ఆ రోజుల్లో కలిస్తే.. గర్భం ధరించే అవకాశాలు ఎక్కువట!

సంతానలేమి.. ప్రస్తుతం ఎన్నో జంటలు ఎదుర్కొంటోన్న సమస్య ఇది. ఇందుకు స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల్లో ఉన్న లోపాలు, సమస్యలే కారణమనుకుంటారు చాలామంది. కానీ మరో కారణం కూడా ఉందంటున్నారు నిపుణులు.

Published : 15 Jun 2024 16:07 IST

సంతానలేమి.. ప్రస్తుతం ఎన్నో జంటలు ఎదుర్కొంటోన్న సమస్య ఇది. ఇందుకు స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల్లో ఉన్న లోపాలు, సమస్యలే కారణమనుకుంటారు చాలామంది. కానీ మరో కారణం కూడా ఉందంటున్నారు నిపుణులు. అదే అండం విడుదలయ్యే సమయాన్ని గుర్తించలేకపోవడం.. దీనివల్లే ఈ సమయంలో కలయికలో పాల్గొన్నా చాలామంది గర్భం ధరించలేకపోతున్నారని చెబుతున్నారు. అండం విడుదలయ్యే తేదీని కచ్చితంగా గుర్తించి.. ఓ ప్రణాళిక ప్రకారం కలయికలో పాల్గొనడం వల్ల సక్సెస్‌ రేటు పెరుగుతుందంటున్నారు. ఇందుకు ‘SMEP’ (స్పెర్మ్‌ మీట్‌ ఎగ్‌ ప్లాన్‌) పద్ధతి దోహదం చేస్తుందంటున్నారు. ఇంతకీ ఏంటీ ప్రణాళిక? సంతాన ప్రాప్తిలో ఇది ఎంతవరకు తోడ్పడుతుంది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 60-80 మిలియన్ల జంటలు సంతానలేమితో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాటిలో 25 శాతం మంది అంటే.. సుమారు 15-20 మిలియన్లు భారతీయ జంటలే కావడం గమనార్హం! అయితే ఇందుకు ఇద్దరి ప్రత్యుత్పత్తి వ్యవస్థల్లో ఉన్న లోపాలు, సమస్యలు, అనారోగ్యాలతో పాటు అండం విడుదలయ్యే తేదీని సరిగ్గా గుర్తించలేకపోవడమూ ఓ కారణమే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే సరైన తేదీల్లో కలయిక జరగకపోవడం వల్లే సక్సెస్‌ సాధించలేకపోతున్నట్లు చెబుతున్నారు. ఇలాంటప్పుడు ‘SMEP’ (స్పెర్మ్‌ మీట్‌ ఎగ్‌ ప్లాన్‌) పద్ధతి జంటలకు దోహదం చేస్తుందంటున్నారు.

ఎలా ప్లాన్‌ చేసుకోవాలంటే?!

గర్భధారణ జరగాలంటే.. అండం విడుదలయ్యే తేదీల్లో జంటలు కలయికలో పాల్గొనడం ముఖ్యం! అయితే ఈ సమయాన్ని గుర్తించడంలో కొన్ని జంటలు విఫలమవుతుంటాయి. మరికొందరు తమ రుతుచక్రాన్ని బట్టి అండం విడుదలయ్యే తేదీని లెక్కించుకొని ఆ రోజున మాత్రమే కలిస్తే చాలనుకుంటారు. అలాకాకుండా.. ముందు నుంచే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగడం ముఖ్యమంటున్నారు నిపుణులు. వీర్యం అండంతో కలవాలంటే.. రుతుచక్రం ప్రారంభమైన ఎనిమిదో రోజు నుంచే కలయికలో పాల్గొనాలంటున్నారు. ఈ క్రమంలో కొన్ని ముఖ్యమైన రోజుల్ని గుర్తుపెట్టుకోవాలంటున్నారు.

⚛ సాధారణంగా చాలామందిలో 28 రోజుల రుతుచక్రం ఉంటుంది. ఇలాంటి వారు రుతుక్రమం ప్రారంభమైన ‘ఎనిమిదో రోజు’ నుంచి రోజు విడిచి రోజు కలయికలో పాల్గొనాలి.

⚛ ఇక పదో రోజు నుంచి.. రోజూ ఇంట్లోనే స్వయంగా ‘ఒవ్యులేషన్‌ టెస్ట్‌’ చేసుకోవాలి. ఇందుకోసం ప్రత్యేకమైన కిట్స్‌ మార్కెట్లో దొరుకుతాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్‌ను పోలినట్లుగా ఉండే ఈ పరీక్షను మహిళలు తమ యూరిన్‌ ద్వారా చేసుకోవచ్చు. మూత్రంలో ‘లుటనైజింగ్‌ హార్మోన్‌’ స్థాయులు పెరిగినట్లయితే.. అది అండం విడుదలవుతుందనడానికి సూచిక! ఈ క్రమంలోనే కిట్‌పై ఉన్న గీత ముదురు రంగులో కనిపించడం గుర్తించచ్చు.

⚛ ఇలా పదో రోజున పాజిటివ్‌ సంకేతం వస్తే.. ఆ రోజు, పదకొండో రోజు, పన్నెండో రోజు.. ఇలా వరుసగా మూడు రోజుల పాటు కలయికలో పాల్గొనాలి.

⚛ ఆపై మధ్యలో ఒక రోజు అంటే పదమూడో రోజు వదిలేసి.. 14వ రోజు మరోసారి కలవాలి.

సక్సెస్‌కు కారణమిదేనట!

ఇలా నెలసరి ముగిసిన ఎనిమిదో రోజు నుంచి 14 వ రోజు దాకా.. SMEP పద్ధతికి అనుగుణంగా వరుస రోజుల్లో శృంగారంలో పాల్గొనడం వల్ల వీర్యం అండంతో కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. అండం విడుదలకు ముందు నుంచే కలయికలో పాల్గొనడం వల్ల వీర్యం గర్భాశయంలోకి ప్రవేశిస్తుంది. ఇది అక్కడ 2-5 రోజుల దాకా జీవించి ఉంటుంది. కాబట్టి వరుస రోజుల్లో కలిస్తే.. అండం విడుదలయ్యే రోజు వరకు దాంతో కలవడానికి వీర్యం సిద్ధంగా ఉంటుంది. తద్వారా ఫలదీకరణం చెందడం సులువవుతుంది. అలాకాకుండా రుతుచక్రాన్ని బట్టి లెక్కించుకొని.. అండం విడుదలయ్యే రోజు, ఆ తర్వాత రోజుల్లో శృంగారంలో పాల్గొనడం వల్ల వీర్యం అండంతో కలిసే అవకాశాలు తగ్గిపోతాయి. ఎందుకంటే అండం జీవిత కాలం 24 గంటలే! అందుకే ఈ పద్ధతి ప్రకారం ప్లాన్‌ చేసుకుంటే.. గర్భధారణ సక్సెస్‌ రేటు చాలావరకు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

వీరికి వరం!

అయితే రుతుచక్రం అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కొంతమందికి ఎక్కువ రోజులు, మరికొందరికి తక్కువ రోజుల్లో నెలసరి రావచ్చు. కాబట్టి ఇలాంటి వారు అండం విడుదలయ్యే తేదీని డాక్టర్‌ సలహా మేరకు గుర్తించి.. దాని ప్రకారం కలయికలో పాల్గొనాలి. ఇక 35 ఏళ్ల లోపు వారైనా, 35 దాటిన వారికైనా.. ఈ SMEP పద్ధతి చాలా ప్రభావవంతంగా పని చేస్తుందంటున్నారు నిపుణులు. ఒకవేళ 35 ఏళ్ల లోపు వారు ఏడాది పాటు, 35 దాటిన వారు ఆరు నెలల పాటు ఈ పద్ధతిని పాటించినా గర్భం ధరించలేకపోతే మాత్రం సంబంధిత వైద్యుల్ని సంప్రదించడం మంచిది. ఫలితంగా సంతానం కలగకపోవడానికి అసలు కారణాలేంటో తెలుసుకొని.. సరైన చికిత్స అందిస్తారు. తద్వారా సంతాన భాగ్యానికి నోచుకోవచ్చు.

గమనిక: ఇది కేవలం ప్రాథమిక అవగాహన / సమాచారం కోసం మాత్రమే. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం.. మీ వ్యక్తిగత వైద్య నిపుణులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు పాటించడం అవసరం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్