Eve Teasing : ఎక్కడ అన్యాయం జరిగితే.. అక్కడ వీళ్లుంటారు
close
Published : 21/11/2021 13:14 IST

Eve Teasing : ఎక్కడ అన్యాయం జరిగితే.. అక్కడ వీళ్లుంటారు!

బస్టాండ్లు, షాపింగ్‌ మాల్స్‌, స్కూళ్లు/కాలేజీ గేటు వెలుపల, సినిమా థియేటర్స్‌.. అమ్మాయిల్ని ఆటపట్టించే ఆకతాయిలకు ఈ ప్రదేశాలే హాట్‌స్పాట్లు. తమనెవరూ పట్టించుకోరన్న ధీమాతో వీళ్ల వేధింపులకు ఓ హద్దూ అదుపూ లేకుండా పోతోంది. అయితే ఇలాంటి పోకిరీల పని పట్టడానికి ఇటీవలే రంగంలోకి దిగింది ‘వీరా స్క్వాడ్‌’. సెంట్రల్‌ దిల్లీ వేదికగా ప్రారంభమైన ఈ పెట్రోలింగ్‌ కార్యక్రమానికి కొంతమంది మహిళల బృందం ప్రాతినిథ్యం వహిస్తోంది. మహిళలపై జరుగుతోన్న హింసకు అడ్డుకట్ట వేసే ముఖ్యోద్దేశంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. ఏ సమయంలోనైనా నిర్భయంగా బయటికొచ్చి తమ పనులు చేసుకునే భరోసాను స్త్రీలకు అందిస్తోంది. ఇలా మహిళలకు స్నేహ హస్తం అందిస్తూనే.. వారి రక్షణకు పాటుపడుతోన్న ఇలాంటి ఇనీషియేటివ్స్‌ మరికొన్ని రాష్ట్రాల్లోనూ అమలవుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..

వీధుల్లో గస్తీ కాస్తూ..!

దిల్లీ గల్లీల్లో మహిళలపై జరిగే వేధింపులు/ఈవ్‌ టీజింగ్‌కు అడ్డు కట్ట వేయాలన్న ముఖ్యోద్దేశంతో ఇటీవలే ‘వీరా స్క్వాడ్‌’ పేరుతో ఓ పెట్రోలింగ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అక్కడి పోలీసులు. సెంట్రల్‌ దిల్లీ వేదికగా చేపట్టిన ఈ ఇనీషియేటివ్‌లో భాగంగా కొంతమంది మహిళా పోలీసుల్ని ఎంపికచేసి.. వారికి స్కూటీలు అందించారు. ఒక్కో స్కూటీపై ఇద్దరు చొప్పున కూర్చొని.. షాపింగ్‌ మాల్స్‌, స్కూల్స్‌/కాలేజీలు, బస్టాండ్లు, మాల్స్‌.. ఇలా ఈవ్‌టీజింగ్‌కి ప్రధాన కేంద్రాలైన ప్రాంతాల్లో గస్తీ కాస్తుంటారు. ఫలితంగా ఇలాంటి పోకిరీలను సత్వరమే కనిపెట్టి వారి పని పట్టచ్చని చెబుతున్నారు అక్కడి డీసీపీ శ్వేతా ఛౌహాన్‌.

ఇటీవలే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె.. ‘మహిళా పోలీసులు వీధుల్లో తిరుగుతూ పహారా కాస్తుంటే ఆకతాయిల గుండెల్లో ఏదో తెలియని భయం మొదలవుతుంది. తద్వారా మహిళలపై ఈవ్‌ టీజింగ్‌, ఇతర వేధింపులు క్రమంగా తగ్గుతాయి. ఫలితంగా స్త్రీలు కూడా ఏ సమయంలోనైనా ధైర్యంగా బయటికి వచ్చి తమ పనుల్ని చక్కబెట్టుకోగలుగుతారు. ప్రస్తుతం ఈ స్క్వాడ్‌లో 40 మంది మహిళా పోలీసులు రాత్రింబవళ్లు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు..’ అంటూ చెప్పుకొచ్చారామె.

అండగా మరో రెండు!

* ఇక వీధుల్లో మహిళలపై జరిగే నేరాల్ని అరికట్టడానికి ‘ప్రశక్తి బీట్‌ స్టాఫ్‌’ పేరుతో సెంట్రల్‌ దిల్లీ వేదికగా మరో కార్యక్రమానికి తెరలేపింది దిల్లీ పోలీస్‌ శాఖ. ఇందులో భాగంగా అక్కడి ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ఓ ప్రశక్తి బీట్‌ (మహిళా పోలీసులు గస్తీ తిరిగే ప్రాంతం)ను ఏర్పాటుచేసింది. మహిళా పోలీసులు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఈ బీట్‌లో భాగంగా.. నేరస్థుడిని పట్టుకోవడం, వెరిఫికేషన్‌, విచారించడం.. ఇలా అన్ని బాధ్యతలు ఆ బీట్‌లోని మహిళా పోలీసులే నిర్వర్తిస్తారు.

* మహిళలు తమపై జరిగే హింస, ఇతర వేధింపుల గురించి ఫిర్యాదు చేసేందుకు వీలుగా అక్కడి కరోల్‌ బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ‘పింక్‌ బూత్‌’ కూడా ఏర్పాటైంది. నలుగురు మహిళా పోలీసులు, ఒక మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇక్కడ విధులు నిర్వర్తిస్తారు. స్త్రీలు, బాలికల దగ్గర్నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని సత్వరమే పరిష్కరించి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే దీని విధి.

 

మారువేషంలో.. నిఘా నేత్రంతో!

(Photo: Facebook)

రద్దీ ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై ఈవ్‌ టీజింగ్‌, ఇతర వేధింపుల్ని నివారించడానికి అమృత్‌సర్‌ పోలీసులు ‘శక్తి టీమ్స్‌’ పేరుతో సెప్టెంబర్‌లో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఒక టీమ్‌లో ఇద్దరు ఆడ పోలీసులు, ఒక మగ పోలీస్‌ ఉంటారు. వారు మారువేషంలో (సివిల్‌ డ్రస్‌) స్కూటీలపై వీధులు, స్కూళ్లు, కాలేజీలు, ప్రయాణ ప్రాంగణాలు, మాల్స్‌.. వంటి హాట్‌స్పాట్‌లలో గస్తీ కాస్తుంటారు. నేరస్థుల్ని వెంటనే పట్టుకొని సరైన సాక్ష్యాధారాలతో సత్వరమే నేరం నిరూపించేందుకు వీలుగా ఓ స్పై కెమెరాను సైతం తమ దుస్తులకు అమర్చుకుంటారు. ఇలా త్వరగా శిక్షలు అమలవడం వల్ల నేరాలు సైతం క్రమంగా తగ్గుతాయంటున్నారు అక్కడి పోలీసులు.

 

ఆఫ్‌లైనే కాదు.. ఆన్‌లైన్‌ కూడా!

మహిళలపై ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ వేధింపులకు అడ్డుకట్ట వేసే ముఖ్యోద్దేశంతో ఈ ఏడాది జులైలో ‘పింక్‌ ప్రొటెక్షన్‌’ పేరుతో ఓ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టింది కేరళ పోలీస్‌ శాఖ. ఇందుకోసం 10 కార్లు, 40 ద్విచక్ర వాహనాలు, మరికొన్ని బుల్లెట్‌ బైక్స్‌, సైకిల్స్‌ కేటాయించింది. వరకట్న వేధింపులు, సైబర్‌ నేరాలు, పబ్లిక్‌ ప్రదేశాల్లో మహిళలపై అఘాయిత్యాలు/వేధింపుల్ని అరికట్టడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం.

* ఇందులో ‘పింక్‌ జనమైత్రి బీట్‌’ అనేది ఒక భాగం.. వరకట్న వేధింపుల గురించి పంచాయతీ సభ్యులు రోజూ ప్రతి ఇంటికి వెళ్లి సమాచారం సేకరించడం, వాటిని బీట్‌లోని ఆఫీసర్‌కి అందించడం, వాటిపై సత్వరమే స్పందించి విచారించడం.. వంటివి ఇక్కడ విధిగా జరుగుతుంటాయి.

* అలాగే స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో గస్తీ కాసేందుకు ‘పింక్‌ బీట్‌ సిస్టమ్‌’ పేరుతో కొంతమంది మహిళా పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మరోవైపు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమ పర్యవేక్షణ కోసం ‘పింక్‌ కంట్రోల్‌ రూమ్స్‌’ సైతం ఏర్పాటు చేశారు.

* అంతేకాదు.. ప్రాజెక్ట్‌లో భాగంగా ‘పింక్‌ రోమియో’ పేరుతో మహిళా పోలీసు అధికారులతో కూడిన బుల్లెట్‌ పెట్రోలింగ్‌ బృందాన్ని కూడా ప్రారంభించారు.

 

‘షీ టీమ్స్‌’తో మొదలెట్టి..!

అయితే వీటన్నింటి కంటే ముందు దేశంలో మహిళల రక్షణ కోసం నడుం బిగించింది మాత్రం మన హైదరాబాద్‌ పోలీసులే అని చెప్పచ్చు. ఎందుకంటే రద్దీ ప్రదేశాల్లో మహిళలపై ఈవ్‌ టీజింగ్‌, గృహ హింస, బాల్య వివాహాల్ని అరికట్టడానికి 2014లోనే ‘షీ టీమ్స్‌’ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐపీఎస్‌ శిఖా గోయెల్‌ సారథ్యంలో (ప్రస్తుత పర్యవేక్షకురాలు) ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం స్వాతి లక్రా హెడ్‌గా కొనసాగుతున్నారు. నేరాల రేటును అరికట్టడంలో Decoy Operations (పోలీసు అధికారులు మారువేషంలో పాదచారుల మార్గాన్ని దాటుతున్నప్పుడు ఇతర రహస్య అధికారులు వారి ప్రయత్నాలను గమనించడం), షీ షెటిల్స్‌ (మహిళా ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రయాణ సదుపాయం), కౌన్సెలింగ్‌ సేవలు.. వంటివి ప్రభావవంతంగా నిర్వహిస్తున్నారు.

* వీటితో పాటు HawkEye యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయాణాల్లో ఉన్న మహిళల రక్షణకు ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. అసురక్షిత ప్రదేశాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు.. ఈ యాప్‌ను Enable చేస్తే.. పోలీస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌ నిరంతరం మీ ప్రయాణాన్ని పర్యవేక్షిస్తుంది. తద్వారా మీకు ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే వెంటనే వాళ్లు స్పందించి మిమ్మల్ని రక్షించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యాప్‌లో ఆఫ్‌లైన్‌ SOS బటన్‌ ఆప్షన్‌ ఉంటుంది. అవసరమైనప్పుడు దీన్ని నొక్కినా సత్వరమే వాళ్లకు సమాచారం అందుతుంది.

* హింస, లైంగిక వేధింపులకు గురైన మహిళలు, పిల్లల కోసం.. పోలీసు, వైద్యం, కౌన్సెలింగ్‌, చట్టపరమైన సేవల్ని అందించడానికి ‘భరోసా’ పేరుతో 2016లో మరో కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా బాధితులు/బాధితుల కుటుంబ సభ్యులకు వాళ్ల అవసరాన్ని బట్టి రీహ్యాబిలిటేషన్‌, ఇతర రక్షణ చర్యల్ని చేపడుతుంది.

వీటితో పాటు మహిళల సౌకర్యార్థం SHE Toilets ని సైతం అందుబాటులోకి తెచ్చారు.

 

ఆపదలో ఆపన్నహస్తాలు!

అకస్మాత్తుగా ఆపద ఎదురైతే ఏం చేయాలో ఆ క్షణం మనకు తోచదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తోంది ‘దిశ’ యాప్‌. మహిళల రక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ యాప్‌ను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించింది. ఇది మొబైల్‌లో ఉంటే చాలు.. ఆపద సమయాల్లో మూడుసార్లు ఫోన్‌ని షేక్‌ చేస్తే.. ఆటోమేటిక్‌గా దగ్గర్లోని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి సందేశం వెళ్తుంది. లేదంటే ఈ యాప్‌లోని SOS బటన్‌ని ఒక్కసారి నొక్కినా మీరు ఆపదలో ఉన్నారన్న విషయం పోలీసులకు చేరుతుంది. అలాగే మనం ఫీడ్‌ చేసుకున్న ఐదు ఫోన్‌ నంబర్లకు అలర్ట్‌ పంపే ఆప్షన్‌ కూడా ఇందులో ఉంది. అంతేకాదు.. మరో ఆప్షన్‌ ‘Track My travel’ మీరు సురక్షితమైన మార్గం ద్వారా ప్రయాణించేలా మార్గనిర్దేశనం కూడా చేస్తుంది. 100, 112 వంటి అత్యవసర నంబర్లు, పోలీసు అధికారుల మొబైల్‌ నంబర్లు, దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌ సంబంధిత వివరాలు, ఆస్పత్రులు, మెటర్నిటీ సెంటర్లు, ట్రామా కేర్‌ సెంటర్లు, రక్తదాన కేంద్రాలు, మందుల షాపులు.. వంటి వివరాలన్నీ ఈ యాప్‌లో పొందుపరిచారు. ఇక మరోవైపు దిశ చట్టం కింద దిశ పోలీస్‌ స్టేషన్లు కూడా మహిళల రక్షణ కోసం పనిచేస్తున్నాయి.

ఇక ట్యాక్సీలు, ఆటోల్లో ప్రయాణించే మహిళలు, పిల్లల రక్షణ కోసం గతేడాది ‘అభయం’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. స్మార్ట్‌ఫోన్‌, సాధారణ ఫోన్‌ (కీప్యాడ్‌ ఫోన్లు)లలో సైతం పనిచేసే విధంగా ఈ యాప్‌ను రూపొందించారు. ఈ క్రమంలో యాప్‌ ఓపెన్‌ చేయకపోయినా.. పవర్‌ బటన్‌ని ఐదుసార్లు నొక్కితే.. పోలీసులకు, అందులో పొందుపరిచిన నంబర్లకు ప్యానిక్‌ నోటిఫికేషన్లు వెళ్తాయి. తద్వారా వాళ్లు త్వరగా స్పందించి ఆపద నుంచి తప్పించే వీలు కలుగుతుంది. ఒకవేళ మొబైల్‌ మర్చిపోయి వెళ్లినా.. ఆయా ఆటోలు, ట్యాక్సీల్లో అమర్చిన ట్రాకింగ్‌ డివైజ్‌ల ద్వారా పోలీసులకు ప్యానిక్‌ నోటిఫికేషన్లు పంపచ్చు.

ఇలా మహిళల రక్షణకు వివిధ రాష్ట్రాలు వేర్వేరు కార్యక్రమాలు రూపొందించి దిగ్విజయంగా వాటిని ముందుకు తీసుకెళ్తున్నాయి. అయినా కొన్ని చోట్ల మాత్రం స్త్రీలపై వేధింపులకు అడ్డుకట్ట పడట్లేదన్నది వాస్తవం. మరి, ఇలాంటి వేధింపులకు శాశ్వత పరిష్కారం కావాలంటే ఇంకా ఎలాంటి చర్యలు అవసరమంటారు? మీ అభిప్రాయాల్ని, సలహాల్ని మాతో పంచుకోండి!


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని