ఉద్యోగమే జీవితమైపోయింది.. తోలుబొమ్మలా అలసిపోతున్నా!

కార్పొరేట్‌ పని విధానం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే! అదనపు పని భారం, డెడ్‌లైన్లు, వేళకు పని పూర్తి చేయాలన్న ఒత్తిడి.. ఇవన్నీ చాలామందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. కొన్నిసార్లు ఇంట్లో ఉన్నా, వెకేషన్‌కు వెళ్లినా పని తప్ప వేరే ధ్యాస ఉండదు. ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కున్నప్పుడూ కొందరు ఆన్‌లైన్‌ మీటింగులకు హాజరవ్వాల్సి రావచ్చు.

Published : 29 Jun 2024 20:42 IST

కార్పొరేట్‌ పని విధానం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే! అదనపు పని భారం, డెడ్‌లైన్లు, వేళకు పని పూర్తి చేయాలన్న ఒత్తిడి.. ఇవన్నీ చాలామందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. కొన్నిసార్లు ఇంట్లో ఉన్నా, వెకేషన్‌కు వెళ్లినా పని తప్ప వేరే ధ్యాస ఉండదు. ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కున్నప్పుడూ కొందరు ఆన్‌లైన్‌ మీటింగులకు హాజరవ్వాల్సి రావచ్చు. ఇలాంటి ఊపిరి సలపని పని విధానం వల్ల మహిళలు మరిన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నారు. వారి వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ దెబ్బతింటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. కొన్నిసార్లు జీవితమంటేనే విరక్తి చెందుతుంటారు. అచ్చం తనదీ ఇదే పరిస్థితి అంటోంది ఇష్‌ అనే అమ్మాయి. ఓ ప్రముఖ టెక్‌ కంపెనీలో ఉద్యోగి అయిన ఆమె.. తన బిజీ కెరీర్‌ వల్ల ప్రస్తుతం తాను ఎదుర్కొంటోన్న సమస్యల్ని ఇటీవలే ఎక్స్‌లో పంచుకుంది. దాంతో అవి వైరలవుతున్నాయి.

కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగత జీవితానికీ సమప్రాధాన్యమిచ్చినప్పుడే హ్యాపీగా ఉండగలుగుతాం. అయితే కొంతమంది విషయంలో ఇలా జరక్కపోవచ్చు. వారు అధిక పని ఒత్తిడితో సతమతమవుతుంటారు. కెరీర్‌ బిజీలో పడిపోయి.. వ్యక్తిగత జీవితాన్ని, తమ సంతోషాల్నీ త్యాగం చేస్తుంటారు. దీంతో ఒక్కోసారి జీవితాన్నే కోల్పోయిన ఫీలింగ్‌ కలుగుతుంటుంది. ప్రస్తుతం తానూ ఇదే నెగెటివిటీలో ఉన్నానంటోంది ఇష్.

తోలుబొమ్మలా అలసిపోతున్నా!

రోజూ ఆఫీస్‌ పని ఒత్తిడితో తానెంత సతమతమవుతుందో వివరిస్తూ తాజాగా ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టిందామె.

‘రోజులో పన్నెండు గంటలు నాకు ఉద్యోగంతోనే సరిపోతుంది. ప్రయాణాలతో మరింతగా అలసిపోతున్నా. ఇంటికి రావడం, పడుకోవడం తప్ప మరే పనీ చేయలేకపోతున్నా. రోజు పూర్తయ్యేసరికి నేను చేసే పనిలో కోరుకున్న ఉత్పాదకత అయితే వస్తుంది.. కానీ వ్యక్తిగతంగా ఎలాంటి సంతోషం లేదు. ఆడి ఆడి అలసిపోయిన తోలుబొమ్మలా అయిపోతుంది నా పరిస్థితి! అభిరుచులపై దృష్టి పెట్టే సమయం కూడా ఉండట్లేదు.. దీంతో స్వీయ ప్రేమ కూడా కరువైంది. ఒక్కోసారి నా మీద నాకే అసహ్యం వేస్తోంది.

రోజూ ఉదయం 6 గంటలకు నా రోజు మొదలవుతుంది. ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకొని 7:30 కల్లా ఆఫీస్‌కి బయల్దేరతా. 9:30 కల్లా ఆఫీస్‌కి చేరుకుంటా. ఇక అప్పుడు పని మొదలుపెడితే సాయంత్రం 6 అవుతుంది. ఒక్కోసారి 6:30, 7 కూడా అవుతుంది. తిరిగి ఇంటికి చేరుకునే సరికి 9:15. ఆపై భోజనం చేసే సరికి 10, ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకొని పడుకొనే సరికి 11 అవుతుంది. నిద్ర పట్టినా పట్టకపోయినా తిరిగి ఉదయం 6 గంటలకు లేవాల్సిందే! ఇలాంటప్పుడు నాకంటూ కాస్త సమయం కేటాయించుకునే వీలెక్కడుంది!’ అంటూ ఎమోషనల్ అయిందీ టెకీ.

ఇలా ప్లాన్‌ చేసుకోండి!

ప్రస్తుతం ఇష్‌ పెట్టిన పోస్టులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలామంది స్పందిస్తూ.. ‘కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికీ సమప్రాధాన్యమిచ్చినప్పుడే హ్యాపీగా ఉండగలం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు తమ అనుభవాల్ని పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా..

‘నా దృష్టిలో ఆర్థిక స్వాతంత్ర్యం అంటే డబ్బు సంపాదించడం ఒక్కటే ముఖ్యం కాదు. మన కోసం మనం కాస్త సమయం కేటాయించుకునే స్వేచ్ఛ ఉండాలి. అప్పుడే జీవితం సంతోషంగా ముందుకు సాగుతుంది. అలా కాకుండా పనే జీవితం అనుకుంటే మాత్రం ఇలాంటి ఒత్తిళ్లు, కష్టాలు తప్పవు..’ అంటూ ఒకరు స్పందించారు.

‘మీరు మీ బిజీ షెడ్యూల్‌లో 12 గంటలు పనికి/ప్రయాణానికి కేటాయించినా నిద్ర సమయాల్ని కాస్త తగ్గించుకోవచ్చు. 6-7 గంటలు నిద్రపోయి, 12 గంటలు పని చేయగా మిగిలిన 5-6 గంటలు ఇంటి పనులు, మీ అభిరుచులు, ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యమివ్వచ్చు. ఫలితంగా వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ దెబ్బతినకుండా ఉంటుంది..’ అంటూ మరొకరు సలహా ఇస్తున్నారు.
‘ఇదొక రకమైన ఆధునిక బానిసత్వం’ అంటూ ఇంకొకరు తన స్వీయానుభవాన్ని పంచుకున్నారు.

నొప్పించి ఉంటే.. సారీ!

అయితే ఇష్‌ పెట్టిన పోస్టులకు సోషల్‌ మీడియాలో లక్షల మంది నుంచి స్పందన రావడంతో.. ‘నా పోస్టులకు ఇంత ఎక్కువ స్పందన వస్తుందనుకోలేదు. అయితే ఇందుకు కాస్త బాధగానే ఉంది. ఎందుకంటే నాలా కెరీర్‌ కోసం జీవితాన్ని త్యాగం చేసిన వాళ్లు చాలామందే ఉంటారు. నా పోస్టులతో మీ సమస్యలు, సవాళ్లను గుర్తుచేసి ఎవరినైనా ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి. ఏదేమైనా భవిష్యత్తులో మంచి రోజులొస్తాయని ఆశిస్తున్నా..’ అంటూ సానుకూలంగా స్పందించడం కొసమెరుపు!


ప్రణాళిక ఉండాలి!

అయితే ప్రస్తుతం ఎలాంటి రంగంలోనైనా ఉద్యోగులపై పని భారం పడుతుందనే చెప్పాలి. ఇలాంటి బిజీ లైఫ్‌స్టైల్‌లో మహిళలు ఇటు ఇంటిని, అటు కెరీర్‌ని బ్యాలన్స్‌ చేసుకోవాలంటే చిన్న చిన్న టిప్స్‌ పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..!

⚛ రోజూ మనం చేసే పనుల్లో అన్నీ ప్రాధాన్యమైనవి ఉండచ్చు.. ఉండకపోవచ్చు. కాబట్టి ముందు ప్రాధాన్యత ఉన్నవి పూర్తిచేసుకుంటే.. ఒత్తిడి ఎదురవదు.. వేళకు పనులు పూర్తవుతాయి కూడా! తద్వారా అదనంగా సమయం కేటాయించాల్సిన అవసరం కూడా రాదు.

⚛ ఆఫీస్‌ పని వేళల్లో వాట్సప్‌లో చాటింగ్‌, మెయిల్స్‌ చెక్ చేసుకోవడం, ఇతర వెబ్‌సైట్లు చూడడం.. వంటివి చేస్తే సమయం వృథా అవుతుంది. కాబట్టి ఇలాంటి అలవాట్లుంటే మానుకోవాలి. పూర్తిగా పని పైనే దృష్టి పెట్టాలి.

⚛ టీ, లంచ్‌ విరామ సమయాల్లో కనీసం పది నిమిషాలైనా మీకు నచ్చిన పని చేసేలా ప్లాన్‌ చేసుకోండి. ఇది మిమ్మల్ని మరింత ఉత్సాహంగా ముందుకెళ్లేలా ప్రేరేపిస్తుంది.

⚛ కొన్నిసార్లు మొహమాటానికి పోయి అదనపు పని భారం నెత్తిన వేసుకుంటే.. ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మీపై కావాలని పని భారం పెంచాలని చూసే వారికి నిర్మొహమాటంగా నో చెప్పడం మంచిదంటున్నారు నిపుణులు.

⚛ రోజూ డైరీ రాసుకున్నట్లే.. మీ కెరీర్‌ ట్రాక్‌ రికార్డును కూడా ఎప్పటికప్పుడు నోట్‌ చేసుకోవాలి. ఇది మిమ్మల్ని మరింత ఉత్సాహంగా పని చేసేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఒత్తిడి, అలసట అన్న సమస్యలే రావు.

⚛ ఇంట్లోనైనా, ఆఫీస్‌లోనైనా కొన్ని పనుల్లో తోటి వారి సహాయం తీసుకోవడం వల్ల మీపై అదనపు పని భారం తగ్గుతుంది. ఇదీ వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేసుకోవడంలో, మీ కోసం మీరు కాస్త సమయం కేటాయించుకోవడంలో తోడ్పడుతుంది.

⚛ ఎప్పుడూ పని పని అని కాకుండా.. అప్పుడప్పుడూ వర్క్‌ డీటాక్సిఫికేషన్‌ కూడా ప్రతి ఒక్కరికీ అవసరమే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్‌కి వెళ్లడం, నచ్చిన అభిరుచులపై దృష్టి పెట్టడం, రోజూ కాసేపు కుటుంబంతో-పిల్లలతో సమయం గడపడం.. ఇవన్నీ వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ని, ఆత్మవిశ్వాసాన్నీ పెంచేవే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్