బలవంతం వద్దు.. ఆసక్తే ముద్దు..!

పిల్లలు వివిధ విషయాల్లో ప్రావీణ్యం సంపాదించాలన్న ఆతృత తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఈ అత్యుత్సాహంతోనే వారి ఇష్టాయిష్టాలు గ్రహించకుండా కొన్ని విషయాల్లో పేరెంట్స్‌ వాళ్లను బలవంతపెడుతుంటారు.

Published : 11 Jul 2024 12:36 IST

పిల్లలు వివిధ విషయాల్లో ప్రావీణ్యం సంపాదించాలన్న ఆతృత తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఈ అత్యుత్సాహంతోనే వారి ఇష్టాయిష్టాలు గ్రహించకుండా కొన్ని విషయాల్లో పేరెంట్స్‌ వాళ్లను బలవంతపెడుతుంటారు. అయితే ఇలాంటి ప్రవర్తన పిల్లల మనసుపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. అందుకే బలవంతం చేయడం కంటే.. వారికి ఆసక్తి ఉన్న అంశాల్లో ప్రోత్సహిస్తేనే.. వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా వారు ఉన్నతి సాధించగలరంటున్నారు.

చదువు.. చదువు.. చదువు!

పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులైతే ముందుగా సంతోషపడేది తల్లిదండ్రులే! అయితే వారు నిరంతరం చదువుతూ ఉండడం వల్లే ఇది సాధ్యపడుతుందన్న ఆలోచనలో ఉంటారు కొందరు తల్లిదండ్రులు. అందుకే పదే పదే ‘చదువు.. చదువు..’ అంటూ వారిపై ఒత్తిడి తెస్తుంటారు. ఇక దీనికి తోడు పిల్లలతో పుస్తకాలు చదివించే అలవాటు చేయాలనుకుంటారు మరికొందరు పేరెంట్స్‌. అయితే చదువు విషయంలో ఇలా పిల్లల్ని బలవంత పెట్టడం వల్ల అది వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తద్వారా చదవాలన్న ఆసక్తి కూడా క్రమంగా తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.

అందుకే పిల్లలు చదువులో మెరుగ్గా ఉండాలంటే.. వారికో చక్కటి ప్రణాళిక రూపొందించాలి. అందులో వారికి నచ్చిన వ్యాపకాలకు తగిన సమయం కేటాయించేలా శ్రద్ధ చూపాలి. అప్పుడే వారు మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. పాఠ్యాంశాల పైనా ఆసక్తి పెంచుకోగలుగుతారు. ఇక పిల్లల్లో ఇతర పుస్తకాలు చదివే ఆసక్తిని పెంచాలంటే.. చిన్న వయసు నుంచే వారికి అలవాటు చేయాలి. అది కూడా మీరు చదువుతూ.. వారికి చెప్పడం వల్ల చిన్నారులకు పుస్తకాల విలువ తెలుస్తుంది.

నచ్చినా, నచ్చకపోయినా.. అదే చేయాలి!

పిల్లల విషయంలో ఈ మొండిపట్టుదలే వద్దంటున్నారు నిపుణులు. వారికి ఇష్టమా, కాదా అన్నది తెలుసుకోకుండా.. ‘నువ్వు ఐఏఎస్‌ అవ్వాలి..’, ‘సంగీతం నేర్చుకుంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది..’ అంటూ తమ ఇష్టాయిష్టాల్ని చిన్నారులపై రుద్దాలని చూస్తుంటారు కొందరు తల్లిదండ్రులు. ఇలా మీ బలవంతం వల్ల నచ్చని అంశాన్ని ఎంచుకొని వారు రాణించలేరు. అటు వారికి నచ్చిన అంశం పైనా దృష్టి పెట్టే అవకాశం ఉండదు. దీనివల్ల వారి భవిష్యత్తు ఎటూ కాకుండా తయారవుతుంది. ఇలా కూడా పరోక్షంగా మీకే నష్టం. కాబట్టి మీ ఇష్టాయిష్టాలు పక్కన పెట్టి.. పిల్లలకు ఏ అంశంపై ఆసక్తి ఉందో ముందు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అది మీకు నచ్చకపోయినా నిరుత్సాహపరచకుండా.. వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేయండి. తద్వారా తప్పకుండా వారు అందులో రాణించగలుగుతారు. ఇలా నచ్చిన రంగాన్ని ఎంచుకొని విజయం సాధించిన వారి స్ఫూర్తి గాథలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు..!

ఆ పొరపాటు వద్దు!

ఇంటికి ఎవరైనా బంధువులొచ్చినప్పుడు చాలామంది పేరెంట్స్‌ తమ పిల్లల్ని వారికి తోడుగా ఉండమని చెప్పి.. వాళ్ల పనుల్లో వాళ్లు నిమగ్నమవుతుంటారు. అక్కడితో ఆగకుండా.. బలవంతంగా వారికి షేక్‌హ్యాండ్‌ ఇవ్వమనడం, ముద్దుపెట్టమనడం, వారు పిల్లలకు పెట్టేంత చొరవనివ్వడం.. వంటివి చేస్తుటారు. నిజానికి వీటిపై చిన్నారులు అంత ఆసక్తి చూపరు. అయినా బలవంతం చేయడం వల్ల.. అవతలి వారు మీ పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించేందుకు, లైంగిక వేధింపులకు గురి చేసేందుకు మీకు మీరే అవకాశం కల్పించినట్లవుతుంది. కాబట్టి ఇలాంటివి ప్రోత్సహించకూడదు. అలాగే మీ చిన్నారులు వాళ్లతో దూరంగా ఉన్నప్పటికీ.. ఓ కన్నేసి ఉంచడం ముఖ్యం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్