Published : 17/01/2023 19:47 IST

మృదువైన చర్మం.. ఇలా సొంతం!

చలిగాలుల వల్ల చర్మం పొడిబారినట్లుగా కనిపించడం సహజం. ప్రత్యేకించి చర్మంలోని తేమ స్థాయి తగ్గినా ఇలా కనిపించే అవకాశం ఉంటుంది. అయితే అందుబాటులో ఉండే కొన్ని సహజసిద్ధ పదార్థాలను ఉపయోగించి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందచ్చంటున్నారు నిపుణులు.

సీ సాల్ట్ + ఆలివ్ ఆయిల్..

రెండు చెంచాల ఆలివ్‌నూనెలో చెంచా సీసాల్ట్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో పొడిబారిన చర్మం ఉన్నచోట మృదువుగా రుద్దుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల చర్మంపై పేరుకొన్న మృతకణాలు తొలగిపోవడమే కాకుండా చర్మం మృదుత్వాన్ని కూడా సంతరించుకుంటుంది. ఈ చిట్కాని వారానికి ఒకటి లేదా రెండుసార్లు చొప్పున క్రమం తప్పకుండా అనుసరిస్తే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

స్ట్రాబెర్రీ + తేనె..

తేనె చర్మానికి చక్కటి మృదుత్వాన్ని అందిస్తుంది. మరి, దీన్ని చేతులకు ఉపయోగించడం కోసం బాగా పండిన స్ట్రాబెర్రీ ఒకటి తీసుకొని దానిని మెత్తగా చేసుకోవాలి. అందులో రెండు చెంచాల తేనె వేసి బాగా కలిపి ఈ పేస్ట్‌ని పొడిబారిన చర్మం ఉన్నచోట అప్త్లె చేసుకోవాలి. ఐదు నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకొని తర్వాత శుభ్రం చేసుకోవాలి. తద్వారా మృదువైన, కోమలమైన చర్మం మన సొంతం చేసుకోవచ్చు.

కీరాదోస + జొజోబా ఆయిల్..

ముందుగా కీరాదోస తొక్క చెక్కి దానిని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న కీరాదోస గుజ్జు రెండు చెంచాలు తీసుకొని అందులో అరచెంచా (6- 7 చుక్కలు) జొజోబా ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో పొడిబారిన చర్మంపై మృదువుగా ఐదు నిమిషాల పాటు రుద్దుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

వీటినీ ఉపయోగించవచ్చు..

పొడిబారిన చర్మాన్ని తిరిగి మృదువుగా మార్చడానికి, చేతులను మృదువుగా ఉంచడానికి కేవలం పైన చెప్పుకున్న పదార్థాలే కాదు.. మిల్క్ క్రీమ్, ఆర్గాన్ ఆయిల్, వరిపిండి, పెరుగు, మయోనైజ్, కాఫీ పొడి, బాదం నూనె, క్యారట్, పుదీనా రసం.. మొదలైనవి కూడా ఉపయోగించవచ్చు. ఈ చిట్కాలన్నీ కేవలం చేతులకే కాదు.. ముఖం, మెడపై కూడా ప్యాక్స్‌లా అప్త్లె చేసుకున్నా ఆశించిన ఫలితం పొందచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

<