అమ్మ వల్ల అత్తగారితో గొడవలొస్తున్నాయి..!

నేను అమాయకురాలినని.. మా అత్తగారు వాళ్లు నాతో ఇంట్లో చాకిరీ అంతా చేయించుకుంటున్నారని అమ్మ అనుకుంటోంది. నేను బాగున్నానని చెప్పినా నమ్మడం లేదు. ఆమెను ఎలా మార్చాలో తెలియడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు.

Published : 07 Aug 2023 18:54 IST

నాకు పెళ్లై నాలుగేళ్లవుతోంది. మేము మా అత్తమామలతో కలిసి ఉంటున్నాం. మా అత్తగారింట్లో నాకు ఎలాంటి సమస్యలు లేవు. కానీ, మా అమ్మ వల్ల అత్తగారికి నాకు గొడవలు వస్తోన్నాయి. అమ్మకు మేము విడిగా కాపురం పెడితే బాగుంటుందని ఉంది. దాంతో మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక విషయంలో అత్తగారితో గొడవ పెట్టుకుంటుంది. అమ్మకు ఎలా చెప్పినా ఆమె మారడం లేదు. నేను అమాయకురాలినని.. మా అత్తగారు వాళ్లు నాతో ఇంట్లో చాకిరీ అంతా చేయించుకుంటున్నారని అనుకుంటోంది. నేను బాగున్నానని చెప్పినా నమ్మడం లేదు. ఆమెను ఎలా మార్చాలో తెలియడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. సాధారణంగా చాలా కుటుంబాల్లో అత్త, కోడలికి మధ్య విభేదాలు రావడం చూస్తుంటాం. కానీ, మీ విషయంలో మీ అమ్మగారి వల్ల సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. మీ అమ్మగారితో ఉన్న సమస్య గురించి ఇంత నిజాయతీగా పంచుకోవడం అభినందనీయం. అయితే ఒక కోడలిగా మీకు అత్తగారితో సఖ్యత ఎంత అవసరమో తల్లితో కూడా అంతే సఖ్యతగా ఉండాలి. ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమ ఎంతో విలువైనది. కాబట్టి, మీ అమ్మగారితో గొడవ పడకుండా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.

కొంతమందిలో కొన్ని అంశాల పట్ల వ్యతిరేక భావనలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల వారు ఆయా అంశాలను అదే కోణంలో చూస్తూ తప్పుగా అర్థం చేసుకుంటారు. మీ అమ్మగారు కూడా ఇలాంటి ధోరణితోనే ఉన్నారనిపిస్తోంది. మీరు మీ అత్తగారింట్లో ఉంటున్నామని చెబుతున్నారు. అంటే మీ అమ్మ గారు మీ దగ్గరకు వచ్చే సందర్భాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఆమె ఉన్నంత వరకు ఇంట్లో పనులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఆమె వచ్చినప్పుడు ఏయే అంశాల్లో మీరు ఇబ్బందిపడుతున్నారని అనుకుంటున్నారో వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇలా చేయడం వల్ల ఆమెలో మార్పు వస్తుందేమో పరిశీలించండి. ఒకవేళ ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోతే మీ తోబుట్టువులతో చెప్పించే ప్రయత్నం చేయండి. అప్పటికీ అలాగే ఉంటే ఒకసారి మీ అమ్మగారిని మానసిక నిపుణుల దగ్గరకు తీసుకెళ్లండి. వారు ఆమె ఆలోచనా ధోరణిని మార్చుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని