ఆస్తమా ఉందా..? అయితే ఈ ఆహార నియమాలు మీకోసమే..
close
Published : 29/11/2021 20:29 IST

ఆస్తమా ఉందా..? అయితే ఈ ఆహార నియమాలు మీకోసమే..!

మనిషిని కుంగదీసే దీర్ఘకాలిక వ్యాధుల్లో ‘ఆస్తమా (ఉబ్బసం)’ ఒకటి. ఊపిరితిత్తులకు ప్రాణవాయువును చేరవేసే శ్వాస నాళాల్లో వాపు రావడం, అక్కడ ఎక్కువ శ్లేష్మం ఉత్పత్తవడంతో కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందవుతుంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడమనేది మనం తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే ఆస్తమాతో బాధపడే వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?, ఏయే పదార్థాలకు దూరంగా ఉండాలి? రండి.. తెలుసుకుందాం..

స్థూలకాయం ఎన్నో అనారోగ్యాలకు ఆలవాలం. అయితే ఇది ఆస్తమాకూ కారణమవుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. అందులోనూ స్థూలకాయం ఉన్న వారిలో ఆస్తమాకు చికిత్స చేయడం కూడా కష్టమంటున్నారు నిపుణులు. కాబట్టి బరువు అదుపులో ఉంచుకుంటూ, పోషకాహారం తీసుకోవడమే ఆస్తమాకు సరైన పరిష్కారమని సూచిస్తున్నారు.

ఏవి తీసుకోకూడదు..

* ఆస్తమాతో బాధపడుతున్న వారు కడుపులో గ్యాస్‌ని ఉత్పత్తి చేసే క్యాబేజీ, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మసాలాలు, కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌.. వంటి వాటికి దూరంగా ఉండాలి.

* ప్రాసెస్‌ చేసిన పదార్థాలు, ప్యాకింగ్‌ చేసిన ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ పదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి, రుచి, వాసన కోసం సల్ఫైట్‌ వంటి రసాయనాలు వాడతారు. వీటి వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి.

* ఇక జంక్‌ ఫుడ్‌లో అధికంగా ఉండే కొవ్వు పదార్థాల వల్ల కూడా ఆస్తమా సమస్య పెరిగే అవకాశాలున్నాయి.

* కొన్ని రకాల మూలికలు, మసాలాలు, టీ, కాఫీ లలో ఉండే  సెలిసిలేట్స్ కొంతమంది ఉబ్బసం రోగులకు పడకపోవచ్చు. ఇలాంటివాళ్ళు వీటికి దూరంగా ఉండడం మంచిది.

* అలాగే అతిగా తినడం వల్ల కూడా కడుపులో గ్యాస్‌ ఉత్పత్తవుతుంది. కాబట్టి మితంగా ఆహారం తీసుకోవడంతో పాటు రాత్రుళ్లు త్వరగా భోంచేసేలా ప్లాన్‌ చేసుకోవాలి.

తీసుకోవాల్సిన ఆహారమిదే!

* క్యారట్స్‌, చిలగడదుంపలు, ఆకుకూరలు.. వంటి పదార్థాల్లో విటమిన్‌ ‘ఎ’ బీటా కెరోటిన్‌ రూపంలో ఉంటుంది. ఇది శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ఉబ్బసంతో బాధపడే వారు రోజూ వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు.

* విటమిన్‌ ‘డి’ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుంచి విముక్తి పొందచ్చు. ఈ క్రమంలో పాలు, గుడ్లు, చేపలు.. వంటివి తీసుకోవాలి.

* పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే అరటిపండ్లు కూడా ఆస్తమా బాధితులకు మేలు చేస్తాయి.

* ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని, వాటి పనితీరును మెరుగుపరచడంలో యాపిల్‌ను మించింది మరొకటి లేదంటున్నారు నిపుణులు.

* ఆస్తమా రోగులకు ఉపశమనం కలిగించే ఖనిజాల్లో మెగ్నీషియం కీలకపాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో ఈ ఖనిజం ఎక్కువగా లభించే గుమ్మడి గింజలు, చేపలు, డార్క్‌ చాక్లెట్‌.. వంటివి తీసుకోవచ్చు.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని