Apo Whang Od: భామలకు పోటీగా.. బామ్మ!

వోగ్‌ ఫ్యాషన్‌ మ్యాగజీన్‌ అనగానే గుర్తొచ్చేది.. దాని కవర్‌పేజీపై అందమైన మోడళ్లే! కానీ దానిపై తొలిసారి ఓ 106 ఏళ్ల బామ్మకి స్థానం కల్పించారు. ఆ రంగుల ప్రపంచాన్ని ఈ బామ్మ ఎలా ఆకర్షించింది? తెలుసుకుందాం.. రండి.

Published : 06 Apr 2023 00:19 IST

వోగ్‌ ఫ్యాషన్‌ మ్యాగజీన్‌ అనగానే గుర్తొచ్చేది.. దాని కవర్‌పేజీపై అందమైన మోడళ్లే! కానీ దానిపై తొలిసారి ఓ 106 ఏళ్ల బామ్మకి స్థానం కల్పించారు. ఆ రంగుల ప్రపంచాన్ని ఈ బామ్మ ఎలా ఆకర్షించింది? తెలుసుకుందాం.. రండి.

పచ్చబొట్టు.. ఫ్యాషన్‌ ట్రెండ్‌లో ఒక భాగం. ఇప్పుడంటే అమ్మాయిలూ టాటూలు వేసేస్తున్నారు కానీ.. ఒకప్పుడు దీనిలోనూ పురుషాధిక్యతే! 90 ఏళ్ల క్రితమే అపోవాంగ్‌డీ ఈ కళలో ప్రావీణ్యం సంపాదించారు. ఈవిడది ఫిలిప్పిన్స్‌లోని బస్కలన్‌ అనే గ్రామం. 16 ఏళ్లప్పుడు తండ్రి నుంచి టాటూ శిక్షణ పొంది దాన్నే జీవనాధారంగా మలుచుకున్నారు. తనకు తిండి పెట్టిన పని అంతరించి పోతుందేమోనన్న భయంతో ప్రచారం చేస్తూనే యువతరంతో పోటీపడుతూ రాణిస్తున్నారు కూడా. శరీరమంతా కళింగ తెగ చిహ్నాలని పచ్చబొట్టు వేసుకొని టాటూ ప్రియులను ఆకర్షిస్తున్నారు. అంతేకాదు.. వాటి వెనుక కథలను వినియోగదారులకీ చెబుతారట. దాదాపు 40 నిమిషాలు.. వెదురు కర్ర, ముల్లు, బొగ్గులను సాధనాలుగా చేసుకొని చిత్రిస్తున్న ఆకారాలకు యువత ఫిదా అవుతోంది. కళింగ తెగలో ఈమె చివరి వారసురాలు. తనకి పిల్లల్లేరు. దాంతో ఈ వారసత్వాన్ని కాపాడటానికి తన మేనకోడలికి ఏళ్లుగా శిక్షణ ఇస్తున్నారు. తన గ్రామంలోని మహిళలకీ నేర్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తున్నారు. బస్కలన్‌ పర్వత అందాల్ని చూడటానికి వచ్చిన పర్యాటకులు ఈమె కళకు ఫిదా అవుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఈ ప్రాంతానికి ఈమె కళే ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఫిలిప్పిన్స్‌ వచ్చిన వారు టాటూ కోసమే బస్కలన్‌ చూడటానికి వస్తారట. పచ్చబొట్టు అనగానే తమ గ్రామమే గుర్తుకు రావాలన్నది తన కల అంటారు అపోవాంగ్‌డీ. 106 ఏళ్ల వయసులోనూ కొండలు, గుట్టలు ఎక్కి పర్యటకులకు తమ కళను పరిచయం చేస్తున్నారు. ఒంట్లో శక్తి ఉన్నంతవరకూ కొనసాగిస్తానంటున్నారు. ఈ తపనకు మెచ్చే వోగ్‌ మ్యాగజీన్‌ ముఖచిత్రంగా ఈమెను ఎంపిక చేసుకుంది. దీనిపై మెరిసిన అత్యంత పెద్ద వయసున్న మహిళగానూ అపోవాంగ్‌డీ నిలిచారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని