాత్రి పడుకునేటప్పుడైనా, కాస్త విశ్రాంతి తీసుకునేటప్పుడైనా.. ఎడమవైపుకి తిరిగి పడుకోవడమే మేలంటున్నారు నిపుణులు.

గుండె ఆరోగ్యానికీ..!

ఈ మధ్య ఆడవారిలోనూ గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందుకు ముఖ్య కారణం.. అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లు, ఒత్తిడి-ఆందోళన వంటి మానసిక సమస్యలే! అయితే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంలో మన నిద్రా భంగిమ కూడా కీలకమే అంటున్నారు నిపుణులు. అది కూడా ఎడమవైపుకి తిరిగి నిద్రపోవడం మంచిదంటున్నారు. ఎందుకంటే.. మన శరీరంలో గుండె ఎడమ వైపుకి ఉంటుంది. మనం ఇదే దిశలో పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ కారణంగా రక్తం సులభంగా గుండెకు సరఫరా అవుతుంది. తద్వారా గుండెపై ఒత్తిడి కాస్త తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి ఇక నుంచైనా నిద్రా భంగిమ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిదన్నది నిపుణుల సూచన.

గర్భిణులకు మేలు!

రోజురోజుకీ పెరిగే పొట్ట కారణంగా పడుకోవడానికీ ఇబ్బంది పడుతుంటారు గర్భిణులు. ఇలాంటప్పుడు ఎడమ వైపుకి తిరిగి పడుకోవడం వల్ల సౌకర్యంగా ఉండడంతో పాటు ఈ నిద్రా భంగిమ ఇటు మీకు, అటు మీ కడుపులోని బిడ్డ ఆరోగ్యానికీ మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. అదెలాగంటే.. ఎడమ వైపుకి తిరిగి పడుకోవడం వల్ల వీపు, నడుము, వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుందట! తద్వారా నిద్ర చక్కగా పడుతుంది. అలాగే గర్భాశయానికి, పిండానికి రక్తప్రసరణ మెరుగవుతుంది. ఫలితంగా కడుపులో ఎదిగే బిడ్డకు పోషకాలు సులభంగా అందుతాయి. ఇలా తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలు చేసే ఈ భంగిమలో పడుకున్నప్పుడు.. కాళ్లు కాస్త ముడుచుకొని.. కాళ్ల మధ్యలో చిన్న దిండు పెట్టుకుంటే పొట్టపై ఒత్తిడి పడకుండా, సౌకర్యవంతంగా నిద్రలోకి జారుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇక ఈ భంగిమలో మరింత సౌకర్యవంతంగా నిద్ర పోవాలంటే.. ప్రెగ్నెన్సీ పిల్లోస్‌ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని ప్రయత్నించచ్చు.

ఆయాసం దూరం!

ఒక్కోసారి మనకు తెలియకుండానే అతిగా తినేస్తుంటాం. ఆపై ఆయాస పడుతుంటాం. అయితే ఇలాంటప్పుడు ఓ పది నిమిషాలు ఎడమవైపుకి తిరిగి పడుకోవడం వల్ల సమస్య నుంచి కొంతవరకు ఉపశమనం పొందచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. ఈ భంగిమలో ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థలోని పాంక్రియాటిక్‌ ఎంజైమ్స్‌ సమర్థంగా పనిచేసి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో తోడ్పడతాయట! తద్వారా ఆయాసం నుంచి కాస్త ఉపశమనం పొందచ్చంటున్నారు.

గురక పెడుతున్నారా?

పురుషుల్లోనే కాదు.. కొంతమంది మహిళల్లోనూ ఈ లక్షణం కనిపిస్తుంది. అధిక బరువు, సైనస్‌.. వంటి సమస్యలున్న వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిజానికి ఇది ఆరోగ్యానికి ఎంతమాత్రమూ మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల సుఖ నిద్ర పట్టకపోగా.. భవిష్యత్తులో రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలకూ దారితీయచ్చంటున్నారు. కాబట్టి ఎడమవైపు లేదా కుడివైపుకి తిరిగి పడుకోవడం వల్ల శ్వాస తీసుకోవడం మెరుగుపడి.. ఫలితంగా గురక సమస్యనూ తగ్గించుకోవచ్చంటున్నారు.

ఎడమవైపుకి తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఎప్పుడూ ఒకే భంగిమలో పడుకోలేం. అలాంటప్పుడు ఎక్కువ సమయం ఎడమవైపుకి తిరిగి పడుకునేలా.. ఉపశమనం కోసం అప్పుడప్పుడూ కాసేపు కుడివైపు, వెల్లకిలా పడుకునేలా చూసుకుంటే శరీరం బిగుసుకుపోకుండా జాగ్రత్తపడచ్చు. తద్వారా శారీరక నొప్పులూ రాకుండా చూసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని