నలభైల్లో బరువు పెరుగుతున్నారా?
అధిక బరువు.. ఏ వయసు వారైనా సరే.. చాలామంది అంగీకరించలేని విషయమిది! అయితే ఎంత వద్దనుకున్నా.. 40 దాటాక చాలామంది మహిళలు క్రమంగా బరువు పెరుగుతారంటున్నారు నిపుణులు. ఇందుకు మన శరీరంలో జరిగే మార్పులతో....
అధిక బరువు.. ఏ వయసు వారైనా సరే.. చాలామంది అంగీకరించలేని విషయమిది! అయితే ఎంత వద్దనుకున్నా.. 40 దాటాక చాలామంది మహిళలు క్రమంగా బరువు పెరుగుతారంటున్నారు నిపుణులు. ఇందుకు మన శరీరంలో జరిగే మార్పులతో పాటు జీవనశైలి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని చెబుతున్నారు. మరి, ఈ సమస్యను అధిగమించి ఈ వయసులో ఫిట్‌గా ఉండడం సాధ్యపడదా అంటే.. అదీ మన చేతుల్లోనే ఉంది. ఇందుకోసం కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం రండి..
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే బరువు అదుపులో ఉండాలి. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ శక్తి క్షీణించడం వల్ల ఏ పని పైనా దృష్టి పెట్టలేం.. వ్యాయామమూ చేయలేం. మరోవైపు జీవక్రియల పనితీరు నెమ్మదిస్తుంది. ఇది క్రమంగా తీపి తినాలన్న కోరికను పెంచుతుంది. ఇలా అటు శరీరానికి శ్రమ లేక, ఇటు అనారోగ్యపూరిత ఆహారానికి అలవాటు పడడం వల్ల క్రమంగా బరువు పెరుగుతాం.
ఇవీ కారణాలే!
⚛ జీవక్రియల పనితీరు నెమ్మదించడం వల్ల శరీరంలోకి చేరిన కొవ్వులు, క్యాలరీలు కరగడానికి చాలా సమయం పడుతుంది. ఇది క్రమంగా అధిక బరువుకు దారితీస్తుంది.
⚛ 40 దాటిన చాలామంది బరువు పెరగడానికి మెనోపాజ్ కూడా ఓ కారణమంటున్నారు నిపుణులు. ఈ వయసులో మెనోపాజ్‌కు చేరువవడం, లేదంటే అప్పటికే ఈ దశలోకి ప్రవేశించడం వల్ల ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్.. వంటి హార్మోన్ల స్థాయుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత అధిక బరువుకు దారితీస్తుంది.
⚛ వయసు పెరిగే కొద్దీ శరీరంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచే ఇన్సులిన్ హార్మోన్ పనితీరులోనూ మార్పులొస్తాయి. తద్వారా ఆకలేసినప్పుడల్లా తీపి పదార్థాల మీదకు మనసు మళ్లుతుంది. కోరిక చంపుకోలేక వాటిని ఎక్కువగా తీసుకుంటే అధిక బరువుతో పాటు టైప్-2 మధుమేహం బారిన పడే అవకాశాలూ ఎక్కువంటున్నాయి కొన్ని అధ్యయనాలు.
⚛ వయసు పెరిగే కొద్దీ ఎముక, కండరాల సామర్థ్యం తగ్గడం వల్ల వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు. ఒకవేళ బలవంతంగా చేసినా.. గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలా శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా శారీరక బరువు పెరుగుతాం.
⚛ మెనోపాజ్‌కు చేరువయ్యే కొద్దీ వేడి ఆవిర్లు, అర్ధరాత్రి ఉన్నట్లుండి చెమటలు పట్టడం.. వంటి సమస్యలొస్తాయి. తద్వారా రాత్రుళ్లు సుఖ నిద్రకు దూరమవుతారు. దీనివల్ల ఒత్తిడి, ఆందోళనలు పెరిగిపోవడం.. జీవనశైలి అదుపు తప్పడం.. ఆఖరికి ఇవి అధిక బరువుకు కారణమవుతాయి.
..అయినా ఫిట్‌గా ఉండచ్చు!
40 దాటిన వారిలో ఇన్ని ప్రతికూలతలున్నా కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోగలిగితే బరువు అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు. తద్వారా ఫిట్‌నెస్‌నూ సాధించచ్చంటున్నారు. అదెలాగంటే..!
⚛ బాదం పప్పులు, వాల్‌నట్స్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు.. వంటి నట్స్‌ని సాయంత్రం స్నాక్‌గా తరచూ తీసుకోవడం మంచిది. తద్వారా ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండి.. ఆకలేయకుండా, ఇతర పదార్థాల పైకి మనసు మళ్లకుండా జాగ్రత్తపడచ్చు.
⚛ తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలో పాలు-పాల పదార్థాలు, మాంసం, గుడ్లు.. వంటివి ముఖ్యమైనవి.
⚛ ఫైబర్ అధికంగా ఉండే కాయగూరలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటూ.. ప్రాసెస్డ్, నూనె సంబంధిత పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టాలి.
⚛ శరీర బరువును అదుపులో ఉంచుకోవాలంటే వ్యాయామం కీలకం. కాబట్టి వయసు పెరుగుతున్నా వర్కవుట్ చేయడం మానకూడదు. ఈ క్రమంలో స్క్వాట్స్, లాంజెస్, పుషప్స్, కెటిల్‌బెల్‌తో ఎక్సర్‌సైజ్.. వంటివి రోజూ సాధన చేయాలి. ఒకవేళ ఒంటరిగా చేయడం ఇబ్బంది అనుకుంటే.. జిమ్‌లో చేరచ్చు.
⚛ సుఖ నిద్ర వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గడంతో పాటు హార్మోన్ల సమతుల్యత పెరుగుతుంది. తద్వారా బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు. కాబట్టి రోజూ రాత్రుళ్లు 7-8 గంటల పాటు నిద్ర పోవడం మంచిది.
⚛ విటమిన్ల లోపాలు కూడా శారీరక సత్తువను కోల్పోయేలా చేస్తాయి. కాబట్టి పోషకాహారం తీసుకోవడంతో పాటు అత్యవసరమైతే నిపుణుల సలహా మేరకు ఆయా విటమిన్ సప్లిమెంట్స్ వాడడం వల్ల ఫలితం ఉంటుంది.
ఈ చిట్కాలన్నీ పాటించడంతో పాటు నిర్ణీత వ్యవధుల్లో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం కూడా ముఖ్యమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.