Published : 05/01/2022 20:44 IST

Whatsapp: ఆ వలలో పడకూడదంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!

ఈ రోజుల్లో వాట్సప్ ఉపయోగించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. చాలామందికి అదొక నిత్యావసరంగా మారిపోయింది. నూటికి తొంభై శాతం మంది వాట్సప్‌ని రకరకాలుగా ఉపయోగిస్తుంటారు. మొదట ఈ యాప్‌ని కేవలం సందేశాలు పంపడం కోసం తయారు చేసినా కాలక్రమేణా రకరకాల సదుపాయాలను ఆ సంస్థ కల్పిస్తోంది. ఫోన్‌ కాల్స్‌, వీడియో కాల్స్, డబ్బులు పంపించుకోవడం, లైవ్ లొకేషన్ పంచుకోవడం, ఇలా ఎన్నో వచ్చి చేరాయి.

అయితే టెక్నాలజీ ఎంత పెరిగిపోతోందో దానికి తగ్గట్టుగా ఆన్‌లైన్‌ మోసాలు కూడా అంతే పెరుగుతున్నాయి. మనం సరదాగా పెట్టుకునే వాట్సప్‌ డీపీలను కొంతమంది మార్ఫింగ్‌ చేసి బెదిరింపులకు దిగుతున్నారు. ఆ చిత్రాలను వైరల్‌ చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నారు. ఇలాంటి కేసులు తరచుగా వస్తున్నాయని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్ విభాగం అధికారులు తాజాగా చెప్పడం గమనార్హం.  ఈ క్రమంలో వాట్సప్‌ని ఉపయోగించేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సైబర్‌ నిపుణులు. మరి, అవేంటో తెలుసుకుందామా...

వ్యక్తిగత ఫొటోలు వద్దు...

కొంతమంది రోజుకు రెండు, మూడు డీపీలు మారుస్తుంటారు. మరికొంతమందికి వాట్సప్‌లో ఏదైనా స్టేటస్‌ పెట్టనిదే రోజు గడవదు. టెక్నాలజీ ఉపయోగించే క్రమంలో ఇలాంటివి సాధారణమే అయినప్పటికీ దీనికోసం వ్యక్తిగత ఫొటోలను ఉపయోగించకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. కొంతమంది కేటుగాళ్లు వ్యక్తిగత ఫొటోలను అసభ్యకరమైన రీతిలో మార్ఫింగ్‌ చేసి తిరిగి వారికే పంపిస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే ఆ చిత్రాలను వైరల్‌ చేస్తామని బెదిరిస్తారు. కాబట్టి, వ్యక్తిగత, కుటుంబ సభ్యుల, దంపతుల ఫొటోలను అప్‌లోడ్‌ చేయకుండా ఉండడమే మేలు.

అలాంటివి క్లిక్ చేయద్దు..

అలాగే అపరిచితుల నుంచి ఏవైనా లింక్‌లు వస్తే, వాటిపై క్లిక్‌ చేయకుండా వెంటనే డిలీట్‌ చేయాలి. ఒకవేళ ఆ లింక్‌లపై క్లిక్‌ చేస్తే.. అవతలి వ్యక్తుల నుంచి బెదిరింపు తరహా సందేశాలు, ఫోన్‌ కాల్స్‌ వచ్చినా స్పందించకుండా ఉంటే మంచిది. ఆ ఫోన్ నంబర్లను బ్లాక్‌ చేసేయాలి. ఎప్పుడైతే మీరు స్పందించడం మానేస్తారో.. లేదా ఫోన్ నంబరు బ్లాక్‌ చేస్తారో.. ఆ మోసగాళ్లు మరో ప్రయత్నంలోకి వెళ్లిపోతారు. స్పందిస్తే భయపడినట్లుగా గ్రహించి డబ్బులు డిమాండ్‌ చేయడం మొదలుపెడతారు. తస్మాత్‌ జాగ్రత్త.

ఆఫర్లకు లొంగద్దు..

మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో.. ఆన్‌లైన్‌ కేటుగాళ్లు కూడా అలాగే వినూత్నంగా సైబర్‌ మోసాలకు దిగుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకుంటున్నారు. ఉదాహరణకు ‘టాటా మోటార్స్ సంస్థ 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కొంతమందికి ఉచితంగా కారుని ఇస్తోంది. ఇందులో పాల్గొనాలంటే ఈ లింక్‌ని క్లిక్ చేయండి’.. ‘కేంద్ర ప్రభుత్వం టీనేజ్ (15-18) వయసు పిల్లలకు వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మీరు మీ వ్యాక్సిన్ పొందడానికి ఈ లింక్‌ని క్లిక్‌ చేయండి’.. వంటి మెసేజ్‌లను పంపిస్తుంటారు. ఈ అంశాలు ప్రస్తుతం ఎలాగూ ట్రెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి అవి నిజమేనని లింక్‌ని క్లిక్‌ చేస్తుంటారు. ఆ తర్వాత వారు మోసపోవడానికి ఎంతో సమయం పట్టదు. 
సాధారణంగా ఏ సంస్థ అయినా ఆఫర్‌ ప్రకటించినప్పుడు వారికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారాన్ని పొందుపరుస్తారు. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంటారు. కాబట్టి, ఇలాంటి మెసేజ్‌లు వచ్చిన వెంటనే సంబంధిత వెబ్‌సైట్లను చెక్‌ చేయడం ఉత్తమం.

తాళం వేయండి!

ఈ రోజుల్లో చాలామంది వ్యక్తిగత వివరాలన్నీ వాట్సప్‌లోనే ఉంటున్నాయి. ఒకవేళ మొబైల్‌ పోతే వాటిని ఉపయోగించి మిమ్మల్ని బ్లాక్‌మెయిల్‌ చేసే అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు మన ఫోన్‌ని ఇతరులు ఉపయోగించాల్సిన అవసరం రావచ్చు. ఇలాంటి సందర్భంలో కూడా వ్యక్తిగత వివరాలు వారికి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీ వాట్సప్‌కి లాక్‌ వేయండి. ఈ వెసులుబాటు వాట్సప్‌లో ఉండదు.. కానీ కొన్ని థర్డ్‌ పార్టీ యాప్‌లు ఇలాంటి సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. వాటిని ఉపయోగిస్తే మీ వ్యక్తిగత సమాచారం ఎవరి కంటా పడకుండా ఉంటుంది.

అవి అందరికీ కనిపించక్కర్లేదు!

కొంతమంది తమ ప్రొఫైల్ ఫొటో, స్టేటస్‌లు అందరికీ కనిపించేటట్లు పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల మీరంటే గిట్టని వారు, మోసగాళ్లు మీ ఫొటోలను మార్ఫింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఇలాంటివి అందరికీ కనిపించేటట్లు కాకుండా పెట్టుకోవాలి. దీనికోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్‌ని ఓపెన్‌ చేస్తే ప్రైవసీ ఆప్షన్ కనబడుతుంది (Settings>>Account>>Privacy). అందులో లాస్ట్‌ సీన్‌, ప్రొఫైల్‌ ఫొటో, అబౌట్‌, స్టేటస్‌ ఆప్షన్లు కనిపిస్తుంటాయి. వీటిలో మీకు కావాల్సిన ఆప్షన్‌ని ఎంపిక చేసుకోవాలి.

వాటిని పంచుకోవద్దు...

కేవలం ఫొటోలతోటే సైబర్‌ మోసాలు జరుగుతాయని భావిస్తే పొరపాటే అవుతుంది. కొంతమంది డిజిటల్‌ కమ్యూనికేషన్‌లో భాగంగా చిరునామా, ఫోన్‌ నంబర్లు, ఈమెయిల్‌, బ్యాంక్‌ ఖాతా నంబర్లు, క్రెడిట్‌ కార్డు.. వంటి వివరాలను ఇతరులతో పంచుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల మీ వాట్సప్‌లోకి సైబర్‌ నేరగాళ్లను ఆహ్వానించడమే అవుతుంది. కాబట్టి, ఇలాంటి సమాచారాన్ని ఇతరులతో పంచుకోకుండా ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవాల్సి వస్తే.. ఎప్పటికప్పుడు అలాంటి చాట్లను క్లియర్‌ చేయడం ఉత్తమం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని