ప్రేమగానే ఉంటాడు.. వాళ్లు వచ్చినప్పుడు మారిపోతాడు!
మా అత్తమామలు వచ్చినప్పుడు ఆయన ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. అప్పటిదాకా నాతో ఎంతో చక్కగా ఉండే వ్యక్తి వాళ్ల ముందు మాత్రం చులకనగా మాట్లాడుతుంటారు.
నాకు పెళ్లై నాలుగేళ్లయింది. నా భర్త ఉద్యోగరీత్యా మేము వేరే ప్రాంతంలో ఉంటున్నాం. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. నాతో ప్రేమగా ఉంటారు. ప్రతి విషయంలోనూ నాకు ప్రాధాన్యం ఇస్తారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అయితే మా అత్తమామలు వచ్చినప్పుడు మాత్రం ఆయన ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. అప్పటిదాకా నాతో ఎంతో చక్కగా ఉండే వ్యక్తి వాళ్ల ముందు మాత్రం చులకనగా మాట్లాడుతుంటారు. ఎక్కువ సమయం వాళ్లతోనే గడుపుతుంటారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మాత్రం మళ్లీ ఎప్పటిలానే నాతో ప్రేమగా ఉంటారు. మేము దూరంగా ఉండడం వల్ల వాళ్లు మా ఇంటికి వచ్చి ఉండే సందర్భాలు తక్కువే. కానీ, వాళ్లు ఉన్న సమయంలో ఆయన ప్రవర్తించే తీరు మాత్రం చాలా బాధగా ఉంటోంది. కొన్ని సందర్భాల్లో విపరీతమైన కోపం వస్తోంది. దీన్నుంచి ఎలా బయటపడాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. దాంపత్య బంధంలో ఒకరికొకరు తగిన గౌరవం, ప్రాధాన్యం ఇచ్చుకోవాలి. అప్పుడే ఆ బంధం ఎలాంటి కలతలూ లేకుండా కొనసాగుతుంది. అయితే చాలామంది దంపతుల్లో ఈ అంశంలోనే తేడాలు వస్తుంటాయి. మీ విషయానికి వస్తే మీ భర్తకు మీరంటే చాలా ఇష్టం.. అన్ని విషయాల్లోనూ మీకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నాడని చెబుతున్నారు. అలాగే మీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు. అతని తల్లిదండ్రులు వచ్చినప్పుడు మాత్రం అతని ప్రవర్తన ఇబ్బందికి గురి చేస్తోందని అంటున్నారు.
అయితే ఈ విషయంలో మీ భర్త వైపు నుంచి కూడా ఆలోచించడానికి ప్రయత్నించండి. అతను ఒక భర్తగా మీకు ప్రాధాన్యం ఇస్తూనే అతని తల్లిదండ్రులకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్లు వచ్చినప్పుడు వాళ్లతోనే ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తున్నారేమో ఆలోచించండి. ఆ క్రమంలో ఒక్కోసారి అతను మిమ్మల్ని పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యం చేస్తున్నాడని మీకు అనిపించడం సహజమే.
వాళ్లు వచ్చినప్పుడు ఎక్కువ సమయం వాళ్లతోనే గడపడం మినహాయిస్తే- మీరు చెప్పిన దాంట్లో మరో ముఖ్యమైన విషయం- వాళ్ల ముందు మిమ్మల్ని చులకనగా మాట్లాడడం. మామూలుగా మీతో చక్కగా ఉండే వ్యక్తి పేరెంట్స్ వచ్చినప్పుడు మాత్రం ఇలా భిన్నంగా ప్రవర్తిస్తూ, మిమ్మల్ని చులకనగా మాట్లాడ్డం అనేది కచ్చితంగా బాధ కలిగించే అంశమే. పైగా ఇది ఆత్మగౌరవానికి కూడా సంబంధించిన అంశం. అయితే మామూలుగా బాగానే ఉన్నప్పటికీ- భార్య పైన తనదే పైచేయిగా ఉంటుందని తమ పేరెంట్స్, ఇతర కుటుంబ సభ్యుల ముందు నిరూపించడం కోసం కూడా కొంతమంది మగవాళ్లు ఇలా చేసే అవకాశం లేకపోలేదు. కారణమేదైనా ఇలా మాట్లాడ్డం మాత్రం సమంజసం కాదు.
ఈ క్రమంలో- దీని గురించి ఒకసారి అతనితోనే స్నేహపూర్వక వాతావరణంలో మాట్లాడండి. మీ అత్తమామలు ఉన్నప్పుడు అతని మాటలు, ప్రవర్తన ఎలా ఉంటున్నాయో చెప్పి, దానివల్ల మానసికంగా మీరు పడుతున్న బాధను వివరించండి. మామూలుగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా బాగుండి, వాళ్లు వచ్చినప్పుడు మాత్రం చులకనగా చూడడం తట్టుకోలేకపోతున్నానని; ఈ పద్ధతిని మార్చుకోమని చెప్పండి. మీ ఇద్దరి మధ్య ఇతరత్రా ఎలాంటి అభిప్రాయ భేదాలు లేని నేపథ్యంలో- అతను కూడా మిమ్మల్ని అర్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఏ విషయంలో అయినా సరే మార్పు అనేది ఒక్కసారిగా రాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. వాస్తవానికి- సమస్యల్లేని బంధమంటూ ఉండదు. కొన్ని అంశాల్లో సర్దుకుపోతేనే బంధం పరిపూర్ణమవుతుంది. అదే సమయంలో ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.