Published : 31/12/2022 19:51 IST

రూమ్‌ హీటర్లు వాడుతున్నారా? అయితే ఇవి గుర్తుపెట్టుకోండి!

శరీరాన్ని గిలిగింతలు పెట్టే చలిని తట్టుకోవడానికి పొద్దెక్కేదాకా ముసుగుతన్ని పడుకోవడం మనలో చాలామందికి అలవాటే! అయితే ఈ కాలంలో ఇంకాస్త వెచ్చదనం కోరుకునే వారు పడకగదిలో హీటర్లను కూడా ఏర్పాటు చేసుకుంటారు. నిజానికి ఇలాంటి హీటర్లు చలిని తరిమికొట్టడం వరకు బాగానే పనిచేసినా.. ఆరోగ్యపరంగా మాత్రం ఎన్నో సమస్యల్ని తెచ్చిపెడతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. రూమ్‌ హీటర్ల వల్ల అనుకోని అగ్ని ప్రమాదాలు కూడా సంభవించచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వాటిని వాడే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

చర్మం పొడిబారిపోతుంది!

సాధారణంగానే చలికాలంలో వాతావరణంలో తేమ తక్కువగా ఉంటుంది.. ఇలాంటి పొడిగాలి శరీరానికి తాకడం వల్ల చర్మం కూడా పొడిబారిపోతుంటుంది. అయితే రాత్రంతా గదిలో హీటర్లు వేసుకొని పడుకోవడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుందంటున్నారు నిపుణులు. హీటర్‌ నుంచి వెలువడే వేడి వాతావరణంలో ఉన్న ఆ కాస్త తేమను కూడా తొలగించి గాలిని పొడిగా మార్చుతుంది. ఇక ఇదే గాలి రాత్రంతా శరీరానికి తాకడం వల్ల చర్మం తేమను కోల్పోతుంది. తద్వారా దురద, మంట, అలర్జీ.. వంటివి వస్తాయి. ఇక సున్నితమైన చర్మం గల వారు, చిన్న పిల్లల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే అత్యవసరమైతేనే.. అది కూడా తక్కువ సమయం వాటిని ఉపయోగించడంతో పాటు తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటిని సెట్‌ చేసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం!

బయట చలిగా ఉన్నప్పుడు గదిలో హీటర్‌ వేసుకుంటే ఎంతో వెచ్చగా, హాయిగా అనిపిస్తుంది. అలాగని ఎప్పుడూ ఒకే దగ్గర కూర్చోవడం కుదరదు. ఆఫీస్‌కనో లేదంటే ఇతర పనుల రీత్యా చలిలో తిరగక తప్పదు. అయితే ఈ క్రమంలో అప్పటిదాకా వెచ్చదనంలో ఉన్న శరీరం ఒక్కసారిగా చల్లటి వాతావరణంలోకి, చలిలో గడిపిన తర్వాత వెంటనే హీటర్‌ వేడికి.. ఇలా వాతావరణంలోని ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల ప్రభావం మనలోని రోగనిరోధక వ్యవస్థపై పడుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం.. తద్వారా లేనిపోని అనారోగ్యాలు చుట్టుముట్టే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. అందుకే హీటర్‌ కంటే సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద గడపడం, ఒకవేళ హీటర్‌ ఉపయోగించినా తక్కువ వేడి ఉత్పన్నమయ్యేలా దానిలోని ఉష్ణోగ్రతను సెట్‌ చేసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

గాలిని విషపూరితం చేస్తాయ్‌!

రూమ్‌ హీటర్స్‌ గదిలోని గాలిని పొడిగా చేయడమే కాదు.. విషపూరితం కూడా చేస్తాయంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. కొన్ని రకాల హీటర్లు కార్బన్‌ మోనాక్సైడ్‌ను విడుదల చేస్తాయట. దానికి మండే స్వభావం ఉండడం వల్ల ఇంట్లో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. అంతేకాదు.. ఈ వాయువు పీల్చుకోవడం వల్ల ఆస్తమాతో పాటు ఇతర శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా వస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి హీటర్‌ వాడే గదిలో సరైన వెంటిలేషన్‌ ఉండడం తప్పనిసరి. అలాగే రాత్రంతా హీటర్లను వాడడం కంటే కాసేపు ఉపయోగించుకొని ఆ తర్వాత ఆపేయడం వల్ల సమస్యను కొంత వరకు తగ్గించుకోవచ్చు.

