ఆ సమయంలో స్టోర్‌రూమ్‌లో ఉండమంటున్నారు..!

మాది ప్రేమ వివాహం. కులాలు కూడా వేరు. నా భర్త తరఫు వారు మొదట మా ప్రేమను అంగీకరించలేదు. తను వారికి ఏకైక సంతానం కావడంతో తప్పక ఒప్పుకున్నారు. అయితే, మా అత్తగారు ఆచారాలు, సంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తుంటారు. ముఖ్యంగా నెలసరి సమయంలో నరకం చూపిస్తున్నారు. ఆ సమయంలో స్టోర్‌రూమ్‌లో....

Published : 05 Oct 2022 11:48 IST

మాది ప్రేమ వివాహం. కులాలు కూడా వేరు. నా భర్త తరఫు వారు మొదట మా ప్రేమను అంగీకరించలేదు. తను వారికి ఏకైక సంతానం కావడంతో తప్పక ఒప్పుకున్నారు. అయితే, మా అత్తగారు ఆచారాలు, సంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తుంటారు. ముఖ్యంగా నెలసరి సమయంలో నరకం చూపిస్తున్నారు. ఆ సమయంలో స్టోర్‌రూమ్‌లో ఉండమంటున్నారు. భోజనం కూడా అక్కడే. ఎప్పుడైనా బయటకు వెళ్లి వస్తే.. రాగానే స్నానం చేయాలంటారు. ఇంటికి ఎవరైనా వస్తే నాతో ఇల్లంతా కడిగిస్తారు. వీటిని తట్టుకోలేక నా భర్తతో వేరు కాపురం పెడదామని చెప్పాను. కానీ, అందుకు సంపాదన సరిపోదని ఆయన భయపడుతున్నారు. దయచేసి మా అత్తగారి ఆలోచనల్లో మార్పు వచ్చే మార్గం చెప్పగలరు. - ఓ సోదరి

జ. ప్రస్తుత రోజుల్లో కఠినంగా ఆచారాలు పాటించే వారు చాలా తక్కువ. నెలసరి సమయంలో దూరంగా స్టోర్‌రూమ్‌లో కూర్చోమంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి, మీ అత్తగారిని స్టోర్‌ రూమ్‌కి బదులుగా బెడ్‌రూంలోనే విశ్రాంతి తీసుకుంటానని అడగండి. ఒకవేళ అందుకు కూడా ఆమె అభ్యంతరం తెలిపితే ఆ సమయంలో మీ తల్లిగారింటికి వెళ్తానని చెప్పండి.

ఇక మీ అత్తగారివైపు నుంచి ఆలోచిస్తే ఈ ఆచారాలు, సంప్రదాయాలను కొన్ని సంవత్సరాలుగా పాటిస్తూ వచ్చి ఉండచ్చు. కాబట్టి, ఈ విషయంలో ఆమె రాజీపడే అవకాశం తక్కువ. అయినా మీ వంతు ప్రయత్నం చేయండి. మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అలవాట్లు, పద్ధతులను ఆమెకు వివరించే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ మాటలను ఆమె పట్టించుకోదనుకుంటే.. ఆమె సన్నిహితులతో చెప్పించే ప్రయత్నం చేయండి. లేదంటే మీరు పడుతున్న ఇబ్బందులను ఆమెకు వివరించి.. వాటిలో సడలింపులు చేసుకునే అవకాశాన్ని పరిశీలించండి. ఇద్దరి మధ్య సమస్య ఉన్నప్పుడు పరిష్కారం కోసం ఇద్దరూ సామరస్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది.

ఈ ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు మీరు చెప్పిన రెండో మార్గాన్ని అనుసరించచ్చు. అయితే, అందుకు సంపాదన సరిపోదని మీ భర్త భయపడుతున్నారని చెప్పారు. అయితే మీరు ఉద్యోగం చేస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని ప్రస్తావించలేదు. మీరు ఉద్యోగం చేస్తే సంపాదన విషయంలో భయాలు ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఉద్యోగానికి తగిన అర్హతలు లేవని భావిస్తే కొన్ని రోజుల పాటు కావాల్సిన శిక్షణ తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజుల్లో ఇంటి దగ్గరే చాలా కోర్సులు నేర్చుకునే అవకాశం ఉంది. మీరు ఉద్యోగం అంటూ చేయడం ప్రారంభించినప్పడు ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం తక్కువ. అయితే మీరు అత్తగారితో కలిసి ఉన్నా, వేరు కాపురం పెట్టినా.. ఇద్దరి మధ్య సమస్యను పెద్దది చేసుకోకుండా సాధ్యమైనంత వరకు సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్