Ukraine Women: భాగస్వామి దూరమైనా.. వారి ప్రేమను సజీవంగా ఉంచుతూ..!
యుద్ధరంగంలో తమ భర్తను పోగోట్టుకున్న ఎంతోమంది మహిళల బాధను అర్థం చేసుకున్న ఆమె వారికి సాంత్వన చేకూర్చాలనుకుంది. ఈ ఆలోచనతోనే ‘Alive. True Stories Of Love’ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో భాగంగానే.. భర్తను పోగొట్టుకున్న మహిళల మనోవేదనను పెయింటింగ్ ద్వారా బాపాలని ప్రయత్నిస్తోంది.
(Photos: Instagram)
పెళ్లి ఇద్దరి వ్యక్తులనే కాదు.. రెండు మనసులను ఏకం చేస్తుంది. ఈ క్రమంలో ఒకరికొకరు కలకాలం కలిసుంటానని బాసలు చేసుకుంటారు. కానీ, అలా బాస చేసిన వ్యక్తి ఒక్కసారిగా దూరమైతే.. ఆ బాధను మాటల్లో వర్ణించలేం. రష్యా-ఉక్రెయిన్ సైనిక చర్యలో ఇలా ఎంతోమంది మహిళలు తమ జీవిత భాగస్వామిని కోల్పోయారు. జీవితాంతం తోడుగా ఉండాల్సిన భాగస్వామిని కోల్పోయి తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. దీన్నుంచి బయటపడడం అంత సులభం కాదు. సరిగ్గా ఇలాంటి బాధనే ఒలెనా సొకాల్‌స్కా కూడా అనుభవించింది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం ఒక కారు ప్రమాదంలో చనిపోయారు. అప్పటినుంచి తనలో ఎంతో బాధను దిగమింగుకొని జీవిస్తోంది. ఈ క్రమంలో యుద్ధరంగంలో తమ భర్తను పోగోట్టుకున్న ఎంతోమంది మహిళల బాధను అర్థం చేసుకొని.. వారికి సాంత్వన చేకూర్చాలనుకుంది. ఈ ఆలోచనతోనే ‘Alive. True Stories Of Love’ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో భాగంగానే.. భర్తను పోగొట్టుకున్న మహిళల మనోవేదనను పెయింటింగ్ ద్వారా బాపాలని ప్రయత్నిస్తోంది.
ఒలెనా సొకాల్‌స్కా ప్రారంభించిన కమ్యూనిటీలో దాదాపు 1000 మంది సభ్యులున్నారు. వీరంతా ఈ సైనిక చర్యలో తమ జీవిత భాగస్వామిని పోగొట్టుకున్న మహిళలే! ఇలాంటి వారికి పెయింటింగ్ ఒక థెరపీలాగా పని చేస్తుందంటున్నారు ఒలెనా. అలాగే పెయింటింగ్ వేయడం రాని మహిళలకు వలంటీర్ల సహాయం కూడా అందిస్తోందామె. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎంతోమంది మహిళలు తమ బాధను పెయింటింగ్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
రెండు హృదయాలు.. శరీరం మాత్రం ఒక్కటే..
ఇరినా ఫారియన్, ఒలెక్సాండర్ అలిమోవ్‌లు భార్యాభర్తలు. వీరికి పెళ్లై పదేళ్లవుతోంది. అలిమోవ్ గత డిసెంబర్‌లో ఉక్రెయిన్ తరపున పోరాడి అసువులు బాసాడు. ‘నా భర్త ఓ ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేసేవాడు. రష్యా.. ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించినప్పుడు అతను తీవ్రంగా కలత చెందాడు. ‘స్వేచ్ఛ లేని దేశంలో జీవించడం కష్టం’ అని యుద్ధ రంగంలోకి అడుగుపెట్టాడు. రష్యా చేసిన దాడిలో అతను గత డిసెంబర్‌లో వీర మరణం పొందాడు’ అంటూ ఇరినా కన్నీటి పర్యంతమైంది.
భర్త దూరమైన బాధ నుంచి ఇరినా ఇంకా తేరుకోలేదు. భర్త గుర్తుగా పెళ్లి ఉంగరాన్ని ఎప్పటికీ తన వేలికే ఉంచుకుంటానని చెబుతోంది. అదే తన బాధ నుంచి ఉపశమనం కలిగిస్తుందని అంటోంది. ‘నేను ఎప్పటికీ ఈ ఉంగరం తీయను. ఎందుకంటే, ఇది నా మనసులోని బాధను తగ్గిస్తుంది’ అని చెప్పుకొచ్చింది. ఒలెనా సొకాల్‌స్కా ప్రాజెక్టులో భాగమైన ఇరినా తన భర్తతో ఉన్న అనుబంధాన్ని పెయింటింగ్ రూపంలో వ్యక్తపరిచింది. ఈ క్రమంలోనే ఒక చెట్టు నుంచి రెండు కొమ్మలు కలిసిపోయినట్లుగా చిత్రం గీసింది. దీని గురించి మాట్లాడుతూ.. ‘నేను, నా భర్త ఎప్పటికీ విడిపోమని చెప్పడానికే ఈ చిత్రం గీశాను. మా ఇద్దరివీ రెండు ఆత్మలు, రెండు హృదయాలు కావచ్చు.. కానీ శరీరం మాత్రం ఒక్కటే!’ అందామె.
తొమ్మిది రోజుల్లోనే...
ఒక్సానా కోర్డినా, ఆండ్రీ వోల్కోవ్‌లది పదేళ్ల బంధం. ఒక్సానా తన భర్తను యుద్ధం మొదలైన తొలి నాళ్లలోనే కోల్పోయింది. ‘ఆ క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఫిబ్రవరి 24, 2022 ఉదయం రష్యా, ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించింది. రాజధానిని కాపాడుకోవడానికి వోల్కోవ్ అతని వస్తువులు సర్దుకుంటున్నాడు. నేను అతనికి మద్దతుగా ఫస్ట్ ఎయిడ్ కిట్ సిద్ధం చేశాను. ఆ తర్వాత మిలిటరీ ఆఫీసుకు చేరుకొని యుద్ధంలో పాల్గొన్నాడు. కానీ తొమ్మిది రోజుల్లోనే తనువు చాలించాడు..’ అంటూ తన మనసులోని వ్యథను పంచుకుంది ఒక్సానా.
భర్త మరణించి ఏడాదైనా ఒక్సానా ఆ బాధ నుంచి ఇంకా తేరుకోలేకపోతోంది. ఒలెనా చేపట్టిన ప్రాజెక్టులో భాగమైన ఆమె.. తన మనోవేదనను పెయింటింగ్ రూపంలో వ్యక్తపరిచింది. ఇందులో తన భర్తకు ఇష్టమైన ఓ కొలనును కాన్వాస్‌పై ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ‘నేను క్రియేటివ్ వ్యక్తిని కాదు. కానీ కాస్త కొత్తగా ప్రయత్నించాలనుకున్నా. నిజానికి ఈ మనోవేదనను వ్యక్తపరచడం అంత సులభం కాదు..’ అని చెప్పుకొచ్చిందామె.
మనం ఇప్పటికీ విడిపోలేదు...
జులియా మొవ్‌చన్ ఏడాది క్రితమే తన భర్త అలెక్సీని పోగొట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె భర్త తనని మొదటిసారి సర్‌ప్రైజ్ చేసిన ప్రాంతానికి సంబంధించిన పెయింటింగ్‌ను వేసింది. దీని గురించి స్పందిస్తూ.. ‘మన పెళ్లి తర్వాత నువ్వు లేకుండా ఏడాది పాటు గడిపాను. కానీ మనం ఇప్పటికీ విడిపోలేదని నా మనసు చెబుతోంది. ఈ పెయింటింగ్‌లో నీ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మాటల్లో వర్ణించలేను..’ అంది జులియా.
వీరితో పాటు ఎంతోమంది మహిళలు.. తమ భర్త దూరమైన బాధను, వారితో తమకున్న జ్ఞాపకాల్ని పెయింటింగ్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుభూతుల సమాహారమే ఈ చిత్రాలు!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.