Published : 02/02/2023 13:02 IST

వేరే అమ్మాయిలతో చాట్ చేస్తుంటాడు.. నన్ను పట్టించుకోడు..!

హలో మేడమ్‌.. నా వయసు 27 సంవత్సరాలు.. పెళ్లై ఏడాది దాటింది. మాది ప్రేమ వివాహం. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మా అత్తమామలు నన్ను అస్సలు పట్టించుకోరు. మా ఆయనేమో వేరే ఆడవాళ్లతో చాట్‌ చాస్తుంటాడు. అదేంటని అడిగితే చేయి చేసుకున్నాడు. సరేనని సర్దుకుపోయినా తన ధోరణి మార్చుకోవట్లేదు. వాళ్ల ఇంట్లో వాళ్లు ఏం చెబితే అదే చేస్తున్నాడు. నేనన్నా, నా మాటన్నా ఏమాత్రం విలువివ్వడు. దాంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. వచ్చి మూడు నెలలవుతున్నా ఒక్క ఫోన్‌ కూడా చేయలేదు. నేనే తనకు ఫోన్‌ చేస్తే ‘నీ ఇష్టం.. వస్తే రా.. లేకపోతే లేదు’ అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ పరిస్థితులను ఓసారి విశ్లేషించుకోండి. అతను నిజంగా తల్లిదండ్రుల మాటకే గౌరవం ఇచ్చే వ్యక్తి అయితే.. తల్లిదండ్రులను ఎదిరించి మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఉండేవారు కాదు. అలాగే ‘ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి భార్య మాటకే విలువిస్తాడు.. మమ్మల్ని పట్టించుకోడు’ అనే భావన మీ అత్తమామలకూ ఉండే అవకాశం లేకపోలేదు. కాబట్టి అతని దృష్టిలో వాళ్లకు విలువ తగ్గలేదు అని చూపించే ప్రయత్నం అతిగా చేస్తున్నాడా? అనే విషయం గురించి ఆలోచించండి.

మీ అత్తమామలకు పెళ్లికి ముందు నుంచే మీపట్ల వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి మిమ్మల్ని వారికి అనువుగా ఉండే కోడలిగా చూపించుకోవడానికి అతిగా వ్యవహరించాడేమో? దానితో విసిగిపోయిన మీరు పుట్టింటికి వెళ్లిపోవడంతో ‘చూశావా మేము చెప్పిందే జరిగింది’ అనే అవకాశం వాళ్లకు దొరికిందేమో? అన్న విషయాలను పరిశీలించుకోండి. ఎవరు ఏం చెప్పినా అది ఊహాగానమే అవుతుంది. కాబట్టి ముఖ్యంగా మీరిద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టండి. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మీ మనసుల్లో ఏముంది? మీ ఆలోచనలు ఏంటి? అనేవి స్పష్టం చేసుకోండి. దీనివల్ల సమస్య ఎక్కడుందో మీకు అర్థమవుతుంది. చిన్న చిన్న కారణాలను పెద్దవి చేసుకోవడం వల్ల మీ ప్రేమను మీరే పలుచన చేసుకున్న వారవుతారేమో అన్న విషయాన్ని కూడా ఆలోచించండి.

ఇక మీ భర్త ఇతర స్త్రీలతో చాటింగ్‌ చేస్తున్నాడని అంటున్నారు. అయితే అతను పరిధులకు లోబడే చేస్తున్నాడా? లేదంటే పరిధి దాటుతున్నాడా? అనేది ముందుగా నిర్ధారించుకోండి. అబ్బాయిలతో ఎలా మాట్లాడుతున్నాడో అమ్మాయిలతో కూడా అలానే మాట్లాడుతున్నట్లయితే.. ఒకవేళ ఆ విషయాన్ని మీరు భూతద్దంలో చూస్తున్నారా? అన్నది పరిశీలించుకోండి. ఏదేమైనా ఇద్దరూ కలిసి సానుకూల ధోరణితో మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని