లైంగిక వేధింపులా..? మౌనం వీడి ఎదిరించండి..

పని ప్రదేశంలో లైంగిక హింసను, వేధింపులను ఎదుర్కొంటోన్న మహిళా బాధితులు ఎందరో! అయినా పెదవి విప్పి పైఅధికారులకు ఫిర్యాదు చేసే సాహసం చేసే వారిని మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. ‘విమెన్స్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ సర్వే’ కూడా ఇదే విషయం చెబుతోంది.

Updated : 05 Nov 2021 18:10 IST

‘సంగీతా.. ఈ రోజు చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు.. అందరూ వెళ్లిపోయాక ఓసారి నా క్యాబిన్‌కి రా.. నీతో పనుంది.. ఈ రోజు నేనే నిన్ను నా కార్లో దిగబెడతా..’ అంటూ ద్వంద్వార్థం వచ్చేలా బాస్‌ దగ్గర్నుంచి వచ్చిన మెసేజ్‌ చూసుకుంది సంగీత. ఆజ్ఞాపించింది బాస్‌ కదా.. నచ్చినా, నచ్చకపోయినా వెళ్లాల్సిందే!

అంకితకు అర్ధరాత్రి ఫోన్‌ వచ్చింది. ఎవరా అని చూస్తే ఆఫీస్‌లో ఆమె టీమ్‌ లీడర్‌. ఎత్తినా ఎత్తకపోయినా బాధే అనుకుంటూ అయిష్టంగానే ఫోన్‌ లిఫ్ట్‌ చేసిందామె. ‘ఈ రోజు ఇంట్లో నేనొక్కడినే ఉన్నా.. బోర్‌ కొడుతోంది.. నువ్వు నాతో గడపొచ్చుగా!’ అంటూ అసభ్యంగా మాట్లాడుతున్నా మౌనంగా భరించిందే తప్ప మారు మాట్లాడే ధైర్యం చేయలేదామె.

ఇలా చెప్పుకుంటూ పోతే పని ప్రదేశంలో లైంగిక హింసను, వేధింపులను ఎదుర్కొంటోన్న మహిళా బాధితులు ఎందరో! అయినా పెదవి విప్పి పైఅధికారులకు ఫిర్యాదు చేసే సాహసం చేసే వారిని మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. ‘విమెన్స్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ సర్వే’ కూడా ఇదే విషయం చెబుతోంది. సుమారు 68.7 శాతం మంది ఉద్యోగినులు తామెదుర్కొంటోన్న వేధింపుల గురించి రాతపూర్వకంగా గానీ లేదంటే మాటల రూపంలో గానీ ఫిర్యాదు చేసే సాహసం చేయలేకపోతున్నారట! అయితే ఇందుకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పలు కారణాలున్నాయంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏంటవి? చట్టం మనవైపున్నా వీటిపై నోరు విప్పడానికి చాలామంది మహిళలు ఎందుకు ముందుకు రావట్లేదు? ఈ హింసను, వేధింపులను ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి..

పని ప్రదేశంలో లైంగిక హింస, వేధింపులు ఇప్పుడు చాలామంది మహిళలకు అదనపు తలనొప్పిలా తయారయ్యాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు అన్ని రంగాల్లో ఈ సమస్యను ఎదుర్కొంటోన్న అతివలు ఎంతోమంది! ముఖ్యంగా ఐటీ, బీపీఓ, కేపీఓ.. సెక్టార్లలో సుమారు 88 శాతం మంది బాధిత మహిళలున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు ‘Ernst & Young’ సర్వే ప్రకారం.. కేవలం 69 శాతం కంపెనీలు మాత్రమే ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC)’ని ఏర్పాటు చేశాయని, అందులోనూ 60 శాతం సంస్థలు ఫిర్యాదులపై ఎలా స్పందించాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై ఐసీసీ సభ్యులకు శిక్షణ కూడా ఇవ్వట్లేదని తేలింది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. మూడింట ఒక వంతు ఉద్యోగినులకు తమ కంపెనీలో ఇలాంటి ఓ కమిటీ ఉన్నట్లు కూడా తెలియట్లేదట!

అందుకే నోరు విప్పట్లేదా?

పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 1997లో సుప్రీం కోర్టు ‘విశాఖ గైడ్‌లైన్స్‌’ పేరుతో కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. సమస్య పరిష్కారానికి ఓ చట్టం రూపొందే వరకు ఈ మార్గదర్శకాలు అమలు చేయాలని అప్పట్లో కోర్టు పేర్కొంది. ఇవే పునాదిగా 2013లో ‘పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, పరిష్కారం) చట్టం’ అందుబాటులోకొచ్చింది. ఇలా మహిళల రక్షణ కోసం ఓ వ్యవస్థ ఏర్పాటైనా చాలామంది మహిళలు తమపై జరిగే లైంగిక వేధింపుల గురించి నోరు విప్పట్లేదని గణాంకాలు, సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇందుకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని కారణాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..!

* తమ పైఅధికారి తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేస్తే.. దాన్ని సానుకూలంగా స్వీకరించి సంస్థ తనకు తగిన న్యాయం చేస్తుందో లేదోనని చాలామంది మహిళలు వెనకాడుతున్నారట!

* పైగా ఇలా విషయం గురించి బయటికి చెప్పడం వల్ల తమనెక్కడ తప్పుపడతారో, నిందిస్తారో, సహోద్యోగుల ముందు చులకనైపోతామోనన్న భయం మరికొంతమంది మహిళల్లో నెలకొందంటున్నారు నిపుణులు.

* ఆర్థిక అవసరాల కోసం ఉద్యోగం చేస్తోన్న మహిళలు ఇలాంటి సమస్యను మౌనంగా భరిస్తున్నారట! ఎందుకంటే ఈ విషయం బయటికి పొక్కితే తమనెక్కడ ఉద్యోగం నుంచి తీసేస్తారోనన్న బెరుకు వారిని వెంటాడుతోందని చెప్పచ్చు.

* ఇక్కడ ఉద్యోగం పోతే ఆ ప్రభావంతో మరెక్కడా జాబ్‌ దొరకదన్న భయంతో మరికొంతమంది లోలోపలే కుమిలిపోతున్నారట!

* కొన్ని కంపెనీల్లో యజమానులే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. అలాంటప్పుడు ఎవరికీ ఫిర్యాదు చేయలేక.. హింసను మౌనంగా భరిస్తూ.. ఈ రోజుల్లో ఇవన్నీ సహజమే అనుకునే మహిళా బాధితులూ ఉన్నారట!

* కొన్ని కేసుల్లో తమపై లైంగిక వేధింపులకు పాల్పడేదెవరో తెలియక ఫిర్యాదు చేయలేకపోతున్నారట! అంటే.. పరోక్షంగా అసభ్య పదజాలంతో మాట్లాడడం, తెలియని నంబర్ల నుంచి సందేశాలు పంపడం.. వంటివి చేయడమన్నమాట!

* Post Traumatic Stress Disorder (PSTD) తో పాటు ఇతర మానసిక సమస్యల కారణంగా ఈ హింసపై మరికొందరు నోరు విప్పట్లేదని మరికొందరు నిపుణులు అంటున్నారు.

ఇలా అడ్డుకట్ట వేయచ్చు!

ఇలా కారణమేదైనా పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు అడ్డుకట్ట పడాలంటే మాత్రం మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి సమస్యను సంస్థకు/పైఅధికారులకు ఫిర్యాదు చేయాలని.. అలాగే సంస్థలూ కొన్ని చర్యలు తీసుకొని వీటి నిర్మూలన దిశగా చొరవ చూపాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం సంస్థలు ఏం చేయాలంటే..!

* ప్రతి సంస్థలో ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC)’ ఏర్పాటు చేయాలి. తర తమ భేదాలు చూపని సభ్యుల్ని ఈ కమిటీ కోసం ఎంపిక చేయాలి. వారికి తగిన శిక్షణ ఇవ్వాలి.

* లైంగిక వేధింపులంటే శారీరకంగానే కాదు.. మాటల రూపంలోనూ ఉండచ్చు.. అశ్లీల చిత్రాలు చూపిస్తూ కూడా వేధింపులకు గురిచేయచ్చు. అయితే కొంతమంది ఉద్యోగులకు వీటిపై పూర్తి అవగాహన లేక.. తమ చుట్టూ ఏం జరుగుతోందో అర్థం కాక తమలో తామే కుమిలిపోతుంటారు. ఈ సమస్య తొలగిపోవాలంటే ముందు సంస్థలు తమ ఉద్యోగులు, పైస్థాయి అధికారులందరికీ సమావేశం ఏర్పాటు చేసి లైంగిక వేధింపుల గురించి నిపుణులతో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలి.

* సంస్థలు తమ మహిళా ఉద్యోగులకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించడం వల్ల కూడా వారిలో ఆత్మవిశ్వాసం పెంచచ్చు. ఇవి ఆఫీస్‌లోనే కాదు.. బయటి ప్రదేశాల్లోనూ ఈ రకమైన హింసను అడ్డుకోవడంలో ఉపయోగపడతాయి.

* వేధింపులకు గురయ్యే మహిళలకు అండగా తామున్నామన్న భరోసాను కంపెనీ వాళ్లకు కలిగించగలగాలి. ఇందుకోసం తమ సంస్థ అంతర్గత ఫిర్యాదుల కమిటీలో భాగంగా.. లైంగిక వేధింపుల్ని నిరోధించేలా కఠినమైన పాలసీలు రూపొందించి.. వాటికి కట్టుబడి ఉంటామని రాతపూర్వకంగా ఉద్యోగులందరి నుంచి హామీ తీసుకోవాలి.

* అలాగే ఫిర్యాదులొస్తే త్వరగా స్పందించడం, పూర్వాపరాలు పరిశీలించి సత్వరమే కఠిన చర్యలు తీసుకోవడం వల్ల ఈ సమస్యకు కొంతవరకు పరిష్కారం దొరుకుతుందంటున్నారు నిపుణులు.

ఇక మహిళలు కూడా సమాజానికి, తమను వేధించిన వారికి భయపడకుండా నిర్భయంగా సమస్య గురించి బయటికి చెప్పే ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒకరిని చూసి మరొకరు వీటిపై పెదవి విప్పగలుగుతారు. తద్వారా వేధింపులు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

మరి, పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు అడ్డుకట్ట పడాలంటే సంస్థలు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ అభిప్రాయాలు, సలహాలు మాతో పంచుకోండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని