కూతురికి బ్రెస్ట్ క్యాన్సర్.. లాటరీలో 13 కోట్లు..!
కష్టాల వెనకే సుఖాలు కూడా ఉంటాయి. ఎప్పుడైతే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారో అప్పుడే వాటి వెనకున్న మంచి ఫలితాలను పొందుతారని పెద్దలు చెబుతుంటారు. అమెరికాకు చెందిన గెరాల్డిన్ గింబ్లెట్ విషయంలో కూడా ఇదే జరిగింది. సింగిల్ మదర్‌గా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న గెరాల్డిన్‌కు....
కష్టాల వెనకే సుఖాలు కూడా ఉంటాయి. ఎప్పుడైతే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారో అప్పుడే వాటి వెనకున్న మంచి ఫలితాలను పొందుతారని పెద్దలు చెబుతుంటారు. అమెరికాకు చెందిన గెరాల్డిన్ గింబ్లెట్ విషయంలో కూడా ఇదే జరిగింది. సింగిల్ మదర్‌గా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న గెరాల్డిన్‌కు ఊహించని ఉపద్రవం ఎదురైంది. ఉన్నట్లుండి తన కూతురికి బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ కావడంతో తల్లడిల్లిపోయింది. అయినా వెనకడుగు వేయకుండా తను దాచుకున్న డబ్బునంతా చికిత్స కోసం ఖర్చు పెట్టేసింది. ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా 13.5 కోట్ల లాటరీ గెలుచుకుని వార్తల్లో నిలిచింది.
కష్టాలు తీర్చడానికి..!
గెరాల్డిన్ గింబ్లెట్‌ది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని లేక్‌ల్యాండ్. సాఫీగా సాగుతోన్న ఆమె జీవన ప్రయాణంలో ఒక రోజు అనుకోని సంఘటన జరిగింది. తన కూతురు అస్వస్థతకు గురవడంతో హాస్పిటల్‌కు తీసుకెడితే.. వైద్యులు బ్రెస్ట్ క్యాన్సర్‌గా నిర్ధారించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. కానీ, అప్పుడే తనలోని ధైర్యాన్నంతా కూడదీసుకుని ఎలాగైనా సరే కూతురిని ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడేయాలనుకుంది. ఇందుకోసం తను కూడబెట్టిన డబ్బునంతా ఖర్చు చేసి మంచి వైద్యం అందించింది. తన కష్టానికి ప్రతిఫలంగా కొన్ని నెలలకే ఆమె క్యాన్సర్ నుంచి బయటపడింది.
అయితే కూతురి చికిత్స కోసం తను దాచుకున్న డబ్బునంతా ఖర్చు చేసేయడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో తను కొన్న లాటరీలో అనుకోకుండా 20 లక్షల డాలర్ల క్యాష్‌ప్రైజ్‌ను సొంతం చేసుకుంది గెరాల్డిన్. దాంతో ఆ తల్లీకూతుళ్ల ఆనందానికి అవధుల్లేవు.
అదృష్టం అంటే అదే మరి..!
గెరాల్డిన్ లేక్‌ల్యాండ్‌లోని ఓ గ్యాస్ స్టేషన్‌లో ఓ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. దీని ధర 10 డాలర్లు (మన కరెన్సీలో 821 రూపాయలు). అయితే మొదట ఆ గ్యాస్ స్టేషన్ ఉద్యోగి టికెట్లన్నీ అమ్ముడైపోయాయని చెప్పాడట. దీని గురించి పంచుకుంటూ- ‘మొదట గ్యాస్ స్టేషన్ క్లర్క్ టికెట్లన్నీ అయిపోయాయని అనుకున్నాడు. దాంతో లేవని చెప్పాడు. కానీ, నాకు క్రాస్‌వర్డ్ గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఆ మక్కువతో మరోసారి వెతకమని అడిగా. అప్పుడు అతడు స్టోర్ మొత్తం వెతికి చివరి టికెట్‌ను నాకిచ్చాడు’ అని చెప్పుకొచ్చింది గెరాల్డిన్. ఈ లాటరీలో భాగంగా పన్నులు పోను ఆమె 1.64 లక్షల డాలర్లను క్యాష్ రూపంలో అందుకుంది. అంటే మన కరెన్సీలో సుమారు 13.5 కోట్లు అన్నమాట.
భావోద్వేగానికి లోనైన కూతురు..
గెరాల్డిన్ తాను గెలుచుకున్న మొత్తాన్ని తన కూతురు, మనవరాలితో కలిసి తీసుకుంది. ఈ సందర్భంగా గెరాల్డిన్ కూతురు భావోద్వేగానికి లోనైంది. ‘మా అమ్మ ఈ టికెట్ కొనడానికి ముందు రోజే నాకు క్యాన్సర్ చికిత్స పూర్తైంది. నా చికిత్స కోసం అమ్మ తను దాచుకున్న డబ్బునంతా ఖర్చు పెట్టేసింది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో అనుకోకుండా ఇలా లాటరీ గెలవడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
‘ఫ్లోరిడా లాటరీ’ సంస్థ 1988 నుంచి ఈ లాటరీ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు 3500 మందిని కోటీశ్వరులను చేసింది. ఈ లాటరీలో భాగంగా గెరాల్డిన్‌తో పాటు లాటరీ అమ్మిన గ్యాస్ స్టేషన్ వారికి కూడా 2 వేల డాలర్ల బహుమతి దక్కడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.