Tech Jobs: అమ్మాయిలకే ఆ నైపుణ్యాలు ఎక్కువ!

కరోనా విలయతాండవం ప్రపంచగతినే మార్చేసింది. మహమ్మారి వల్ల మొదట్లో చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. వ్యాక్సిన్లు వచ్చిన తర్వాత వ్యాపారాలు కొద్దికొద్దిగా కుదుటపడ్డాయి. దాంతో సంస్థలు మళ్లీ నియామకాలు చేపడుతున్నాయి.

Published : 24 Jan 2022 21:08 IST

కరోనా విలయతాండవం ప్రపంచగతినే మార్చేసింది. మహమ్మారి వల్ల మొదట్లో చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. వ్యాక్సిన్లు వచ్చిన తర్వాత వ్యాపారాలు కొద్దికొద్దిగా కుదుటపడ్డాయి. దాంతో సంస్థలు మళ్లీ నియామకాలు చేపడుతున్నాయి. ఇందులో టెక్‌ పరిశ్రమలు ముందున్నాయి. ఈ క్రమంలో- టెక్ రంగంలో ప్రత్యేకించి డెవలప్‌మెంట్ విభాగంలో తమకున్న నైపుణ్యాల కారణంగా పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఉద్యోగాలు దక్కించుకునే అవకాశం ఉందని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది.

మహిళలకే ఆ నైపుణ్యాలు ఎక్కువ!

బ్రిడ్జ్ ల్యాబ్స్ అనే సంస్థ బీటెక్, ఎంసీఏ వంటి టెక్నికల్‌ కోర్సులు పూర్తి చేసిన వారికి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వివిధ కోర్సులలో శిక్షణ ఇస్తుంటుంది. ఆ తర్వాత వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంటుంది. ఈ క్రమంలో- వివిధ టెక్ గ్రాడ్యుయేట్లలో ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఏమేరకు ఉన్నాయో అంచనా వేసేందుకు ఈ సంస్థ నిర్వహించిన పరీక్షలో అమ్మాయిలే అగ్రస్థానంలో నిలవడం విశేషం. టెక్ రంగంలో ప్రత్యేకించి డెవలప్‌మెంట్ జాబ్స్‌కి సంబంధించి ఉద్యోగ నైపుణ్యాలను నిర్ణయించే ఈ పరీక్షలో- అమ్మాయిల స్కోరు సగటున 42 శాతం ఉండగా; అబ్బాయిల స్కోరు 39 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. సుమారు ౪౦ వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.

కరోనా నేపథ్యంలో- టెక్ రంగంలో ఓ పక్క ఉద్యోగావకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అదే సమయంలో అర్హత కలిగిన ఉద్యోగుల కొరత కూడా వెంటాడుతోంది. చాలా సంస్థలు ప్రతిభ కలిగిన మహిళలను సరైన విధంగా ఉపయోగించుకోలేకపోవడం కూడా ఇందుకు ఓ కారణమని ఈ అధ్యయనం వెల్లడించడం గమనార్హం.

మళ్లీ చేరాలనుకున్నా..

ఈ క్రమంలో ఉన్నత విద్యను అభ్యసించిన, అనుభవం ఉన్న చాలామంది మహిళలు తాము పనిచేస్తున్న సంస్థల్లో మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయి వరకు చేరుకుంటున్నారని ఈ నివేదిక తెలిపింది. అయితే వీరిలో ఎక్కువమంది మహిళలు ఆ తర్వాత తమ కెరీర్‌కు విరామం ఇస్తున్నారట. దానికి పెళ్లి, మాతృత్వం, తల్లిదండ్రుల సంరక్షణ వంటి పలు కారణాలు ఉంటున్నాయి. ఒకవేళ పరిస్థితులు అనుకూలించి తిరిగి కెరీర్ ప్రారంభించాలనుకున్నా- టెక్నాలజీలో మార్పులు రావడం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన పరిస్థితులు ఎదురవ్వడం వంటి సమస్యలు వారిని ఇబ్బంది పెడుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. 

మహమ్మారి వల్ల మహిళలే నష్టపోయారు..!

కరోనా మహమ్మారి వల్ల చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. దానికి తగ్గట్టే ఇతర రంగాల వలే టెక్‌ ఇండస్ట్రీలో కూడా పురుషాధిపత్యం ఉంది. ఫలితంగా చాలామంది మహిళలు తిరిగి ఉద్యోగంలో చేరలేకపోయారని గణంకాలు చెబుతున్నాయి. ఆ సమయంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా నష్టపోయారట. చాలా సంస్థలు మహిళలను ‘రిజర్వ్‌ వర్క్‌ఫోర్స్‌’గానే చూస్తున్నాయి తప్ప వారిని ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగంగా చూడడం లేదని సర్వేలో వెల్లడైంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్