Covid Job Loss : బైక్‌ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది!

ఓ ప్రముఖ సంస్థలో తన చదువుకు తగ్గ ఉద్యోగం సంపాదించుకుందా అమ్మాయి. తనకొచ్చే జీతంతో కుటుంబం బాధ్యతల్ని, తన ఖర్చుల్ని బ్యాలన్స్‌ చేసుకుంటుంది. ఇలా హాయిగా, ఓ క్రమపద్ధతిలో సాగుతోన్న తన జీవితాన్ని కొవిడ్‌ మహమ్మారి దెబ్బకొట్టింది. ఉన్న ఉద్యోగం కోల్పోయింది. నిజానికి ఇలాంటి.....

Published : 19 May 2022 14:40 IST

(Photo: LinkedIn)

ఓ ప్రముఖ సంస్థలో తన చదువుకు తగ్గ ఉద్యోగం సంపాదించుకుందా అమ్మాయి. తనకొచ్చే జీతంతో కుటుంబం బాధ్యతల్ని, తన ఖర్చుల్ని బ్యాలన్స్‌ చేసుకుంటుంది. ఇలా హాయిగా, ఓ క్రమపద్ధతిలో సాగుతోన్న తన జీవితాన్ని కొవిడ్‌ మహమ్మారి దెబ్బకొట్టింది. ఉన్న ఉద్యోగం కోల్పోయింది. నిజానికి ఇలాంటి ప్రతికూల పరిస్థితిలో ఏం చేయాలో మనకు తోచదు. అందులోనూ మన నైపుణ్యాలకు తగ్గట్లుగా కాకుండా ఇతర ఉద్యోగంలో చేరడానికి మనసు ఒప్పదు. కానీ కోల్‌కతాకు చెందిన మౌతుషి బసు మాత్రం ఇవేవీ ఆలోచించలేదు. అవకాశం రావడమే అదృష్టమని భావించి.. బైక్‌ రైడర్‌గా జాబ్‌లో చేరింది. ఇప్పుడు కోల్‌కతా వీధుల్లో రయ్‌మంటూ దూసుకుపోతోన్న ఈ యంగ్‌ రైడర్‌ కథను ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది.

కరోనా అల్లకల్లోలం కారణంగా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు.. ఆర్థికంగా అష్టకష్టాలు అనుభవించారు. కోల్‌కతాకు చెందిన 30 ఏళ్ల మౌతుషి బసు కూడా వీరిలో ఒకరు. ఇక్కడి బరుపూర్‌ ప్రాంతంలో నివసించే ఆమె.. లాక్‌డౌన్‌కు ముందు వరకు పానాసోనిక్‌ కంపెనీలో విధులు నిర్వర్తించింది. వచ్చిన జీతంతో అటు ఇంటి బాధ్యతలు, ఇటు తన ఖర్చులు బ్యాలన్స్ చేసుకునేది.

అందివచ్చిన అదృష్టం!

ఇలా హాయిగా, ప్రశాంతంగా సాగిపోతోన్న తన కెరీర్‌పై కరోనా దెబ్బకొట్టింది. లాక్‌డౌన్‌లో ఎంతోమంది భారతీయులు తమ ఉద్యోగాల్ని కోల్పోయినట్లే.. మౌతుషి కూడా తన జాబ్‌ కోల్పోయింది. దాంతో అప్పటిదాకా కుటుంబ భారాన్ని మోసిన ఆమెకు ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఏం చేయాలో తోచని పరిస్థితిలో తన నైపుణ్యాలు, చదువుకు తగ్గ ఉద్యోగం కోసం వెతికినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే ఉబర్‌ ఇండియా కంపెనీ నుంచి బైక్‌ రైడర్‌గా అవకాశం అందుకుంది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో అదే అదృష్టంగా భావించిన మౌతుషి.. బైక్‌ రైడర్‌గా జాబ్‌లో చేరింది. నిజానికి బైక్ నడపడంలో ఆమెకు అంతగా అనుభవం లేదు. అయినా పట్టుబట్టి మరీ బైక్‌ రైడింగ్‌లో మెలకువలు నేర్చుకుందామె. ఇక ఇప్పుడు ఎంతోమంది వినియోగదారుల్ని తన బైక్‌పై గమ్యస్థానాలకు చేర్చుతూ.. అటు తన కెరీర్‌ని కొనసాగించడమే కాదు.. ఇటు తన కుటుంబాన్నీ పోషిస్తోందీ ఉమన్‌ బైక్‌ రైడర్‌.

అలా వైరలైంది!

ఇలా ఇటీవలే రణబీర్‌ భట్టాచార్య అనే రచయిత మౌతుషి బైక్‌పై ప్రయాణించారు. ఈ క్రమంలోనే తను బుక్‌ చేసుకున్న ఉబర్‌ బైక్‌కి రైడర్‌ ఓ మహిళ అని గమనించిన ఆయన తొలుత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆమె కథ తెలుసుకొని చలించిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆమెతో దిగిన సెల్ఫీని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ‘ఓవైపు వర్షం పడుతున్నా రోడ్లపై బైక్‌ను అలవోకగా నడిపారు మౌతుషి. దీంతో బైక్‌ రైడింగ్‌ విషయంలో తనకున్న అనుభవమేంటని ప్రశ్నించగా.. తన కథను నాతో పంచుకున్నారు. కుటుంబాన్ని పోషించడానికి ఇది తప్ప మరే అవకాశం కనిపించలేదని చెప్పుకొచ్చారు. నిజంగా ఆమె కథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం!’ అంటూ ఈ లేడీ బైక్‌ రైడర్‌ కథను క్యాప్షన్‌గా రాసుకొచ్చారాయన. దీంతో ఆమె కథ నెట్టింట్లో వైరల్‌గా మారింది. చాలామంది స్పందిస్తూ.. ప్రతికూల పరిస్థితుల్లో మౌతుషి ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి స్ఫూర్తిదాయక కథను పంచుకున్నందుకు రణబీర్‌నూ అభినందిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్