మహిళలకూ రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ అవసరమే!

ఆర్థిక విషయాల్లో మహిళలకు అవగాహన అంతంత మాత్రమే అనే అపవాదు మనకు కొత్తేమీ కాదు. వేల కొద్దీ సంపాదిస్తోన్నా పొదుపు-మదుపుల విషయానికొచ్చే సరికి మాత్రం ఆ వ్యవహారాలన్నీ తండ్రులు, భర్తల చేతిలో పెట్టే వారే ఎక్కువగా ఉంటున్నారు. అలాంటిది ఇక రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ గురించి ఆలోచించే మహిళల్ని వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. మన దేశంలో జరిగిన కొన్ని ప్రయోగాత్మక అధ్యయనాలు సైతం ఇదే విషయం చెబుతున్నాయి.

Published : 05 Aug 2021 18:46 IST

ఆర్థిక విషయాల్లో మహిళలకు అవగాహన అంతంత మాత్రమే అనే అపవాదు మనకు కొత్తేమీ కాదు. వేల కొద్దీ సంపాదిస్తోన్నా పొదుపు-మదుపుల విషయానికొచ్చే సరికి మాత్రం ఆ వ్యవహారాలన్నీ తండ్రులు, భర్తల చేతిలో పెట్టే వారే ఎక్కువగా ఉంటున్నారు. అలాంటిది ఇక రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ గురించి ఆలోచించే మహిళల్ని వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. మన దేశంలో జరిగిన కొన్ని ప్రయోగాత్మక అధ్యయనాలు సైతం ఇదే విషయం చెబుతున్నాయి. చిన్న వయసులోనే ఉద్యోగం చేస్తున్నప్పటికీ వారిలో రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ చేసుకునే వారు చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఉన్నారంటున్నాయి. పెట్టుబడులపై అవగాహన లేకపోవడం, ఆర్థిక విషయాల్లో ఇతరులపై ఆధారపడడం, ఎలాంటి ఆర్థిక ఉత్పత్తి కొనుగోలు చేయడం మంచిదన్నది తెలియకపోవడం.. ఇలా కారణమేదైనా కానీ వాటన్నింటినీ తోసిరాజని.. మహిళలు తమ రిటైర్మెంట్‌ కోసం ముందు నుంచే చక్కటి ప్రణాళిక వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత వారు నిశ్చితంగా, ఇతరులపై ఆధారపడకుండా జీవించడానికి ఈ ప్లానింగ్‌ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ఈ రోజుల్లో మహిళలు కూడా పురుషులతో సమానంగా కెరీర్‌లో రాణిస్తున్నారన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే వారికి అదనంగా ఉన్న కుటుంబ బాధ్యతల రీత్యా.. కొంతమంది మహిళలు మధ్యలోనే ఉద్యోగానికి రాజీనామా చేస్తే.. మరికొంతమంది తప్పని పరిస్థితుల్లో పార్ట్‌టైమ్‌ జాబ్‌, తక్కువ జీతానికి పనిచేయడం.. వంటివి చేస్తున్నారు.. ఇంకొన్ని కంపెనీల్లో లింగ అసమానత కారణంగా వారికి పురుషులతో సమానంగా జీతభత్యాలు దక్కట్లేదనే చెప్పాలి. ఇలా ఎటు నుంచి చూసినా పదవీ విరమణ పొందాక వారికి పెన్షన్‌ వస్తుందన్న ధీమా కనిపించట్లేదు. అలాంటప్పుడు సంపాదిస్తోన్న ఆ కొద్ది మొత్తం నుంచైనా రిటైర్మెంట్‌ కోసం ప్లాన్‌ చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు.

‘బీమా’ జీవితానికో ధీమా!

ఆర్థిక ప్రణాళిక అనేది ఏ నెలకో, రెండు నెలలకో ముగిసేది కాదు.. మనకొస్తున్న ఆదాయాన్ని బట్టి దీర్ఘకాలం పాటు పొదుపు-మదుపులు చేయాల్సి ఉంటుంది. అప్పుడే రిటైరయ్యాక కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా జీవించచ్చు. అయితే ఇలాంటి ప్లానింగ్‌ వేసుకోవడానికి ముందే ఓ ఆరోగ్య బీమా, ఓ జీవిత బీమా పాలసీ తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. వయసు చిన్నదైనా, పెద్దదైనా ఏ ఆపద, అనారోగ్యం తలెత్తుతుందో చెప్పలేం కాబట్టి.. అలాంటప్పుడు ఈ బీమా పాలసీ అత్యవసర నిధిలా ఉపయోగపడుతుందంటున్నారు. అయితే మీ అవసరాలేంటి? మీకొచ్చే జీతం ఎంత? దీన్ని బట్టి ఎంత మొత్తంలో బీమా తీసుకోవడం మంచిది? అన్న విషయాలు ముందే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కావాలంటే ఈ విషయంలో మీ ఇంట్లో వాళ్ల సహాయం లేదంటే నిపుణుల సలహాలు తీసుకొని ముందుకెళ్లచ్చు.

రిస్క్‌ తక్కువ.. రక్షణ ఎక్కువ!

డబ్బు విషయంలో రిస్క్‌ చేయడానికి మహిళలు అస్సలు ఇష్టపడరు. ఉన్నదాంట్లోనే సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తారే తప్ప.. ‘వస్తే లాభాలొస్తాయి లేదంటే నష్టపోతాం..’ అంటూ ధైర్యం చేసే మహిళల్ని మనం అరుదుగా చూస్తుంటాం. ఇలా రిస్క్‌ చేయలేని వారు రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌, సిప్‌.. వంటి పొదుపు మార్గాల్ని అనుసరించచ్చంటున్నారు నిపుణులు. ఇవి సుదీర్ఘకాలం పాటు కొనసాగే ఆర్థిక ప్రణాళికలు.. పైగా ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బుకు ఎలాంటి ఢోకా ఉండదు. ఈ మొత్తం రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక భద్రత, ఇల్లు కొనడం.. వంటి దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది.

అందుకే అవగాహన అవసరం!

పెరిగే అవసరాలు, ధరల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇద్దరూ సంపాదిస్తోన్నప్పుడు ఇద్దరూ పొదుపు చేయడం/పెట్టుబడులు పెట్టడం ఎంత అవసరమో.. ఇద్దరూ విడివిడిగా రిటైర్మెంట్‌ కోసం ప్లాన్‌ చేసుకోవడమూ అంతే ముఖ్యమంటున్నారు నిపుణులు. తద్వారా పదవీ విరమణ తర్వాత కూడా ఎలాంటి చీకూ చింతా లేకుండా ఆర్థిక భద్రత సొంతం చేసుకోవచ్చంటున్నారు. అయితే ఈ విషయంలో మహిళలు అవగాహన పెంచుకొని సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకోవాలంటున్నారు. ఎందుకంటే.. ఆర్థిక విషయాల్లో భర్త/ఇతర కుటుంబ సభ్యులపై ఆధారపడితే.. ఒకవేళ వాళ్లు చనిపోయినా, మిమ్మల్ని విడిచి వెళ్లిపోయినా.. ఆ తర్వాత మీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. అలా జరగకూడదంటే రిటైర్మెంట్‌ ప్లానింగ్‌, ఇతర ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకొని తగిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగడం మంచిది.

ఆస్తులు సంపాదించుకోవాలి!

పెళ్లి, పిల్లలు పుట్టకముందు మహిళలు సంపాదనపై పూర్తి దృష్టి పెట్టినా.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కెరీర్‌ను కొనసాగించే వాళ్లు చాలా తక్కువ మందే అని చెప్పాలి. ఇందుకు కుటుంబ బాధ్యతలు, ఇతర వ్యక్తిగత విషయాలు.. వంటివి కారణమవుతుంటాయి. అందుకే చేతి నిండా సంపాదించినప్పుడే ఎక్కువ మొత్తంలో వెనకేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఇలా ఈ డబ్బుతో ఇల్లు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్‌.. వంటి ఆస్తుల్ని కొనుగోలు చేసి మీ పేరిట రిజిస్టర్‌ చేయించుకుంటే.. ముందు ముందు మీరు అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక పెద్ద ఇల్లైతే ఇతరులకు అద్దెకిచ్చి కొంత సొమ్ము ఆర్జించచ్చు.. దీన్ని రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అలాగే మీరు కొన్న ఈ ఆస్తుల విలువ క్రమంగా పెరుగుతుందే తప్ప తరిగే ఛాన్సే లేదు.

సింగిలా? పెళ్లైందా?!

పెళ్లి కాకముందు/సింగిల్‌గా ఉన్న మహిళలు, పెళ్లైన మహిళలు రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ వేసుకునే క్రమంలో ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు.

* పెళ్లి కాని అమ్మాయిలు ఎంత చిన్న వయసులో సంపాదన మొదలుపెడితే.. అంత త్వరగా రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ మొదలుపెట్టడం మంచిది. ఈ క్రమంలో పీఎఫ్‌తో పాటు ఈక్విటీల్లో, ఆస్తులపై పెట్టుబడులు పెడితే ముందు ముందు ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చే ఆస్కారం ఉంటుంది.

* ఆర్థిక మాంద్యం, ఉద్యోగం కోల్పోవడం, ప్రకృతి విపత్తులు, ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు డబ్బు కోసం ఇబ్బంది పడకుండా, ఇతరుల ముందు చేయి చాచకుండా ఉండేందుకు ముందు నుంచీ కొంత మొత్తాన్ని అత్యవసర నిధి కింద దాచుకోవడం మేలు.

* ఇక పెళ్లైన మహిళలు రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ విషయంలో ఓసారి భర్తతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ క్రమంలో ఇద్దరి సంపాదన ఎంత? అందులోంచి ఎంత మొత్తంలో రిటైర్మెంట్‌ కోసం దాచుకోవాలి? వంటి విషయాలన్నీ కలిసి చర్చించి నిర్ణయించుకుంటే ఆ తర్వాత ఇద్దరి మధ్యా ఎలాంటి తగాదాలూ రాకుండా జాగ్రత్తపడచ్చు.

* ఎలాంటి రిటైర్మెంట్‌ పథకాలను ఎంచుకోవడం మంచిదన్న విషయంలో నిపుణుల సలహాలు తీసుకొని ముందుకెళ్లచ్చు. ఈ క్రమంలో పన్ను ఆదా చేసే పథకాలైతే పొదుపును మరింతగా పెంచుకోవచ్చు.

* పదవీ విరమణ పొందాక.. నెలనెలా వచ్చే పెన్షన్‌ డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేయడం, వాటిపై పెట్టుబడి పెట్టడం, రుణం తీసుకోవడం.. వంటివి అస్సలు చేయద్దు. ఎందుకంటే దానివల్ల అదనపు ఆర్థిక భారం మీద పడే అవకాశం ఉంటుంది. వాటిని చెల్లించడానికి లేనిపోని తిప్పలు పడాల్సి వస్తుంది.

సో.. దీన్ని బట్టి చూస్తే.. మనం సంపాదించిన డబ్బును పొదుపు చేసుకోవడం, వాటితో ఆస్తులు కొనుగోలు చేయడం.. వంటివి ఎంత ముఖ్యమో.. రిటైర్మెంట్‌ అవసరాల కోసం ఇప్పట్నుంచే పొదుపు చేసుకోవడం కూడా అంతే ముఖ్యం అన్న విషయం అర్థమవుతోంది. కాబట్టి ఇప్పుడే సరైన రిటైర్మెంట్‌ ప్లాన్‌ తీసుకుందాం.. పదవీ విరమణ పొందాక ఎవరిపై ఆధారపడకుండా, ఆర్థికంగా నిశ్చితంగా ఉందాం..!

ఇంకా ఈ విషయంలో మీకు ఎలాంటి సందేహాలున్నా ఆర్థిక రంగ నిపుణుల సలహాలు తీసుకోవచ్చు.. అలాగే రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ గురించి మీకు తెలిసిన చిట్కాలేవైనా ఉంటే మాతో పంచుకోవచ్చు.. ఇలా మీరిచ్చే సలహాలు ఎంతోమందికి ఈ విషయంలో మార్గనిర్దేశనం చేయచ్చు..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్