Published : 25/12/2021 18:22 IST

చలికాలంలో జుట్టు సమస్యలా? ఈ నూనె వాడి చూడండి!

చుండ్రు, కుదుళ్లు పొడిబారిపోవడం, జుట్టు ఎక్కువగా రాలిపోవడం.. చలికాలంలో తలెత్తే జుట్టు సమస్యలకు ఓ అడ్డూ అదుపూ ఉండదు. అయితే వీటన్నింటికీ ఓ సహజసిద్ధమైన నూనెతో చెక్‌ పెట్టచ్చంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. అంతేకాదు.. దీన్నెలా తయారుచేయాలో వీడియో రూపంలో వివరిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారామె.

కావాల్సినవి

* మందార పూలు - 20
* వేపాకులు - 30
* కరివేపాకులు - 30
* చిన్న ఉల్లిపాయలు - 5
* మెంతులు - టీస్పూన్‌
* కలబంద ఆకు - 1
* మల్లెపూలు - 15-20
* కొబ్బరి నూనె - ఒక లీటర్‌

తయారీ

* ముందుగా మెంతుల్ని అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి.

* అవి నానే లోపు కలబంద ఆకును చిన్న ముక్కలుగా కట్‌ చేసి.. కొబ్బరి నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.

* ఇప్పుడు స్టౌ మీద గిన్నె పెట్టి అందులో కొబ్బరి నూనె వేడి చేసుకోవాలి. ఆపై మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని నూనెలో వేసి ముప్పావుగంట పాటు తక్కువ మంట మీద మరిగించుకోవాలి. ఈ క్రమంలో నూనె ఆకుపచ్చ రంగులోకి మారడం గమనించచ్చు.

* ఇప్పుడు స్టౌ కట్టేసి దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి.. గ్లాస్‌ జార్‌లో వడకట్టుకోవాలి.

* ఇక మిగిలిన పిప్పిని ఒంటికి స్క్రబ్‌గా ఉపయోగించుకోవచ్చు.

ఈ నూనెతో పొడిబారిన కుదుళ్లకు తేమ అందడంతో పాటు జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. చుండ్రు సమస్య కూడా పరిష్కారమవుతుంది. అలాగే వెంట్రుకలు తెల్లబడకుండా జాగ్రత్తపడచ్చు.

ఇవీ ప్రయత్నించచ్చు!

* కుదుళ్లకు తేమనందించి జుట్టు దృఢంగా పెరిగేలా చేయడంలో కొబ్బరి నూనెను మించింది లేదంటున్నారు సౌందర్య నిపుణులు. దీనిలో ఉండే అత్యధిక తేమ గుణాలే ఇందుకు కారణం అంటున్నారు.

* కుదుళ్లు తేమగా ఉండాలంటే సీబమ్‌ (సెబేషియస్ గ్రంథులు ఉత్పత్తి చేసే మైనం లాంటి పదార్థం) తగినంత మొత్తంలో ఉత్పత్తి కావాలి. ఇందుకు జొజోబా నూనె ఉపయోగించడం ఉత్తమం. ఇది చలిగాలుల వల్ల కోల్పోయిన తేమను తిరిగి అందించడంలో సహకరిస్తుంది. అందుకే ఈ నూనెను పలు కుదుళ్ల ట్రీట్‌మెంట్లలోనూ ఉపయోగిస్తుంటారట!

* చలికాలంలో జుట్టు రాలకుండా చేసే గుణాలు బాదం నూనెలో పుష్కలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు. దీనిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్‌ ‘ఇ’, ఫాస్ఫోలిపిడ్స్‌, మెగ్నీషియం.. వంటివి జుట్టుకు పోషణను, మెరుపును అందిస్తాయి.
* చలికాలంలో జుట్టు గడ్డిలా మారడం, చివర్లు చిట్లడం సహజం. ఇలాంటి సమస్యలకు ఆలివ్‌ నూనె చక్కటి పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. అయితే దీన్ని నేరుగా ఉపయోగించడం లేదంటే హెయిర్‌ ప్యాక్స్‌లో భాగం చేసుకొనైనా జుట్టుకు, కుదుళ్లకు అప్లై చేసుకోవడం.. వంటివి చేయచ్చు.
* నువ్వుల నూనెకు జుట్టును నల్లబరిచే గుణాలు ఎక్కువ. ఇందుకు దీనిలో ఉండే ఒమేగా-3, 6, 9 ఫ్యాటీ ఆమ్లాలే కారణం.

వీటితో పాటు లావెండర్‌, రోజ్‌మేరీ.. వంటి అత్యవసర నూనెల్ని కూడా ఈ చలికాలంలో జుట్టు పోషణ కోసం ఉపయోగించచ్చు. అయితే వీటి గాఢత చాలా ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి నేరుగా కాకుండా కొబ్బరి, జొజోబా, బాదం.. వంటి క్యారియర్‌ ఆయిల్స్‌లో రెండు మూడు చుక్కల చొప్పున కలుపుకొని మాత్రమే ఉపయోగించాలి. తద్వారా చక్కటి ఫలితాలు సొంతం చేసుకోవచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని