అమ్మాయిలూ.. ఆన్‌లైన్‌లో మీరేం వెతుకుతున్నారు?
ఇలా సమస్యేదైనా, దేని గురించి ఏ వివరాలు కావాలన్నా ప్రస్తుతం అందరూ ఆన్‌లైన్‌నే ఆశ్రయిస్తున్నారు. అందులోనూ ఎక్కువమంది అమ్మాయిలైతే అందం, ఫ్యాషన్, కెరీర్.. వంటి అంశాల పైనే ఎక్కువగా శోధిస్తున్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి. దేశంలో మొత్తంగా సుమారు 15 కోట్ల మంది ఇంటర్నెట్.....
ఇంటర్ పూర్తైన పల్లవి ప్రస్తుతం ఇంజినీరింగ్ కాలేజీ అన్వేషణలో బిజీగా ఉంది. మెకానికల్ కోర్సు ఎంచుకున్న ఆమె ఏ కాలేజీ అయితే బాగుంటుందోనని నెట్‌లో తెగ వెతికేస్తోంది.
ప్రణతికి వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలే సమస్య ఉంది. దీన్నుంచి బయటపడేందుకు పాటించాల్సిన ఇంటి చిట్కాల గురించి ఆన్‌లైన్‌లో వెతుకులాట ప్రారంభించింది.
వర్షితకు పీసీఓఎస్ ఉందని ఈ మధ్యే తెలిసింది. త్వరలో పెళ్లి చేసుకోబోయే ఆమె.. ఇప్పట్నుంచే దీనికి చికిత్స తీసుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలోనే ఆస్పత్రులు, నిపుణుల వివరాలు తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌ను ఆశ్రయించింది.
ఇలా సమస్యేదైనా, దేని గురించి ఏ వివరాలు కావాలన్నా ప్రస్తుతం అందరూ ఆన్‌లైన్‌నే ఆశ్రయిస్తున్నారు. అందులోనూ ఎక్కువమంది అమ్మాయిలైతే అందం, ఫ్యాషన్, కెరీర్.. వంటి అంశాల పైనే ఎక్కువగా శోధిస్తున్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి. దేశంలో మొత్తంగా సుమారు 15 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులుంటే.. అందులో 40 శాతం మంది అమ్మాయిలు/మహిళలేనట! ఇలా అంతర్జాలం వినియోగంతో వీరు చాలా విషయాల్లో మరొకరి సలహా అవసరం లేకుండా స్వీయ అవగాహన పెంచుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. మరి, ఇంతకీ అమ్మాయిలు ఇంకా ఏయే అంశాల గురించి నెట్‌లో ఎక్కువగా వెతుకుతున్నారో? తెలుసుకుందాం రండి..
నెక్స్టేంటి?
మనకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకున్నప్పుడే కెరీర్‌లో రాణించగలం. అంటే.. పాఠశాల విద్య పూర్తయ్యాక మనం వేసే అడుగే దీన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఈ దశలో ప్రతి ఒక్కరూ ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అయితే ఈ సమయంలో తమకు ఆసక్తి ఉన్న కోర్సు విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ.. ఏ కళాశాల మెరుగైంది? క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఎక్కువగా ఉండే కాలేజీలేంటి? అన్న విషయాల్లో చాలామందిలో సందిగ్ధం నెలకొంటుంది. మరి, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి చాలామంది అమ్మాయిలు అంతర్జాలాన్నే ఆశ్రయిస్తున్నారట! అందులోనూ సంబంధిత నిపుణులతో కాంటాక్ట్ అయి కాల్స్/సందేశాల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయి. అక్కడితో ఆగకుండా.. కోర్సు మధ్యలో కొత్త సాంకేతిక పద్ధతుల్ని అవపోసన పడుతూ.. అద్భుతమైన కెరీర్‌కు బంగారు బాటలు పరచుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
‘ట్రెండ్’ సెట్ చేయాలని..!
అందం, ఫ్యాషన్.. విషయాల్లో అమ్మాయిలు ఎంత అప్‌డేటెడ్‌గా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో కొత్త పోకడల్ని ఫాలో అయ్యే వారు కొందరైతే.. తమదైన ఫ్యాషన్/బ్యూటీ నైపుణ్యాలతో ట్రెండ్ సెట్ చేసే వారు మరికొందరుంటారు. మరి, ఇవన్నీ వారికెలా తెలుస్తున్నాయన్న కోణంలో నిర్వహించిన సర్వేల్లో.. అన్నింటికీ ఆన్‌లైనే మూలం అని తేలింది. ఇక ఇందులోనూ చాలామంది అమ్మాయిలు తమ అందాన్ని పెంపొందించుకోవడానికి సహజసిద్ధమైన పరిష్కారాల కోసం అన్వేషిస్తుంటే.. షాపింగ్ కోసం ఎక్కువమంది మహిళలు ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్‌ని ఆశ్రయిస్తున్నట్లు తేలింది. బయటి కంటే ఈ వెబ్‌సైట్స్‌లో కొత్త కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ అందుబాటులో ఉండడంతో పాటు.. డిస్కౌంట్ ఆప్షన్లు కూడా ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమట! అలాగే ఆయా విషయాల్లో ఏమైనా సందేహాలున్నా, డ్రస్సింగ్ గురించిన సలహాలు పొందాలన్నా, సహజసిద్ధమైన ఫ్యాషన్ ఆప్షన్ల కోసం, ఛాతీ ఆకృతిని బట్టి సరైన బ్రా సైజు తెలుసుకోవాలన్నా.. ఇందుకూ ఆన్‌లైన్లోనే నిపుణుల్ని సంప్రదిస్తున్నారట!
