‘నా హీరోకి.. ప్రేమతో’ అంటూ..!

నాన్నంటే ఓ స్ఫూర్తి.. అడుగడుగునా ధైర్యాన్ని నింపే ఓ శక్తి! ఈ క్రమంలో- మీ జీవితంలో, మీ ఉన్నతిలో మీ నాన్న పోషించిన పాత్ర గురించి; ఆయనతో మీకున్న అనుబంధం గురించి పంచుకోమంటూ ‘ఈనాడు వసుంధర.నెట్' ఇచ్చిన పిలుపుకి ఎంతోమంది మహిళలు స్పందిస్తున్నారు.

Updated : 17 Jun 2024 14:23 IST

నాన్నంటే ఓ స్ఫూర్తి.. అడుగడుగునా ధైర్యాన్ని నింపే ఓ శక్తి! ఈ క్రమంలో- మీ జీవితంలో, మీ ఉన్నతిలో మీ నాన్న పోషించిన పాత్ర గురించి; ఆయనతో మీకున్న అనుబంధం గురించి పంచుకోమంటూ ‘ఈనాడు వసుంధర.నెట్' ఇచ్చిన పిలుపుకి ఎంతోమంది మహిళలు స్పందిస్తున్నారు.. తమ తండ్రితో తమకున్న అనుబంధాన్ని, మరిచిపోలేని జ్ఞాపకాల్ని.. ‘నా హీరోకి.. ప్రేమతో!’ అంటూ గుర్తు చేసుకుంటున్నారు. మరి నాన్న గురించి వాళ్లేమంటున్నారో.. వాళ్ల మాటల్లోనే తెలుసుకుందాం రండి..!

‘ఆడపిల్లకు చదువెందుకు?’ అన్నా..! - చెన్నమ్మ, బెంగళూరు

అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నాన్నే నా హీరో! నేను ఒక రైతు కూతురిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా. వివిధ కారణాల వల్ల నాన్న చదువుకోకపోయినా.. నన్ను పైచదువులు చదివించారు. ఇందుకు ఎంతగానో కష్టపడ్డారు. మా గ్రామం నుంచి ఎంసీఏ చదివి, సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడ్డ మొదటి అమ్మాయిని నేను. ఇదంతా నాన్న ప్రోత్సాహం వల్లే సాధ్యమైంది. ‘ఆడపిల్లకు చదువెందుకు?’ అని చాలామంది బంధువులు నాన్నపై ఒత్తిడి తెచ్చినా.. వాటికి ఆయన తలొగ్గలేదు. ప్రస్తుతం నేను ఓ ప్రముఖ ఎమ్మెన్సీలో మేనేజర్‌ స్థాయిలో ఉన్నా. ‘ఉత్తమ ఐటీ ఉద్యోగి’గా అవార్డు కూడా అందుకున్నా. ఇలా చదువులోనే కాదు.. నాకు ఆటల్లోనూ ఆసక్తి ఉందని గుర్తించి.. ఈ దిశగానూ నన్ను ప్రోత్సహించారు మా నాన్న. జాతీయ స్థాయిలో ఖో-ఖో క్రీడాకారిణిగా, రాష్ట్ర స్థాయిలో కబడ్డీ ప్లేయర్‌గా పలు పతకాలూ అందుకున్నా. క్రమశిక్షణ, విలువల్ని నేర్పించడమే కాదు.. కెరీర్‌లోనూ నన్ను నేను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేలా ప్రోత్సహించిన నాన్నకు నేనేమివ్వగలను? అమితమైన ప్రేమ తప్ప! లవ్యూ నాన్నా!


పునర్జన్మనిచ్చాడు..! - ఎల్‌. సౌజన్య, విజయవాడ

ఎన్ని కష్టాలున్నా గుండె దిటవు చేసుకొని.. బయటికి ధైర్యంగా కనిపించే నాన్న.. పిల్లలకు కష్టం వచ్చిందంటే మాత్రం విలవిల్లాడిపోతాడు. అలా మా నాన్న ఎమోషనల్‌ అయిన ఓ సంఘటనను మీతో పంచుకుంటున్నా. ఒక రోజు రాత్రి అనుకోకుండా నాకు ఆరోగ్య సమస్య వచ్చింది. ఆ క్షణం ఊపిరి తీసుకోవడం కష్టమైంది. సమయానికి బైక్‌ కూడా అందుబాటులో లేదు. దాంతో నాన్నే నన్ను ఎత్తుకొని ఆస్పత్రికి పరిగెత్తాడు. సమయానికి చికిత్స అందడంతో ప్రాణాపాయం తప్పింది. నాన్న వల్లే ఆ రోజు గండం గట్టెక్కింది. ఆ రోజు నాన్న కళ్లలో కనిపించిన బాధ, ఆవేదన నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే తను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎంతో ధైర్యంగా ఉంటారు. బాధనీ మౌనంగా భరిస్తారు. మా నానమ్మ చనిపోయినప్పుడూ కన్నీళ్లను దిగమింగుకొని ధైర్యం ప్రదర్శించారు. అలాంటిది ఆ రోజు నాన్న నా కోసం ఏడవడం నేనెప్పటికీ మర్చిపోలేను. ఇది గుర్తొచ్చినప్పుడల్లా నేనూ ఎమోషనల్‌ అవుతుంటా. ఒక కూతురిపై తండ్రికున్న ప్రేమకు నిదర్శనమిది!


ఈ ధైర్యం.. నాన్నిచ్చిందే! - జానకి, హైదరాబాద్

అమ్మ జన్మనిస్తే, నాన్న జీవితాన్నిస్తాడంటారు.. మా నాన్నే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ! నాన్నతో నాకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. నా ప్రతి అడుగులో, విజయంలో, ఉన్నతిలో ఆయన ప్రోత్సాహం, స్ఫూర్తి దాగున్నాయి. ఆయనలో నాకు బాగా నచ్చిన అంశం.. తన పాజిటివ్‌ మనస్తత్వం! ఎలాంటి సందర్భంలోనైనా సరే.. ప్రతికూల ఆలోచనలు తన మనసులోకి రానివ్వరు. శత్రువులో కూడా మంచితనాన్ని చూసే గొప్ప వ్యక్తి మా నాన్న. నేనూ తనలా సానుకూల దృక్పథంతో, ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నా. ‘అమ్మాయిలు బాగా చదువుకోవాలి.. ఉద్యోగాలు చేయాలి.. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలి.. ధైర్యంగా ఉండాలి..’ అని నాన్న ఎప్పుడూ చెబుతుంటారు. నన్నూ అలాగే పెంచారు. ఈరోజు నేను ఉద్యోగం చేస్తూ.. స్వతంత్రంగా, ఒక శక్తిమంతమైన మహిళగా రాణించగలుగుతున్నానంటే అదంతా నాన్న చలవే! ఆయన రుణం తీర్చుకోలేనిది. హ్యాపీ ఫాదర్స్‌ డే!!


నాన్న చూపిన బాటలోనే..! - సంబారి సృజన, పెద్దపల్లి

అరచేతుల్లో అపురూపంగా పెంచి.. ప్రతి ఒక్కరి పట్ల సహృదయ భావనతో మెలగాలంటూ మంచి మాటలు నేర్పించారు మా నాన్న. ఎప్పుడూ సమాజ సేవ చేయాలని ఆరాటపడేవారు. అలాంటి తను మా మధ్య భౌతికంగా లేడన్నది పూడ్చుకోలేని లోటే! అయినా ఆయనిచ్చిన విలువలు, చూపిన మార్గం.. ఇవే నాకు ప్రతి క్షణం స్ఫూర్తినిస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా నాన్న నన్ను ఉన్నత చదువులు చదివించారు. ఆయన ప్రోత్సాహంతోనే ఎంబీబీఎస్ చదివి  డాక్టర్‌నయ్యా. కొవిడ్‌ సమయంలో ఎంతోమందికి సేవలందించా. నాన్న నింపిన ఈ సేవా గుణమే ఆ క్షణం నాకెంతో సంతృప్తినిచ్చింది. అందుకే జీవితాంతం ఆయన చూపిన బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నా. ఓ డాక్టర్‌గా నా చుట్టూ ఉన్నవారికి వైద్య సేవలందిస్తున్నా. వాళ్లలో నా తండ్రిని చూసుకొని మురిసిపోతున్నా.. ‘నువ్విచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగుతుంటే ఎక్కడున్నా నువ్వు నాతోనే ఉన్నావన్న భావన కలుగుతుంది.. మిస్‌ యూ డాడ్’!


నేనూ నాన్న స్టూడెంట్‌నే! - శైలజారాణి, హైదరాబాద్

టీచర్‌లా, లీడర్‌లా, మెంటార్‌లా, గైడ్‌గా, శ్రేయోభిలాషిగా.. ఇలా నా జీవితంలో మా నాన్న పోషించిన పాత్రలెన్నో! ఉద్యోగాన్వేషణ కోసం 70ల్లోనే ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డ ఆయన.. రెండేళ్లు కష్టపడి టైప్, షార్ట్‌హ్యాండ్ నేర్చుకున్నారు. ఆపై ఓ సంస్థలో సెక్రటరీగా ఉద్యోగం సంపాదించారు. టీచింగ్‌ అంటే ఆయనకు ప్రాణం. అందుకే అటు ఉద్యోగం చేస్తూనే.. ఇటు ఎంతోమందికి టైపింగ్‌ మెలకువలు నేర్పుతున్నారు. నేనూ నాన్న వద్దే ఇందులో శిక్షణ తీసుకొని ప్రభుత్వోద్యోగం సంపాదించా. దిల్లీలో పీఐబీ ఆఫీస్‌లో స్టెనోగ్రాఫర్‌గా స్థిరపడ్డా. మా కుటుంబంలో ప్రభుత్వోద్యోగం సంపాదించిన మొదటి అమ్మాయిని నేనే..! అందులోనూ మా నాన్న దగ్గర శిక్షణ తీసుకొని ప్రభుత్వోద్యోగం సంపాదించిన తొలి స్టూడెంట్‌నీ నేనే అయినందుకు గర్వంగా ఉంది. ఇదంతా నాన్న ప్రోత్సాహం వల్లే సాధ్యమైంది. నాన్న దగ్గర శిక్షణ తీసుకొని రైల్వే, ఐటీ శాఖ, హైకోర్టు, జిల్లా కోర్టుల్లో స్టెనోగ్రాఫర్లుగా ప్రభుత్వోద్యోగం సంపాదించిన వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో అమ్మాయిలే ఎక్కువ. ప్రస్తుతం 74 ఏళ్ల వయసులో ఉన్నా.. ఆన్‌లైన్‌లో టైపింగ్ శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి తండ్రికి కూతురినైనందుకు గర్వపడుతున్నా.. థ్యాంక్యూ డాడ్!

ఇలా మరెంతోమంది మహిళలు తమ తండ్రులతో తమకున్న అనుబంధాన్ని, తమ విలువైన అభిప్రాయాల్ని ‘నా హీరోకి.. ప్రేమతో!’ శీర్షిక వేదికగా పంచుకుంటున్నారు. మరి అవేంటో చదివేసి, మీరూ మీ నాన్న గురించి మీ మాటల్లో పంచుకోండి..!

నా హీరోకి.. ప్రేమతో..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్