ఏ పప్పు.. ఎంత సేపు నానబెట్టాలి?

వండే ముందు పప్పుల్ని, కాయధాన్యాల్ని ఎందుకు నానబెడతాం? బాగా నానితే త్వరగా ఉడుకుతాయని.. అంటారా? ఇది కరక్టే కానీ.. దీనివల్ల ఇవి త్వరగా జీర్ణమవడంతో పాటు.. వీటిలో ఉండే పోషకాలు శరీరానికి బాగా అందుతాయని చెబుతున్నారు నిపుణులు. తద్వారా జీర్ణ సంబంధిత....

Published : 24 Aug 2022 19:48 IST

వండే ముందు పప్పుల్ని, కాయధాన్యాల్ని ఎందుకు నానబెడతాం? బాగా నానితే త్వరగా ఉడుకుతాయని.. అంటారా? ఇది కరక్టే కానీ.. దీనివల్ల ఇవి త్వరగా జీర్ణమవడంతో పాటు.. వీటిలో ఉండే పోషకాలు శరీరానికి బాగా అందుతాయని చెబుతున్నారు నిపుణులు. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఏ పప్పును/కాయధాన్యాన్ని ఎంత సేపు నానబెట్టాలి? ఎలా నానబెట్టాలి? వంటి విషయాల గురించి తెలుసుకుందాం రండి..

ఎందుకు నానబెట్టాలంటే..?!

కంది, పెసర, శెనగపప్పులతో పాటు రాజ్మా గింజలు, కాబూలీ శెనగలు.. వంటివి మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటుంటాం. అయితే వీటిని వండుకునే ముందు కొన్ని గంటల పాటు నానబెట్టడం మనకు అలవాటే. నిజానికి ఈ ప్రక్రియ వల్ల అవి త్వరగా ఉడకడంతో పాటు జీర్ణ వ్యవస్థకూ మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. నానబెట్టడం వల్ల వీటిలో ఉండే ఫైటేస్‌ అనే ఎంజైమ్‌ యాక్టివేట్‌ అవుతుంది. ఇది పప్పుల్లోని పోషకాల్ని శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుంది. అంతేకాదు.. నానబెట్టే ప్రక్రియ వల్ల వాటిలోని అమైలేజ్‌ అనే సమ్మేళనం యాక్టివేట్‌ అయి.. పప్పులు, కాయధాన్యాల్లోని సంక్లిష్ట పిండి పదార్థాల్ని విచ్ఛిన్నం చేసి.. అవి త్వరగా జీర్ణమయ్యేందుకు సహకరిస్తుంది. ఫలితంగా గ్యాస్ట్రిక్‌, కడుపుబ్బరం.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండచ్చు.

ఎంత సేపు నానబెట్టాలి?

పప్పులు, కాయధాన్యాలు.. ఇలా ఒక్కో రకాన్ని బట్టి దాన్ని నానబెట్టే సమయం వేర్వేరుగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఉదాహరణకు..

పెసలు, మినుములు.. వంటి ముడిపప్పుల్ని 8-12 గంటల పాటు నానబెట్టాలి.

పెసర, కంది, శెనగ, మినప్పప్పు.. వంటి వాటిని 6-8 గంటలు నాననివ్వాలి.

ఇక రాజ్మా, శెనగలు, కాబూలీ శెనగలు.. వంటి కాయధాన్యాల్ని 12-18 గంటలు నానబెట్టడం మంచిది. ఇక ఇంత సమయం లేదనుకునే వారు రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వండుకున్నా సరిపోతుంది.

కడగడానికీ ఓ పద్ధతుంది!

చాలావరకు పాలిష్‌ చేసిన పప్పులే మార్కెట్లో దొరుకుతున్నాయి. ఈ క్రమంలో వీటిలో కృత్రిమ రంగులు, పురుగులు పట్టకుండా కొన్ని పౌడర్లు కలుపుతుంటారు. ఇక మెరుపు కోసం కొన్నింటిని నైలాన్‌, మఖ్మల్‌, లెదర్‌ పాలిష్‌ కూడా చేస్తారట! ఇలాంటివన్నీ ఆరోగ్యానికి హానికరం. కాబట్టి వీటిని నానబెట్టే ముందు, వండుకునే ముందు బాగా శుభ్రం చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో..

కావాల్సినంత పప్పును గిన్నెలోకి తీసుకొని 3-4 సార్లు చేత్తో నలుపుతూ నీటితో కడగాలి.

ఆపై అడుగున రంధ్రాలున్న జల్లెడ లాంటి బౌల్‌లోకి ఈ పప్పును తీసుకొని.. కుళాయి నీటి కింద మరోసారి కడగాలి.

ఇప్పుడు మరో గిన్నెలో పప్పు తీసుకొని నీళ్లు పోసి నానబెట్టాలి.

తిరిగి వండుకునే ముందు మరో రెండుమూడు సార్లు కడగడం వల్ల వాటిపై ఉండే రసాయనాలు, పాలిష్‌ తొలగిపోతాయి.

ఆ నీటిని పడేస్తున్నారా?

కొంతమంది పప్పు నానబెట్టిన నీటిని వార్చకుండా అలాగే వండుకోవడం, మరికొంతమంది ఆ నీటిని పారబోయేడం.. వంటివి చేస్తుంటారు. ఈ రెండూ కరక్ట్‌ కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే నానబెట్టిన నీటిలో టానిన్లు/ఫైటికామ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపులోకి వెళ్తే కడుపుబ్బరం, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. అలాగని ఈ నీటిని పడేయకుండా మొక్కలకు పోస్తే.. అవి మరింత ఏపుగా పెరుగుతాయని చెబుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్