‘డిజైన్ల’లోనూ కొత్తదనం!
పండగైనా, ప్రత్యేక సందర్భమైనా.. ప్రతి విషయంలో కొత్తదనం కోరుకుంటారు మగువలు. వాకిట్లో వేసే ముగ్గు దగ్గర్నుంచి, ఇంట్లో అమర్చుకునే అలంకరణ వస్తువుల దాకా.. కొత్త కొత్త డిజైన్లకు, వస్తువులకు ప్రాధాన్యమిస్తుంటారు. తద్వారా తమ అభిరుచుల్ని చాటుకుంటారు. అయితే ఇలా వీటన్నింటి గురించి తెలుసుకునే క్రమంలో ఎక్కువమంది అమ్మాయిలు ఇంటర్నెట్‌ని ఆశ్రయిస్తున్నట్లు తేలింది. ఇక పెళ్లిళ్ల సమయాల్లో అధిక శాతం మంది కొత్త కొత్త మెహెందీ డిజైన్ల గురించే శోధిస్తున్నారట! ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో వచ్చిన జ్యుయలరీ స్టైల్ మెహెందీ డిజైన్స్ తమకు విపరీతంగా నచ్చేశాయని చాలామంది అమ్మాయిలు/మహిళలు తమ అభిప్రాయాల్ని వెల్లడించినట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇక మరికొంతమంది అమ్మాయిలు తమలో ఉన్న నైపుణ్యాలు, ప్రతిభతో ఆయా డిజైన్లను రూపొందించి సోషల్ మీడియాలోనూ పాపులర్ అవడం మనం చూస్తూనే ఉన్నాం.
‘పాట’లతో పరవశిస్తూ!
కాస్త సమయం దొరికితే చాలు.. చెవిలో హెడ్‌సెట్ పెట్టుకొని పాటలు వినడం, సినిమాలు-సీరియల్స్ చూడడం మనకు అలవాటే! వీటన్నింటికీ ఇంటర్నెటే మూలం. అయితే కాస్త వయసులో ఉన్న అమ్మాయిలు వినోదం విషయంలో నెట్‌లో ఎక్కువగా వేటి గురించి వెతుకుతున్నారని ఆరా తీస్తే.. ఎక్కువమంది పాటలతోనే పరవశించి పోతున్నారని తేలింది. అందులోనూ లవ్, రొమాన్స్‌తో కూడుకున్న పాటలే ఎక్కువగా వినడం, చూడడానికి ఆసక్తి చూపుతున్నారట! మరికొంతమంది యువతులు మరో అడుగు ముందుకేసి.. తమకు నచ్చిన పాటలకు కవర్ సాంగ్స్ రూపొందిస్తూ.. డ్యాన్స్ వీడియోలు చేస్తూ.. నెట్టింట్లో పాపులారిటీ సంపాదించుకుంటున్నారు కూడా!
ఇర్రెగ్యులర్ పిరియడ్స్.. ఎందుకు?!
ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలకు/మహిళలకు చిన్న వయసులోనే వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు.. నెలసరి సమస్యలు, పీసీఓఎస్, థైరాయిడ్, వైట్ డిశ్చార్జ్, ఇతర ప్రత్యుత్పత్తి సమస్యలు.. ఇవన్నీ వారికి ఎన్నో అనారోగ్యాల్ని తెచ్చిపెడుతున్నాయి. మరి, వీటి పరిష్కారాల కోసం నిపుణుల్ని సంప్రదించి తగిన సలహాలు, చికిత్సలు తీసుకునే వారిని వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. ఇందుకు కారణం.. మొహమాటం, బిడియం, భయం! అందుకే ఆయా సమస్యలకు పరిష్కారం వెతుక్కునే క్రమంలో చాలామంది ఇంటర్నెట్‌నే ఆశ్రయిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే సమస్య అవగాహన కోసం ఇది మంచిదే అయినా.. మొహమాటాల్ని పక్కన పెట్టి నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్య సహాయం తీసుకోవడం అన్ని విధాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.