ఫైబ్రాయిడ్స్.. అవగాహన పెంచుకోవాలి!

‘ఫైబ్రాయిడ్‌ అవగాహన మాసం’ సందర్భంగా.. అసలు ఫైబ్రాయిడ్లు ఎందుకొస్తాయి? వాటి దుష్ప్రభావాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర విషయాలు తెలుసుకుందాం రండి..

Published : 29 Jul 2023 12:41 IST

నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి.. ఈ లక్షణాలు కనిపిస్తే ఇది సహజమే కదా అనుకుంటారు చాలామంది. కానీ ఒక్కోసారి  గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు ఏర్పడ్డాయనడానికి ఇదో సంకేతమంటున్నారు నిపుణులు. గర్భం ధరించే వయసొచ్చాక తలెత్తే ఈ సమస్యతో మన దేశంలో సుమారు 25-50 శాతం మంది మహిళలు బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవి సంతానలేమితో పాటు ఇతర అనారోగ్యాలకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుందట! ‘ఫైబ్రాయిడ్‌ అవగాహన మాసం’ సందర్భంగా.. అసలు ఫైబ్రాయిడ్లు ఎందుకొస్తాయి? వాటి దుష్ప్రభావాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర విషయాలు తెలుసుకుందాం రండి..

సంతానలేమితో బాధపడే మహిళల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే ఇందుకు గర్భాశయంలో ఏర్పడే ఫైబ్రాయిడ్లు కూడా ఓ కారణమే అంటున్నారు నిపుణులు. గర్భం ధరించే వయసొచ్చాక చిన్న గడ్డల్లాగా ఏర్పడే వీటి పరిమాణం క్రమంగా పెరుగుతుందని, అయితే వీటిలో అత్యంత అరుదుగా మాత్రమే గర్భాశయ క్యాన్సర్‌గా రూపాంతరం చెందే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

కారణాలివేనా?!

ఫైబ్రాయిడ్లు ఎందుకు ఏర్పడతాయి అన్న విషయంలో కచ్చితమైన ఆధారాలు లేకపోయినా.. శరీరంలో జరిగే కొన్ని మార్పులు ఇందుకు దోహదం చేసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అవేంటంటే..!

అండాశయాలు ఉత్పత్తి చేసే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌.. వంటి ప్రత్యుత్పత్తి హార్మోన్ల స్థాయుల్లో అసమతుల్యత తలెత్తినప్పుడు ఫైబ్రాయిడ్లు ఏర్పడతాయి.

వంశపారంపర్యంగా కూడా ఫైబ్రాయిడ్లు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

గర్భం ధరించిన సమయంలో ప్రత్యుత్పత్తి హార్మోన్లు అధికంగా విడుదలవుతాయి. ఈ పరిస్థితి కూడా ఫైబ్రాయిడ్ల సమస్యకు దారి తీస్తుందట!

పోషకాహార లోపం, చిన్న వయసులోనే రజస్వల అవడం, మానసిక ఒత్తిళ్లు.. వంటివి కూడా ఈ సమస్య తలెత్తడానికి కారణాలే అంటున్నారు నిపుణులు.

పరిమాణాన్ని బట్టే..!

అయితే ఈ ఫైబ్రాయిడ్లు ఒక్కొక్కరిలో ఒక్కో పరిమాణంలో ఉంటాయంటున్నారు నిపుణులు. అలాగే వాటి సంఖ్య, అవి ఉండే ప్రాంతాన్ని బట్టి వివిధ రకాల దుష్ప్రభావాలు తలెత్తుతాయంటున్నారు. ఈ క్రమంలో ఇవి చిన్న పరిమాణంలో ఉంటే వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోగా.. కాస్త పెద్దగా ఉండి, ఎక్కువ సంఖ్యలో ఉంటే తీవ్రత పెరుగుతుందని చెబుతున్నారు.

నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, గడ్డల్లాగా బ్లీడింగ్‌ అవడం.. అలాగే కొంతమందిలో నెలసరి ఎక్కువ రోజులు కొనసాగడం.. ఇది రక్తహీనతకు దారితీయచ్చు.

పొత్తికడుపులో విపరీతమైన నొప్పి రావడం..

పదే పదే మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం..

కలయిక సమయంలో నొప్పి..

పొత్తి కడుపు ఉబ్బినట్లుగా, పట్టేసినట్లుగా అనిపించడం..

సంతానలేమి..

మలబద్ధకం..

అల్ట్రాసౌండ్‌, పెల్విక్‌ ఎంఆర్‌ఐ.. వంటి పరీక్షల ఆధారంగా ఫైబ్రాయిడ్ల సైజు, అవి గర్భాశయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించడం ద్వారా తగిన చికిత్స అందించచ్చంటున్నారు నిపుణులు. అలాగే మెనోపాజ్ దశకు చేరువయ్యే సమయంలో ప్రత్యుత్పత్తి హార్మోన్ల విడుదల క్రమంగా తగ్గడం వల్ల ఫైబ్రాయిడ్ల పరిమాణం కూడా క్రమంగా తగ్గుతుందట!

చెమటోడ్చాల్సిందే!

సమస్య వచ్చాక తగ్గించుకోవడం కంటే రాకుండా ముందే జాగ్రత్తపడడం మంచిది కదా! అలాగే ఫైబ్రాయిడ్లు రాకుండా ముందు నుంచీ కొన్ని జాగ్రత్తలు పాటించడం ముఖ్యమంటున్నారు నిపుణులు.

బరువు పెరిగే కొద్దీ ఫైబ్రాయిడ్ల సమస్య తలెత్తే ప్రమాదం 11 రెట్లు అధికమవుతుందట! కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడానికి యోగా, వ్యాయామం.. వంటివి క్రమం తప్పకుండా సాధన చేయాలి.

బ్రకలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌తో పాటు ‘సి’, ‘డి’, ‘కె’.. వంటి విటమిన్లు ఎక్కువగా ఉండే పదార్థాల్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఫైబ్రాయిడ్ల ముప్పును చాలావరకు తప్పించుకోవచ్చని కొన్ని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి ఆహారపుటలవాట్లలో ఈ మార్పులు చేర్పులు చేసుకోవడం మంచిది.

గర్భిణిగా ఉన్న సమయంలో హార్మోన్ల ప్రభావం కారణంగా ఫైబ్రాయిడ్ల సమస్య ఎక్కువగా కనిపించినప్పటికీ- చాలా కేసుల్లో వీటి వల్ల గర్భిణికి, కడుపులో పెరుగుతున్న పిండానికి ఎలాంటి హానీ ఉండదట! అయినా నిపుణుల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు చెకప్స్‌ చేయించుకోవడం, వారిచ్చిన సలహాలు-సూచనలు పాటించడం తప్పనిసరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని