గృహిణిగా ఉండమంటే.. భర్త కంపెనీలో వాటా అడిగింది!

ఈ రోజుల్లో ఇంటి పనులైనా, కెరీర్‌ బాధ్యతలైనా, పిల్లల పోషణ అయినా.. ప్రతి పనినీ కలిసే పంచుకుంటున్నారు భార్యాభర్తలు. అయితే కొంతమంది మహిళలు తమ కుటుంబ ఆర్థిక అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని తప్పక ఉద్యోగాలు చేస్తే.. మరికొందరు సంపాదించాల్సిన అవసరం లేకపోయినా.. ఆర్థిక స్వాతంత్ర్యం కోసం జాబ్‌ చేస్తుంటారు.

Published : 28 Jun 2024 21:48 IST

ఈ రోజుల్లో ఇంటి పనులైనా, కెరీర్‌ బాధ్యతలైనా, పిల్లల పోషణ అయినా.. ప్రతి పనినీ కలిసే పంచుకుంటున్నారు భార్యాభర్తలు. అయితే కొంతమంది మహిళలు తమ కుటుంబ ఆర్థిక అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని తప్పక ఉద్యోగాలు చేస్తే.. మరికొందరు సంపాదించాల్సిన అవసరం లేకపోయినా.. ఆర్థిక స్వాతంత్ర్యం కోసం జాబ్‌ చేస్తుంటారు. ఇంకొందరు తమ పిల్లల బాధ్యతల రీత్యా మంచి ఉద్యోగమైనా సరే.. వదిలేసి ఇంటికే పరిమితమవుతుంటారు. ఓ భర్త కూడా ఇలాగే ఇల్లు-పిల్లల బాధ్యతల్ని దృష్టిలో ఉంచుకొని తన భార్యను ఉద్యోగం మానేయమని కోరాడు. ‘నీకు ఈ శ్రమంతా ఎందుకు? హాయిగా ఇంటి పట్టునే ఉంటూ పిల్లల్ని చూసుకోవచ్చుగా!’ అనడిగాడు. దానికి ఆమె చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతోమంది మహిళల్ని ఆలోచింపజేస్తోంది. ఇంతకీ ఆమె ఏం సమాధానమిచ్చిందో.. మీరే చదివేయండి!

ఉద్యోగమంటే ఆర్థిక భరోసా! ప్రతిదానికీ భాగస్వామి వద్ద చేయి చాచాల్సిన అవసరం రాకుండా ఉండేందుకే చాలామంది మహిళలు.. వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ కష్టమైనా సరే ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే పిల్లల ఆలనా పాలనా చూసుకోవడానికి మరో ప్రత్యామ్నాయం లేని పక్షంలో కొంతమంది ఉద్యోగం మానేయాల్సి వస్తుంటుంది. అలాంటి పరిస్థితే ఇటీవల ఓ మహిళకు కూడా ఎదురైంది. ఈ క్రమంలోనే ఆమె భర్త తనను ఉద్యోగం మానేసి ఇంటికే పరిమితమవమని, గృహిణిగా బాధ్యతలు నిర్వర్తించమని కోరాడు. దానికి ఆమె తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన సమాధానం ఇలాంటి ఎంతోమంది మహిళల్ని ఆలోచింపజేస్తోంది. ఇలా తామిద్దరి మధ్య జరిగిన సంభాషణను భార్య సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా అది వైరల్‌గా మారింది.

ఉద్యోగం మానేయమన్నాడు!

‘ప్రస్తుతం నాకు, నా భర్తకు 35 ఏళ్లు. మా ఇద్దరికీ పెళ్లై ఆరేళ్లవుతోంది. మాకు ఇద్దరు పిల్లలు.. త్వరలోనే మరో బేబీ పుట్టబోతోంది. మేమిద్దరం మా వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థాయుల్లో ఉన్నాం. అయితే స్వయంగా ఓ సంస్థకు యజమాని అయిన నా భర్త ఓ రోజు నన్ను ఉద్యోగం మానేసి గృహిణిగా ఉండమని కోరాడు. ఇంటి బాధ్యతల్ని, పిల్లల ఆలనా పాలనా చూసుకోమన్నాడు. ఇలా తన మాటలు విన్నాక చాలా డిస్టర్బ్‌ అయ్యా. అది చూసిన తను ‘మనం ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్నాం. అలాంటప్పుడు నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? ఇంటిని, పిల్లల్ని చూసుకుంటూ హాయిగా ఇంట్లోనే ఉండచ్చు కదా!’ అంటూ తనను ఎందుకు ఉద్యోగం మానేయమన్నాడో వివరించాడు. ఇదే విషయంపై కొన్ని వారాల పాటు బాగా ఆలోచించా.. ఆపై తుది నిర్ణయానికొచ్చా. ‘నేను ఉద్యోగం మానేయాలంటే నీ సంస్థలో సగం వాటా నాకు ఇవ్వాలి.. ఈ డీల్‌ ఓకే అయితే ఇప్పుడంటే ఇప్పుడు ఉద్యోగం మానేయడానికి నేను సిద్ధం..’ అన్నా. దాంతో మా ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అప్పుడే నా మాటల్లోని అంతరార్థమేంటో తనకు వివరించా.

అందుకే కంపెనీలో వాటా అడిగా!

‘నేను ఇంటికే పరిమితమైతే.. ఇలాంటి మంచి ఉద్యోగం తిరిగి నేను సంపాదించుకోలేను. ఒకవేళ భవిష్యత్తులో మన మధ్య అభిప్రాయ భేదాలొచ్చి ఇద్దరం విడిపోవాల్సి వస్తే నాకు ఎలాంటి ఆర్థిక భరోసా ఉండదు. కానీ ఏటికేడు నీ సంపద మాత్రం పెరుగుతూ పోతుంది. అందుకే నీ కంపెనీలో నాకు వాటా కావాలి. మనిద్దరం విడాకులు తీసుకోకపోతే ఎలాంటి సమస్యా ఉండదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ఈ డబ్బు పిల్లల పెంపకానికి ఉపయోగపడుతుంది. నాకు ఆర్థిక భరోసాను అందిస్తుంది..’ అని తనకు విడమరిచి చెప్పా. ఆపై ఇదే విషయాన్ని నా బెస్ట్‌ ఫ్రెండ్‌తో పంచుకుంటే తను కోప్పడింది. ఆ ఒక్క క్షణం నా ఆలోచన సరైందేనా? కాదా? అన్న సందేహం కలిగింది..’ అంటూ తనకెదురైన పరిస్థితిని సోషల్‌ మీడియాలో పంచుకుందీ భార్యామణి.

ఆ హక్కు మీకుంది!

ఈ పోస్ట్‌ వైరల్‌గా మారడంతో చాలామంది సానుకూలంగా స్పందించారు.

‘మీరు ఎంచుకున్న మార్గం సరైందే! ఎందుకంటే ఆర్థిక భరోసా అనేది ప్రతి ఒక్కరికీ ముఖ్యం. భవిష్యత్తులో మీరిద్దరూ విడిపోవాల్సి వచ్చినా భరణం కోసం మీరు మీ ఆయన వద్ద చేయి చాచాల్సిన అవసరం రాదు..’ అంటూ ఒకరు కామెంట్‌ చేశారు.

‘మీరు మీ భర్తను అడిగిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. భవిష్యత్తు గురించి ముందు చూపుతో ఆలోచించి మీ, మీ పిల్లల సురక్షితమైన భవిష్యత్తు కోసం మీరు తీసుకున్న ఈ నిర్ణయం సరైంది. ఆర్థిక స్వాతంత్ర్యం మీ హక్కు!’ అంటూ మరొకరు స్పందించారు.

సగ భాగం రాసిచ్చాడు!

అయితే ఉద్యోగం మానేసే విషయంలో ఈ మహిళ తన భర్త ముందుంచిన షరతుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఆ తర్వాత పేర్కొంది. ‘నా భర్త నా డిమాండ్‌కు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలోనే తన కంపెనీలో 49 శాతం వాటా నాకు రాసిచ్చాడు..’ అంటూ తనకు మద్దతిచ్చిన నెటిజన్లకు ధన్యవాదాలు తెలిపిందీ మహిళ. ఇలా ఆర్థిక భరోసా కోసం ముందుచూపుతో ఆలోచించిన ఈ మహిళను నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ప్రతి మహిళా ఇలా ముందు చూపుతో ఆలోచించి.. ఆర్థిక స్వేచ్ఛను పొందగలిగితే భర్త వేధింపులు, అతడి నిరాదరణకు లోనవ్వాల్సిన అవసరం రాదంటున్నారు. మరి, మీరేమంటారు?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్