Women’s Day : ‘అన్నింటా మనమే రాణులం’ అంటున్నారిలా!

మహిళ అంటే వ్యక్తి కాదు.. వ్యవస్థను నడిపే శక్తి అని నిరూపిస్తున్నారు కొందరు మహిళలు. అలాంటి అతివల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ వేళ.. స్త్రీల కోసమే ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం పరిపాటే! అలాగే పూర్తి స్థాయి మహిళా సిబ్బందితో నడిచే శాఖలు మరికొన్నుంటాయి......

Published : 08 Mar 2022 17:25 IST

(Photo: Twitter)

మహిళ అంటే వ్యక్తి కాదు.. వ్యవస్థను నడిపే శక్తి అని నిరూపిస్తున్నారు కొందరు మహిళలు. అలాంటి అతివల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ వేళ.. స్త్రీల కోసమే ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం పరిపాటే! అలాగే పూర్తి స్థాయి మహిళా సిబ్బందితో నడిచే శాఖలు మరికొన్నుంటాయి. అలా ఈ యేడు కూడా స్త్రీ శక్తియుక్తుల్ని చాటేందుకు కొన్ని కార్యక్రమాలు/సంస్థలు సిద్ధమయ్యాయి. ఇంకొందరు మహిళలు కొత్త బాధ్యతల్ని అందుకొని స్ఫూర్తిగా నిలిచారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

ఇది ‘మహిళా’ ఎక్స్‌ప్రెస్!

ప్రస్తుతం మహిళలు అడుగుపెట్టని రంగమంటూ లేదంటే అది అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో రైల్వేల్లోనూ ప్రవేశించి.. దాదాపు అన్ని విభాగాల్లోనూ పాగా వేస్తున్నారు. అలాంటి ఓ మహిళా బృందాన్ని అందరికీ పరిచయం చేశారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైల్లో విధులు నిర్వర్తిస్తోన్న మహిళా సిబ్బంది వీళ్లేనంటూ చిన్న వీడియోను ట్వీట్‌ చేశారాయన. ఈ క్రమంలో మహిళా గార్డుతో పాటు ఇతర మహిళా ఉద్యోగుల్ని ఈ వీడియోలో మనం చూడచ్చు. 2019, ఫిబ్రవరి 17న ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ రైలు.. దిల్లీ-వారణాసి మధ్య రాకపోకలు సాగిస్తోంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవడం దీని ప్రత్యేకత! ఇలా ఇంతటి వేగంతోనూ మహిళలు దూసుకుపోగల శక్తిమంతులు అని చెప్పకనే చెబుతోందీ వీడియో.

మరోవైపు కొచ్చి మెట్రో రైల్‌ ఈ రోజు మహిళల కోసం ప్రత్యేక ఆఫర్‌ని ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజంతా మహిళలు ఉచితంగా, ఎన్నిసార్లైనా మెట్రోల్లో ప్రయాణించచ్చట!


‘న్యాయ’ దేవతలు!

కుటుంబాన్నే కాదు.. ఈ సమాజాన్నీ గాడిలో పెట్టగల సమర్థులు మహిళా మణులు. ఈ క్రమంలో ఎంతోమంది మహిళలు న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించి లాయర్లుగా, న్యాయమూర్తులుగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేరళ హైకోర్టులో ముగ్గురు మహిళలతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది. కేరళ హైకోర్టు చరిత్రలో ఓ కేసు విచారణ నేపథ్యంలో పూర్తి స్థాయి మహిళలతో కూడిన ధర్మాసనం ఏర్పాటుచేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అందులోనూ ఈ కమిటీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఏర్పాటు కావడం మరో విశేషం. ఈ మహిళా న్యాయమూర్తుల బృందంలో జస్టిస్‌ అను శివరామన్‌, వి. షిర్సీ, ఎం.ఆర్‌. అనిత ఉన్నారు. ప్రభుత్వ విపత్తు సహాయ నిధికి గురువాయూర్ దేవస్థానం ఇచ్చిన నిధుల్ని రద్దు చేస్తూ.. గతంలో మరో ఫుల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని కోరుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ జరిపి తీర్పు వెలువరించనుందీ మహిళా ధర్మాసనం.


మార్గదర్శకులకు నీరాజనం!

మహిళలు అత్యంత అరుదుగా ప్రవేశించే రంగాల్లో ‘STEAM (Science, Technology, Engineering, Applied Arts, Mathematics)’ ఒకటి. ఇలాంటి రంగాల్లో పాగా వేస్తూ ఎంతోమంది స్త్రీలకు మార్గదర్శకులుగా నిలిచారు కొందరు అతివలు. అలాంటి మహిళా మార్గదర్శకులకు నీరాజనంగా రూపొందించనున్న పుస్తకమే ‘షీ ఈజ్‌ : 75 విమెన్‌ ఇన్‌ STEAM’. ‘షీ ఈజ్‌’ అనే పుస్తకానికి రెండో సంచికైన ఈ బుక్‌లో 75 మంది భారతీయ వనితల విజయగాథల్ని అక్షరీకరించనున్నారు. ఐఐటీ గువహటి ప్రొఫెసర్‌ రాఖీ చతుర్వేది; కోల్‌కతా ‘CSIR – ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ’లో వైరాలజిస్ట్‌-సీనియర్‌ శాస్త్రవేత్త అయిన డా. ఉపాసన రే, ముంబయికి చెందిన రచయిత్రి కిరణ్‌ మన్రాల్‌; శాస్త్ర సాకేంతిక రంగాల్లో నాణ్యమైన విద్యనందించేందుకు నెలకొల్పిన ‘విజ్ఞాన్‌శాల’ సంస్థ వ్యవస్థాపకురాలు డా. దార్శనా జోషి; బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. గీతా రాయ్‌.. వంటి ఎందరో స్ఫూర్తిదాయక మహిళల విజయగాథలు ఈ పుస్తకం కోసం ఎంపికయ్యాయి. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా ఈ 75 మంది మహిళల కథలతో కూడిన పుస్తక విశేషాలు ఇటీవలే వెల్లడించడం, మహిళా దినోత్సవం సందర్భంగా దీన్ని స్మరించుకోవడం సందర్భోచితం!


అంబులెన్స్‌ తాళాలందుకొని..!

మహిళా దినోత్సవం సందర్భంగా కొందరు మహిళలకు కొత్త బాధ్యతలు అప్పగించి తమ మహిళల శక్తియుక్తుల్ని చాటుతాయి కొన్ని ప్రభుత్వాలు. ఈ విషయంలో కేరళ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పచ్చు. ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకొని దీపామోల్‌ అనే మహిళను అంబులెన్స్‌ (KANIV – 108) డ్రైవర్‌గా నియమించి, ఆ బాధ్యతల్ని అప్పగించింది కేరళ ప్రభుత్వం. ఇలా ఆ రాష్ట్రంలోనే తొలి మహిళా అంబులెన్స్‌ డ్రైవర్‌గా ఘనత సాధించారు దీప. డ్రైవింగ్‌పై మక్కువతో 2008లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన ఆమె.. 2009లో భారీ వాహనాలు (ట్యాక్సీల దగ్గర్నుంచి టిప్పర్ల దాకా) నడపడంలోనూ లైసెన్స్ పొందారు.

ప్రస్తుతం ఓ డ్రైవింగ్ స్కూల్‌ నడిపిస్తోన్న దీప.. 2021లో 16 రోజుల పాటు కొట్టాయం నుంచి లఢక్‌ వరకు ద్విచక్రవాహన యాత్ర చేశారు. అంతేకాదు.. త్రిస్సూర్‌లో నిర్వహించిన ఆఫ్‌-రోడ్‌ డ్రైవింగ్‌ పోటీలో గెలుపొందారు. గతంలో తన భర్తకు ఆరోగ్యం బాగోలేని సమయంలోనూ కుటుంబ బాధ్యతల్ని భుజాన వేసుకున్నారు. విమెన్స్‌ డే సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ చేతుల మీదుగా అంబులెన్స్‌ తాళాలు అందుకున్న దీప.. కొట్టాయంలో విధులు నిర్వహించనున్నారు.

సెల్యూట్‌ విమెన్!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్