Floods: వానలకు అదరరు.. వరదలకు బెదరరు!
ప్రజా సేవే ప్రథమ కర్తవ్యంగా.. తమ సాహసాలు, సహాయ సహకారాలతో దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంటోన్న కొందరు మహిళా ఆఫీసర్ల గురించి మీకోసం..!
(Photos: Twitter)
ఉత్తర భారతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, దిల్లీ, పంజాబ్, హరియాణా రాష్ట్రాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు తామున్నామంటూ రంగంలోకి దిగారు కొందరు మహిళా అధికారులు. రాత్రింబవళ్లూ ముంపు ప్రాంతంలోనే గడుపుతూ ప్రజలకు తామున్నామంటూ భరోసా అందిస్తున్న వారు కొందరైతే.. పసి పిల్లల్ని సైతం ఇంట్లోనే వదిలేసి విధులకు హాజరవుతున్నారు మరికొందరు. మరి, ప్రజా సేవే ప్రథమ కర్తవ్యంగా.. తమ సాహసాలు, సహాయ సహకారాలతో దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంటోన్న అలాంటి కొందరు మహిళా ఆఫీసర్ల గురించి మీకోసం..!
శాటిలైట్ ఫోన్లు అందించి..
హిమాచల్ప్రదేశ్ కులు జిల్లాలోని మనాలీ, బంజర్, మణికరన్.. వంటి ప్రాంతాల్ని వరదలు ముంచెత్తాయి. దీంతో ఇక్కడి క్యాసోల్, సెయింజ్ లోయ.. పూర్తిగా నీట మునగడంతో.. ఆయా గ్రామాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఫోన్ కనెక్షన్ లేకపోవడం అక్కడి ప్రజలకు సవాలుగా మారాయి. ఇలాంటి తరుణంలో రంగంలోకి దిగారు కులు ఎస్పీ సాక్షి వర్మ కార్తికేయన్. వరదల్లో చిక్కుకున్న వారి సమాచారం తెలుసుకోవడమే ముఖ్యోద్దేశంగా.. వారికి శాటిలైట్ ఫోన్లు అందించే ఏర్పాటుచేశారామె.
‘భారీ వరదల కారణంగా.. క్యాసోల్, సెయింజ్ లోయ.. ఈ రెండు ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. విద్యుత్ నిలిచిపోయింది.. మొబైల్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో అక్కడున్న వారి ఆచూకీ తెలుసుకోవడానికి చాపర్స్ సహాయంతో శాటిలైట్ ఫోన్లు ఆయా ప్రాంతాల్లో వదిలాం. ఫలితంగా వరదల్లో చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకొని.. వారి యోగక్షేమాల్ని వారి బంధువులకు చేరవేయడంతో పాటు, వారినీ సులభంగా రక్షించగలిగాం. ఇక పలువురు పోలీసులు, వలంటీర్ల సహాయంతో ఆయా ప్రాంతాల్లో చిక్కుకున్న పర్యటకుల్ని సురక్షితంగా వెనక్కి తీసుకురాగలిగాం. అలాగే అక్కడి ప్రజలకు స్నాక్స్, ఆహార పదార్థాలు కూడా నిరంతరాయంగా అందిస్తున్నాం..’ అంటూ తాము తీసుకుంటోన్న సహాయక చర్యల గురించి చెప్పుకొచ్చారు సాక్షి.
ఓ చిన్నారికి తల్లైన ఆమె తన పాపాయి బాధ్యతల్ని కుటుంబ సభ్యులకు అప్పగించి మరీ డ్యూటీ చేశారు. పంజాబ్‌లోని రాజ్‌పురాకు చెందిన ఆమె.. తొలుత సిమ్లాలో విధులు నిర్వర్తించారు. ఆపై 28 ఏళ్లకు ఎస్పీగా బాధ్యతలు చేపట్టి.. ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలిగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో బ్రౌన్ షుగర్ తరలింపు, డ్రగ్ మాఫియా.. వంటి నేరాల్ని తుడిచిపెట్టేలా చర్యలు తీసుకున్నారు. అక్కడి ప్రజలు ‘లేడీ సింగం’గా పిలుచుకునే సాక్షి.. కులు జిల్లాలో మహిళల సంరక్షణ కోసం ‘గుడియా హెల్ప్‌లైన్’, ‘శక్తి బటన్’, ‘హోషియార్ సింగ్’.. వంటి పలు సేవల్ని ప్రారంభించారు.
హిమాచల్‌లో సాక్షితో పాటు.. మండి ఎస్పీ సౌమ్యా సాంబశివన్, కంగ్రా ఎస్పీ శాలిని అగ్నిహోత్రి కూడా వరద సహాయక చర్యల్లో భాగంగా రాత్రింబవళ్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించారు.
మూడేళ్ల చిన్నారిని ఇంట్లో వదిలి..
వరదలంటే ముందు ప్రజల్ని అలర్ట్ చేయాలి.. అవాస్తవిక సమాచారంతో వారు భయభ్రాంతులకు గురికాకుండా కాపాడాలి.. ఈ రెండు చర్యలు తీసుకోవడంలో సఫలమయ్యారు పంజాబ్‌లోని పాటియాలా జిల్లా డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్నే. రానున్న వరద ముంపుకి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతం చేస్తూ.. ఆయా గ్రామాల అధికారుల్ని అప్రమత్తం చేశారామె. తద్వారా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముందుగానే ఖాళీ చేయించడంలో ముఖ్య భూమిక పోషించారు. అంతేకాదు.. క్షేత్రస్థాయిలోకి వెళ్లి నేరుగా ప్రజలతో మాట్లాడుతూ.. వరదలకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని, పుకార్లను దూరం చేసే ప్రయత్నం చేశారామె. మూడేళ్ల తన కూతురు బాధ్యతల్ని ఇంట్లో వాళ్లకు అప్పగించి రాత్రింబవళ్లూ వరద ముంపు గ్రామాల ప్రజలకు సహాయక చర్యలు అందించారు.
‘రాజ్‌పురాలోని చిత్కారా యూనివర్సిటీలో చిక్కుకున్న 3 వేల మంది విద్యార్థుల్ని సిబ్బంది సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగాం. ఈ రెస్క్యూ ఆపరేషన్ రాత్రంతా కొనసాగింది. సహాయక చర్యల్లో భాగంగా రోజూ ఉదయం 6 గంటలకే ముంపు ప్రాంతాలకు చేరుకునేదాన్ని. ఒక్కో రోజు అక్కడే అర్ధరాత్రి దాటి 3 గంటలయ్యేది. అధికారిక ల్యాండ్‌లైన్ నంబర్‌కు కాల్స్ తాకిడి పెరిగిపోవడంతో.. నా వ్యక్తిగత మొబైల్ నంబర్ నుంచి కూడా చాలా కాల్స్ స్వీకరించాను. అలాగే ప్రజల సందేహాల్ని అప్పటికప్పుడే నివృత్తి చేసే ముఖ్యోద్దేశంతో ‘రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (RWAs)’ వాట్సప్ గ్రూప్స్‌లో చేరాను..’ అంటోన్న సాహ్నే.. వరద తగ్గుముఖం పట్టాక.. ముంపు ప్రాంతాలకు విద్యుత్, నీటి పునరుద్ధరణలోనూ కీలక పాత్ర పోషించారు. 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమె.. తన నిస్వార్థ సేవలతో అక్కడి ప్రజల మన్ననలందుకున్నారు. సాహ్నే మారథానర్ కూడా!
వ్యాధులు ప్రబలకుండా..!
వరద ముప్పు నుంచి ప్రజల్ని కాపాడడం ఒకెత్తయితే.. వరద ఉద్ధృతి తగ్గాక తిరిగి ఆయా ప్రాంతాల్ని పూర్వపు స్థితికి తీసుకురావడం మరో ఎత్తు. వరదల సమయంలో మొహాలీ ప్రజల్ని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు.. ముప్పు తగ్గుముఖం పట్టాక.. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు మొహాలీ డిప్యూటీ కమిషనర్ ఆషికా జైన్. ఈ క్రమంలోనే అక్కడి సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించిన ఆమె.. ప్రజల ఆరోగ్యం విషయంలో, వ్యాధులు ప్రబలకుండా వారికి కొన్ని ఆదేశాలు జారీ చేశారు.
‘ప్రజలకు సురక్షితమైన తాగు నీరు అందించడం కోసం.. వారికి క్లోరిన్ మాత్రలు అందేలా చూశాం. ఇక వ్యాధులు ప్రబలకుండా ప్రజల ఆరోగ్యాన్ని అనుక్షణం పర్యవేక్షించేందుకు పలువురు ఆరోగ్య కార్యకర్తల్ని ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉంచాం. ఒకవేళ ఏదైనా వ్యాధి ప్రబలినా, కొత్త వ్యాధులు పుట్టుకొచ్చినా.. సత్వర చికిత్స అందించేలా అత్యవసర ఏర్పాట్లూ చేశాం.. మరోవైపు ముంపు గ్రామాల్లోని స్కూళ్లను అక్కడి పంచాయతీల సహాయంతో తిరిగి శుద్ధి చేయిస్తున్నాం..’ అంటూ చెప్పుకొచ్చారు జైన్. 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమె.. ఈ ఏడాది ఆరంభంలోనే మొహాలీ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలందుకున్నారు. మొహాలీని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నానంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు జైన్.
మూడు రోజులూ నీటిలోనే!
పంజాబ్ రూప్‌నగర్ జిల్లాలోని రోపర్ ప్రాంతంలో వరదలు తలెత్తడంతో అక్కడి సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు ఆ ప్రాంత డిప్యూటీ కమిషనర్ ప్రీతి యాదవ్. అయితే ఇలా విధుల్లో ఉండగానే తన ఇల్లూ వరదలో చిక్కుకుందన్న ఫోన్ కాల్ వచ్చిందామెకు. ఆ సమయంలో ఆమె ఇద్దరు కూతుళ్లు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ అటు తల్లిగా, ఇటు అధికారిణిగా.. రెండు బాధ్యతల్ని సమన్వయం చేసుకున్నారు ప్రీతి. వెంటనే తన భర్తకు ఫోన్ చేసి.. పిల్లలకు అండగా ఉండమని చెప్పిన ఆమె.. క్షేత్ర స్థాయిలో రోజుల తరబడి కంటి మీద కునుకు లేకుండా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
‘నాకు ఏడాదిన్నర, నాలుగున్నరేళ్ల.. ఇద్దరు కూతుళ్లున్నారు. నేను క్షేత్ర స్థాయిలో ఉండగానే మా ఇల్లూ వరదలో చిక్కుకుంది. ఆ సమయంలో ఇంట్లో మా అమ్మాయిలిద్దరే ఉన్నారు. వెంటనే నా భర్త ఇంటికి చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నా. ఇక వరద ముంపు ప్రాంతాల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, సహాయక చర్యల్లో పాల్గొనడంతో.. ఒక్కోసారి వరుసగా మూడు రోజుల పాటు నీటిలోనే గడపాల్సి వచ్చేది. విశ్రాంతి, నిద్ర కరువయ్యేవి.. మరోవైపు వాష్‌రూమ్ సదుపాయం లేక మరిన్ని సవాళ్లు ఎదురయ్యేవి. ఇక సహాయక చర్యలు ముగిసి ఇంటికి చేరుకున్నాక.. మా పెద్ద పాప నన్ను గట్టిగా హత్తుకుంది. టీవీలో ప్రజలకు సహాయం చేయడం చూశానని తాను సంతోషంగా చెబుతుంటే.. నా మనసు నిండిపోయింది.. ఓ తల్లిగా, ప్రజా అధికారిణిగా ఇంతకంటే ఆనందం, సంతృప్తి మరేముంటుంది?’ అంటూ చెప్పుకొచ్చారు ప్రీతి.
గర్భిణుల క్షేమం కోరి..!
ఇటీవల పోటెత్తిన వరదలకు హరియాణాలోని ఫతేహాబాద్ జిల్లా 40 శాతం నీట మునిగింది. అయితే ఇద్దరు మహిళా అధికారుల చొరవతో అక్కడ ఆస్తి, ప్రాణ నష్టం చాలావరకు తప్పింది. వారే ఆ జిల్లా ఎస్పీ ఆస్తా మోదీ, జిల్లా కమిషనర్ మన్‌దీప్ కౌర్. వరదల సమయంలో వీరిద్దరూ కలిసి అక్కడి ముంపు గ్రామాల్లో పర్యటించారు. రెస్క్యూ బృందాలతో కలిసి రాత్రింబవళ్లూ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
‘వరదల సమయంలో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆయా గ్రామాల పంచాయతీల చొరవతో గర్భిణులు, వృద్ధులు, చిన్నారుల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చగలిగాం. ఇక సురక్షిత శిబిరాల్లోనూ ప్రజలకు ఎలాంటి లోటూ లేకుండా తగిన చర్యలు తీసుకున్నాం. దుస్తులు, ఆహార పొట్లాల పంపిణీ.. వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. అత్యవసర సమయాల్లో చికిత్స అందించేందుకు ఆరోగ్య కార్యకర్తలు, పలువురు వైద్యుల్నీ అందుబాటులో ఉంచాం..’ అంటూ చెప్పుకొచ్చారీ ఇద్దరు అధికారిణులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.