అందుకే మట్టి కుండలో నీళ్లే మంచివట!

కావ్యకు బాగా చల్లటి పదార్థాలు తిన్నా, ఫ్రిజ్‌లో నిల్వ చేసిన నీళ్లు తాగినా ఇట్టే జలుబు చేసేస్తుంటుంది.

Updated : 14 Mar 2022 18:44 IST

కావ్యకు బాగా చల్లటి పదార్థాలు తిన్నా, ఫ్రిజ్‌లో నిల్వ చేసిన నీళ్లు తాగినా ఇట్టే జలుబు చేసేస్తుంటుంది. అందుకే వేసవిలో ఎంత వేడిగా ఉన్నా సరే.. ఫ్రిజ్‌ వాటర్‌ను పూర్తిగా దూరం పెట్టి మట్టి కుండలో నిల్వ చేసిన నీటినే తాగుతుంటుంది.

భవ్య కూడా అంతే. సీసాల్లో నీళ్లు నింపి ఫ్రిజ్‌లో పెట్టినా.. తను మాత్రం కుండలో నీళ్లే తాగుతుంది. ఎందుకంటే అవే రుచిగా ఉండి, దాహాన్ని తీరుస్తాయంటుంది.

ఇలా కారణమేదైనా వేసవిలో మన దాహాన్ని తీర్చడంతో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది మట్టి కుండ. అందుకే చాలామంది తమ ఇళ్లలో రిఫ్రిజిరేటర్‌ ఉన్నప్పటికీ ఓ మట్టి కుండను తప్పకుండా ఏర్పాటుచేసుకుంటారు. ఫ్రిజ్‌ వాటర్‌కి బదులుగా అందులో నిల్వ చేసిన నీటిని తాగుతూ.. ఈ మండే వేసవిలో చల్లటి నీళ్లు తాగాలన్న తమ కోరికను తీర్చుకుంటుంటారు. ఆరోగ్యాన్నీ సొంతం చేసుకుంటుంటారు. మరి, ఇంతకీ మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయో తెలుసుకుందాం రండి..

* వేసవిలో బాగా చల్లగా ఉండే నీరు తాగాలనిపించడం సహజం. అయితే ఇంత చల్లదనాన్ని మన సున్నితమైన గొంతు తట్టుకోలేదు. ఫలితంగా గొంతునొప్పి, జలుబు, దగ్గు.. వంటివి తలెత్తుతుంటాయి. మరి, అలా జరగకూడదంటే మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగడం మంచిది. ఎందుకంటే మట్టి సహజసిద్ధమైన కూలింగ్‌ ఏజెంట్‌గా పనిచేసి.. మన గొంతు ఎంత చల్లదనాన్నైతే తట్టుకుంటుందో అంతే చల్లటి నీటిని మనకు అందిస్తుంది.

* మట్టి ఎన్నో ఖనిజ లవణాల మిశ్రమం. అలాగే అందులో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ ఎనర్జీ దాగుంటుంది. ఇలాంటి మట్టితో తయారుచేసిన కుండలో నీటిని నిల్వ చేయడం వల్ల ఈ సద్గుణాలన్నీ ఆ నీటిలోకి చేరతాయి. ఈ నీటిని తాగడం వల్ల వేసవిలో మనం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడంతో పాటు శరీరం డీహైడ్రేట్‌ కాకుండా జాగ్రత్తపడచ్చు.

* వేసవి కాలంలో కాసేపు బయట తిరిగినా, వడగాలులు మన శరీరాన్ని తాకినా వడదెబ్బ తగలడం సహజం. అలా జరగకూడదంటే మట్టి పాత్రల్లో నిల్వ చేసిన నీరు తాగడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నీళ్లు శరీరంలోని గ్లూకోజ్‌ స్థాయుల్ని అదుపులో ఉంచి వడదెబ్బ నుంచి మనల్ని కాపాడతాయి.

* బయటికి వెళ్లేటప్పుడు చాలామంది ప్లాస్టిక్‌ బాటిల్‌లో నిల్వ చేసిన చల్లటి నీటిని వెంట తీసుకెళ్తుంటారు. అయితే ఈ ప్లాస్టిక్‌లో కొన్ని విష రసాయనాలు మన శరీరానికి హాని చేస్తాయి. పైగా ప్లాస్టిక్‌ బాటిల్‌లోని నీళ్లు త్వరగా వేడెక్కుతాయి కూడా! అందుకే మట్టితో తయారుచేసిన బాటిల్స్‌ని వెంట తీసుకెళ్లమంటున్నారు నిపుణులు. ప్రస్తుతం మట్టితో తయారుచేసిన టెర్రకోటా బాటిల్స్‌ మార్కెట్లో విభిన్న మోడల్స్‌లో లభ్యమవుతున్నాయి.

* వేసవిలో కొంతమందిలో జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ఆ సమస్య నుంచి బయటపడాలంటే మట్టి కుండలో నిల్వ చేసిన నీళ్లు తాగడం శ్రేష్టం అంటున్నారు నిపుణులు. ఇందుకు మట్టిలో ఉండే ఖనిజలవణాలే కారణం. అవి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి.

* వేసవిలో బయటి నుంచి రాగానే బాగా చల్లగా ఉండే నీళ్లు తాగాలనిపిస్తుంది. కానీ ఇలా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా ఉండడం, నీరు మరీ చల్లగా ఉండడంతో.. రెండింటి ఉష్ణోగ్రతల మధ్య సమతుల్యం లోపించి గుండె, రక్తనాళాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి బయటి నుంచి రాగానే వెంటనే కాకుండా ఓ పది నిమిషాల పాటు సేదదీరి, ఆపై కుండలో నిల్వ చేసిన సహజసిద్ధంగా చల్లబడిన నీటిని తాగడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్