పిల్లల్లో ఆ సమస్య!

చిన్న పిల్లల శరీరం సాధారణంగానే సున్నితంగా ఉంటుంది. అలాంటిది వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు జరిగితే వారి చర్మం అస్సలు తట్టుకోలేదు. ఈ క్రమంలోనే మనం గదిలో ఉపయోగించే హీటర్ల నుంచి వెలువడే అధిక వేడి కారణంగా వారి చర్మం కందిపోవడం, బొబ్బలెక్కడంతో పాటు ఒక్కోసారి ఈ అధిక ఉష్ణోగ్రత వారిలో సడెన్‌ ఇన్‌ఫాంట్‌ డెత్‌ సిండ్రోమ్‌ (సిడ్స్‌)కి కూడా దారితీయచ్చని ఓ అధ్యయనంలో రుజువైంది. అందుకే చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో హీటర్లను ఉపయోగించకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ ఉపయోగించినా ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా సెట్‌ చేసుకోవడం, నిరంతరాయంగా ఉపయోగించకపోవడం మంచిదంటున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

చలి నుంచి కాపాడుకోవడానికి హీటర్‌ని ఉపయోగించడమే కాదు.. దాన్ని వాడే క్రమంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు.

⚛ పగలు, రాత్రి నిరంతరాయంగా హీటర్లను ఉపయోగించడం మంచిది కాదు. కాబట్టి రోజులో మీకు అవసరమున్నప్పుడు అది కూడా తక్కువ సమయం, తక్కువ ఉష్ణోగ్రత వద్ద సెట్‌ చేసుకొని ఉపయోగించడం వల్ల అటు వెచ్చదనాన్ని ఆస్వాదించచ్చు.. ఇటు అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.

⚛ పేపర్‌, చెక్క, బ్లాంకెట్స్‌.. వంటి సులభంగా మండే స్వభావం ఉన్న వస్తువుల్ని హీటర్లకు దూరంగా ఉంచడం మంచిది. అలాగే హీటర్లను అమర్చడానికి కార్పెట్లు, చెక్క, ప్లాస్టిక్‌ స్టూల్స్‌/కుర్చీలు.. వంటివి ఉపయోగించకపోవడమే శ్రేయస్కరం.

⚛ ఇంట్లో ఉండే పెట్స్‌, చిన్న పిల్లల్ని హీటర్‌ దగ్గరికి వెళ్లకుండా ఓ కంట కనిపెడుతూ ఉండాలి.

⚛ హీటర్‌ ఉంచిన గదిలో గాలి బాగా ప్రసరించేలా చక్కటి వెంటిలేషన్‌ ఉండేలా జాగ్రత్తపడాలి.

⚛ కొంతమంది హీటర్లను పవర్‌ కార్డ్‌ ఎక్స్‌టెన్షన్స్‌తో కనెక్ట్‌ చేస్తుంటారు. దానివల్ల ఒక్కోసారి షార్ట్‌ సర్క్యూట్‌ జరిగే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే నేరుగా సాకెట్‌కే హీటర్‌ కనెక్ట్‌ చేసుకునేలా దాన్ని అమర్చుకోవడం మంచిది.

⚛ హీటర్‌ ఉపయోగించినప్పుడు గదిలోని గాలిలో తేమ శాతం తగ్గిపోకుండా ఉండాలంటే ఒక బకెట్‌ నీటిని ఆ గదిలో ఒక మూలకు ఉంచితే సరిపోతుంది. లేదంటే హ్యూమిడిఫయర్స్‌ని కూడా ఉపయోగించచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని