అందుకే వీళ్ల సైకిల్‌ యాత్ర!

వయసు పెరుగుతున్న కొద్దీ మహిళలకు ఇంటి పనులు, కెరీర్‌తోనే సమయం సరిపోతుంది.. దీంతో తమ ప్రవృత్తులపై దృష్టి పెట్టాలని ఉన్నా ‘అంత తీరికెక్కడిది’ అంటూ వాటిని వదిలేస్తుంటారు చాలామంది. ఇంకొంతమందేమో రిస్క్‌ ఎందుకన్న ఉద్దేశంతో కొత్త సవాళ్లను స్వీకరించడానికి ధైర్యం చేయరు. కానీ మనకు ఇల్లు-కెరీర్‌ ఎంత ముఖ్యమో.....

Published : 22 Feb 2022 19:03 IST

(Photo: Instagram)

వయసు పెరుగుతున్న కొద్దీ మహిళలకు ఇంటి పనులు, కెరీర్‌తోనే సమయం సరిపోతుంది.. దీంతో తమ ప్రవృత్తులపై దృష్టి పెట్టాలని ఉన్నా ‘అంత తీరికెక్కడిది’ అంటూ వాటిని వదిలేస్తుంటారు చాలామంది. ఇంకొంతమందేమో రిస్క్‌ ఎందుకన్న ఉద్దేశంతో కొత్త సవాళ్లను స్వీకరించడానికి ధైర్యం చేయరు. కానీ మనకు ఇల్లు-కెరీర్‌ ఎంత ముఖ్యమో.. దాన్ని బ్యాలన్స్‌ చేసుకోవడానికి మనం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడమూ అంతే ముఖ్యమంటున్నారు ఇద్దరు మహిళలు. ఇదే విషయాన్ని మహిళల్లోకి తీసుకెళ్లడానికి సైకిల్‌ యాత్ర చేపట్టారు. ఇంతకీ, వాళ్లెవరు? తమ యాత్ర విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

మీరా వెలంకార్‌, తస్నీమ్‌ మొహ్సిన్‌.. బెంగళూరుకు చెందిన ఈ ఇద్దరూ తమ తమ వృత్తుల్లో ఎంత బిజీగా ఉన్నా.. ప్రవృత్తులకూ సమ ప్రాధాన్యమిస్తుంటారు. వీళ్లిద్దరికీ సైక్లింగ్‌ అంటే ఇష్టం. అటు సరదాను, ఇటు ఆరోగ్యాన్ని అందించే సైక్లింగ్‌ను ప్రతి మహిళా తమ జీవితంలో భాగం చేసుకోవాలని, తద్వారా అన్ని ఒత్తిళ్లను ఇట్టే అధిగమించచ్చంటున్నారీ సైక్లింగ్‌ విమెన్.

తొలి మహిళా ద్వయం!

సైకిల్‌ తొక్కడం వల్ల ఆరోగ్యం, ఫిట్‌స్‌ మెరుగుపడుతుంది. అలాగే ఈ ప్రక్రియ పర్యావరణానికీ మేలు చేస్తుంది. అందుకే దీని ప్రాముఖ్యాన్ని, దీనివల్ల మనకు చేకూరే ప్రయోజనాల్ని మహిళల్లోకి తీసుకెళ్లడానికి తూర్పు భారతం నుంచి పశ్చిమ భారతానికి సుమారు 3,800 కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర చేపట్టారు ఈ ఇద్దరు మహిళా మణులు. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చివరి పట్టణమైన (ఇండో-చైనా సరిహద్దు) కిబితు అనే పట్టణం నుంచి జనవరి 27న మొదలైన ఈ యాత్ర.. ఫిబ్రవరి 22న పశ్చిమాన చివరి పట్టణమైన కోటేశ్వర్‌ (ఇండో-పాక్‌ సరిహద్దు)కు చేరుకుంది. రోజుకు 150-175 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేస్తూ, పలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని అధిగమిస్తూ ప్రయాణం సాగించారీ సైక్లింగ్‌ ద్వయం. ఇలా ఇద్దరు మహిళలు కలిసి తూర్పు భారతం నుంచి పశ్చిమ భారతం వరకు సైకిల్‌ యాత్ర చేపట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

అడుగడుగునా సవాళ్లే!

అయితే తాము చేపట్టిన ఈ యాత్ర పలువురు మహిళల్లో ఆరోగ్య స్పృహ పెంచితే చాలంటున్నారు మీరా, తస్నీమ్‌. ‘మధ్య వయస్కులైన మహిళలు కొత్త కొత్త సవాళ్లు స్వీకరించడానికి వెనకడుగు వేస్తుంటారు. తమ అభిరుచులపై దృష్టి పెట్టడానికీ సాహసించరు. అలాంటి వాళ్ల ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికే ఈ యాత్ర చేపట్టాం. సైక్లింగ్‌ అనేది ఒక చక్కటి అవుట్‌డోర్ యాక్టివిటీ. ఇదనే కాదు.. నడక, జాగింగ్‌.. ఇలా ఏవైనా మనలో కొత్త ఉత్సాహం నింపేవే! ఇక మా యాత్రలో భాగంగా భిన్న అనుభవాలు ఎదుర్కొన్నాం. ఒక్కో చోట విపరీతమైన ఎండ వేడి, మరో చోట భరించలేని చలి.. ఇలా రోజురోజుకీ మారే ఉష్ణోగ్రతల్ని తట్టుకుంటూ ముందుకు సాగడం సవాలుగా అనిపించింది. ఇక గుజరాత్‌లో కొండ ప్రాంతాల్లో కమ్ముకున్న మంచును ఛేదించుకుంటూ వెళ్లడమంటే సాహసమనే చెప్పాలి. మరికొన్ని ప్రాంతాల్లో నిర్మానుష్యంగా ఉండే రోడ్లపై నుంచి ప్రయాణించడం కాస్త బెరుగ్గానే అనిపించింది..’ అంటూ తమ సాహస యాత్ర గురించి చెప్పుకొచ్చారీ మహిళా మణులు.

అదే నా స్ట్రెస్‌ బస్టర్!

తాను తన వృత్తిని ఎంతగా ప్రేమిస్తానో.. సైక్లింగ్‌నీ అంతే ఆరాధిస్తానంటున్నారు 45 ఏళ్ల డాక్టర్‌ మీరా వెలంకార్‌. ముంబయిలో పుట్టి పెరిగిన ఆమె.. లైఫ్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ పూర్తిచేశారు. పెళ్లయ్యాక బెంగళూరుకు చేరుకున్న మీరా.. అక్కడే రీసెర్చ్‌ సైంటిస్ట్‌గా విధుల్లో చేరారు. ప్రస్తుతం ‘ది బాంబే టెక్స్‌టైల్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌’లో ఛీఫ్‌ మైక్రోబయాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పట్నుంచి క్రీడలపై తనకున్న ఆసక్తి 36 ఏళ్ల వయసులో తనను సైకిల్‌ పట్టుకునేలా చేసిందంటున్నారు మీరా.
‘ఆటలంటే నాకు చిన్నప్పట్నుంచే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే సైక్లింగ్‌పై నాకున్న మక్కువను గ్రహించి మా వారే నాకు సైకిల్‌ కొని బహుమతిగా అందించారు. దాంతో పిల్లల్ని స్కూల్‌ నుంచి ఇంటికి తీసుకురావడానికి, కాయగూరల కోసం.. ఇలా దగ్గరి ప్రాంతాలకు సైకిల్ పైనే వెళ్లేదాన్ని. ఇలా క్రమంగా ఇది నా శారీరక సత్తువను, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం గమనించా. అందుకే సైక్లింగ్ ప్రాముఖ్యాన్ని మహిళల్లోకి తీసుకెళ్లడానికి మారథాన్‌, ట్రయథ్లాన్‌, అవుట్‌డోర్‌ సాహసకృత్యాల్లోనూ పాల్గొంటున్నా..’ అంటున్నారీ సైక్లింగ్‌ క్వీన్.

రికార్డులు దాసోహం

సుదూర దూరాలను టాండమ్‌ బైక్‌ (రెండు సీట్లుండే పొడవైన సైకిల్‌)పై చుట్టేసినందుకు గాను మూడుసార్లు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో స్థానం సంపాదించిన మీరా.. మెట్రో నగరాలను కలిపే గోల్డెన్‌ క్వాడ్రిలేట్రల్‌ (GQ) జాతీయ రహదారిని తక్కువ రోజుల్లో చుట్టేసిన తొలి మహిళగా ఘనత సాధించారు. ఇవే కాదు.. తన సైక్లింగ్‌ నైపుణ్యాలతో మరెన్నో అరుదైన రికార్డులూ సొంతం చేసుకున్నారీ పెడల్‌ మామ్‌. ఇలా తాను సాధించిన విజయాల్ని తన వెబ్‌సైట్‌ pedalmummy.com లో పొందుపరుస్తుంటారు మీరా. ప్రస్తుతం ఓవైపు ఇద్దరు పిల్లల తల్లిగా, మరోవైపు తన వృత్తిని బ్యాలన్స్‌ చేసుకుంటూనే.. ఇంకోవైపు సైక్లింగ్‌ ఔత్సాహికులకూ శిక్షణనిస్తున్నారీ సైక్లింగ్‌ లవర్.

సైక్లింగ్‌తో అరుదైన రికార్డు!

43 ఏళ్ల మొహ్సిన్‌కూ సైక్లింగ్‌ అంటే మహా ఇష్టం. ఓవైపు ఇద్దరు పిల్లల తల్లిగా, మరోవైపు తన వృత్తిలోనూ రాణిస్తోన్న ఆమె.. సైక్లింగ్‌ని తన ప్రవృత్తిగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే వివిధ సైక్లింగ్‌ ఈవెంట్లలో పాల్గొంటూ సత్తా చాటుతున్నారు. ఒకే ఏడాదిలో 200, 300, 400, 600 కిలోమీటర్ల దూరాన్ని చుట్టేసిందుకు గాను రెండుసార్లు ‘Super Randonneur’ రికార్డును అందుకున్నారు తస్నీమ్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్