అమ్మమ్మకు చీర కట్టి.. 20 ఏళ్ల కోరిక నెరవేర్చింది!

మన సంప్రదాయాల్లోకి పాశ్చాత్య సంస్కృతి చాప కింద నీరులా చేరుతోంది. ఈ క్రమంలోనే కొంతమంది విదేశీ వస్త్రధారణ పట్ల మక్కువ చూపిస్తుంటారు. అదే సమయంలో కొంతమంది విదేశీ మహిళలు మన వస్త్రధారణకు ఆకర్షితులవుతున్నారు.

Published : 09 Jul 2024 13:25 IST

(Photos: Screengrab)

మన సంప్రదాయాల్లోకి పాశ్చాత్య సంస్కృతి చాప కింద నీరులా చేరుతోంది. ఈ క్రమంలోనే కొంతమంది విదేశీ వస్త్రధారణ పట్ల మక్కువ చూపిస్తుంటారు. అదే సమయంలో కొంతమంది విదేశీ మహిళలు మన వస్త్రధారణకు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇటలీ బామ్మ చీర కట్టుకోవాలని భావించింది. అందుకోసం ఆమె ఏకంగా 20 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఇటీవలే ఆమె మనవరాలు తన కోరిక నెరవేర్చడంతో ఆనందంతో పొంగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

చీరలో మరింత అందంగా..!

ఇటలీకి చెందిన ఓ బామ్మ ఇరవై ఏళ్ల క్రితం వెకేషన్‌లో భాగంగా ముంబయికి వచ్చింది. ఈ క్రమంలో నెల రోజుల పాటు ఇక్కడి ఆతిథ్యం తీసుకుంది. అలా ఆమెకు చీరకట్టుపై ఆసక్తి కలిగింది. తిరిగి ఇటలీ వెళ్లిన తర్వాత కూడా ఆ ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. పలుమార్లు సొంతంగా చీర కట్టుకోవడానికి ప్రయత్నించింది కూడా. కానీ విఫలమైంది. అయితే ఆ విషయం ఆమె మనవరాలు ఓలీ చెవిన పడడంతో 20 ఏళ్ల నాటి అమ్మమ్మ కోరికను నెరవేర్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు ‘మీరు చీరలో మరింత అందంగా ఉన్నారం’టూ కామెంట్లు పెడుతున్నారు.

మొహమాటంతో చెప్పలేదు..!

‘భారత్‌కు, అమ్మమ్మకు మధ్య ప్రేమ కథ 20 ఏళ్ల క్రితం మొదలైంది. తను ఓసారి వెకేషన్‌లో భాగంగా ముంబయి వెళ్లింది. అక్కడ చూడడానికి ప్రతి ఒక్కరూ బాగుంటారని చెప్పింది. అమ్మమ్మకు ఫ్యాషన్‌ అంటే చాలా ఇష్టం. ‘సండోకన్‌’ వంటి టెలివిజన్‌ సిరీస్‌లు చూసిన తర్వాత భారతీయ వస్త్రధారణపై మరింత ఇష్టం పెంచుకుంది. తన పర్యటనలో భాగంగా నెల రోజుల పాటు భారత్‌లో గడిపింది. అక్కడ కొన్ని దుస్తులు కూడా కొనుగోలు చేసింది. అయితే ఇటలీ వచ్చిన తర్వాత చాలాసార్లు చీర కట్టుకోవాలని అనుకుందట. మొహమాటం వల్ల ఎవరి సహాయం కోరలేదు. నాకు ఆ విషయం తెలియడంతో వెంటనే తన కోరిక నెరవేర్చాలనుకున్నా. నేను కూడా కొంతకాలం భారత్‌లో ఉన్నాను. చీర కట్టుకోవడం నేర్చుకున్నాను. దాంతో అమ్మమ్మ కోరిక కూడా నెరవేర్చాను. మా అమ్మమ్మ చీరలో ఎంతో బాగుంది. లవ్‌ యూ అమ్మమ్మా..!’ అంటూ ఓలీ ఆ వీడియోకు క్యాప్షన్‌ రాసుకొచ్చింది. మరి, మీరూ ఆ వీడియోను చూసేయండి..!


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్