అది హద్దుల్లో ఉంటేనే ముద్దు..!

ప్రేమ.. ఇద్దరు వ్యక్తుల మనసులను ముడిపెట్టే ఈ సాధనం.. మితిమీరితే అవే మనసుల మధ్య మంటలు కూడా పుట్టించగలదు. అందుకే దేనికైనా హద్దులుండాలంటారు పెద్దలు. కానీ కొంతమంది తమ భాగస్వామిని అపరిమితంగా ప్రేమిస్తూ వారిపై అంతులేని ప్రేమ కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అపారమైన ప్రేమ మంచిదే అయినప్పటికీ ఒక్కోసారి దానివల్ల వైవాహిక బంధంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు.

Updated : 22 Jun 2021 15:32 IST

ప్రేమ.. ఇద్దరు వ్యక్తుల మనసులను ముడిపెట్టే ఈ సాధనం.. మితిమీరితే అవే మనసుల మధ్య మంటలు కూడా పుట్టించగలదు. అందుకే దేనికైనా హద్దులుండాలంటారు పెద్దలు. కానీ కొంతమంది తమ భాగస్వామిని అపరిమితంగా ప్రేమిస్తూ వారిపై అంతులేని ప్రేమ కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అపారమైన ప్రేమ మంచిదే అయినప్పటికీ ఒక్కోసారి దానివల్ల వైవాహిక బంధంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. దంపతుల మధ్య మితిమీరిన ప్రేమ వల్ల తలెత్తే ఆ ఇబ్బందులేంటి? వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? మొదలైన విషయాలు మనమూ తెలుసుకుందాం రండి..

ప్రేమించడం కన్నా ప్రేమించబడడం అదృష్టం అంటారు. అయితే అది హద్దుల్లో ఉన్నంతవరకు ఓకే. కానీ ఆ ప్రేమ మితిమీరితే మాత్రం ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఆలుమగల మధ్య ఈ అపారమైన ప్రేమ వల్ల చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. అవి వైవాహిక బంధాన్ని బీటలు వారేలా చేస్తాయి.

అత్యుత్సాహం చూపద్దు..

సాధారణంగా భాగస్వామిని అమితంగా ఇష్టపడేవారు వాళ్లకు సంబంధించిన అన్ని పనుల్లోనూ సహాయపడాలని లేదా భాగస్వామ్యం పొందాలని తాపత్రయపడతారు. తద్వారా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందన్నది వారి భావన. అయితే ఎల్లవేళలా ఈవిధంగా భాగస్వామి పనుల్లో కల్పించుకోవడానికి అత్యుత్సాహం చూపకూడదు. ఫలితంగా వారు కొన్ని సందర్భాల్లో అసౌకర్యానికి గురవ్వచ్చు. అంతేకాదు.. తాము చేసే పనిలో తప్పులు దొర్లుతాయేమోనని లేదంటే తాము చేసే పనిపై తమ భాగస్వామికి నమ్మకం లేకపోవడం వల్లే తమకు సంబంధించిన అన్ని పనుల్లో వారు కల్పించుకుంటున్నారనే భావన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మీ భాగస్వామిలో మానసికంగా ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి సమస్యలెదురైనప్పుడు మీలో ఉన్న ప్రేమ వారికి సహాయం చేసే విధంగా ఉండాలే కానీ అన్ని విషయాల్లో వేలు పెట్టడం సరికాదు. ఈ సూత్రాన్ని పాటిస్తే ఒకరిపై మరొకరికి నమ్మకం పెరగడమే కాదు.. దాంపత్య బంధం కూడా దృఢమవుతుంది.

నన్ను పట్టించుకోవట్లేదు..

'చిన్నూ.. పెళ్త్లెన కొత్తలో నన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టేవాడివి కాదు.. ఇప్పుడు నాతో గడపడానికి నీకు తీరికే దొరకడం లేదు కదా..!'
ఏంటీ.. ఈ డైలాగ్ వినగానే మీరూ మీ భాగస్వామితో ఎప్పుడో అన్నట్లు గుర్తొస్తోందా?? చాలామంది తమ భాగస్వామి ముందు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం సర్వసాధారణం. అయితే పని ఒత్తిడిలో పడిన భాగస్వామికి మీ గురించి గుర్తు చేయడానికి ఎప్పుడో ఒకసారి ఇలా సరదాగా అంటే ఫర్వాలేదు. కానీ రోజూ ఇలాగే మీ భాగస్వామి మీపై మితిమీరిన ప్రేమ చూపాలనుకోవడం కరక్ట్ కాదు. ఎందుకంటే ఇలా మీరు రోజూ వారిని విసిగించడం వల్ల వారికి మీపై ప్రేమ పెరగడం కాదు.. తగ్గిపోయే అవకాశాలూ ఉన్నాయి. కాబట్టి మీతో గడపడానికి వారికి తీరిక ఎందుకు దొరకట్లేదనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణంగా మసలుకుంటే భార్యాభర్తల మధ్య మితిమీరిన ప్రేమతో గొడవలు రాకుండా ఉంటాయి. ఈ చిట్కా మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకునే తత్వాన్ని, ఆప్యాయతను పెంచుతుంది.

అంతరాయం కలిగించొద్దు..

భాగస్వామి ఎప్పుడూ తమ కళ్లముందే ఉండాలి.. తమతోనే అధిక సమయం గడపాలి అనుకోవడం సహజం. కానీ ఆఫీసు, ఇతర పనులు కూడా వారికి ముఖ్యమే కదా.. కాబట్టి ఈ క్రమంలో వారు ఆఫీసు లేదా ఇతర పనుల వల్ల బయటికి వెళ్లినప్పుడు వారిపై మీకు ఎంత ప్రేముందో తెలియజేయడానికి పదే పదే ఫోన్ చేయడం, సందేశాలు పంపించడం.. ఇలా వారి పనికి అంతరాయం కలిగించడం సరికాదు. దీనివల్ల మీ ప్రేమను మీ భాగస్వామిపై కురిపిస్తున్నారేమోనని మీకు అనిపించచ్చు.. కానీ వారికి మీపై కోపం, చికాకు పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో అతిప్రేమ ప్రదర్శించకపోవడమే మంచిది. కావాలంటే ఇంట్లో ఉన్నప్పుడు లేదంటే వారు ఖాళీగా ఉన్న సమయాల్లో వారితో గడపడం, వారికి నచ్చిన విధంగా ప్రవర్తించడం.. వంటివి చేయాలి. ఇది మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధాన్ని రెట్టింపు చేస్తుంది.

 

ఇవి గుర్తుంచుకోండి...

* మీ భాగస్వామిపై ఉన్న ప్రేమను మీరు వ్యక్తం చేసినట్లే వాళ్లు కూడా మీపై ఉన్న ప్రేమను ఎప్పటికప్పుడు బహిర్గతం చేయాలని, మీకంటే ఎక్కువగా ప్రేమించాలని.. ఇలా కొందరు అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకోవడంలో తప్పులేదు. కానీ దీన్నే పదే పదే ప్రస్తావిస్తూ గొడవలు సృష్టించుకోవడం కంటే ఒకరి ఇష్టాయిష్టాలు, ప్రాధాన్యాలు, మనస్తత్వాలు మరొకరు తెలుసుకొని ముందుకు సాగితే దాంపత్య బంధం మరింత బలపడుతుంది.
* మీ పూర్తి దృష్టిని భాగస్వామి పైనే కేంద్రీకృతం చేయడం ఒకందుకు మంచిదే కానీ.. దాంతో పాటు వారిపై మితమైన ప్రేమను ప్రదర్శిస్తూనే మీ అభిరుచులకు పదును పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఫలితంగా మీ పనిలో మీరూ గుర్తింపు సాధిస్తారు.
* అలాగే ఇతరుల ముందు భాగస్వామిని తక్కువ చేసి మాట్లాడడం, వారిపై జోక్స్ వేయడం వంటివి అస్సలు చేయకూడదు. ఇవి వారి మనసును పరోక్షంగా బాధిస్తాయి. ఈ విషయం గ్రహించకుండా ప్రేమ కొద్దీ చాలామంది ఇతరుల ముందు భాగస్వామిని ఆటపట్టిస్తూ ఉంటారు. అది కూడా సరైంది కాదు.

దాంపత్య బంధంలో ప్రేమ హద్దుల్లో ఉంటేనే మంచిదన్న విషయం తెలుసుకున్నారు కదా..! కాబట్టి మీరు కూడా ఇవన్నీ గుర్తుంచుకొని మీ భాగస్వామిని ప్రేమించండి.. వారి ప్రేమ పొందండి.. ఇలా చేస్తే ఇంకేముంది.. సంసారం సాఫీగా సాగిపోతుంది.. ఏమంటారు..??

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్