పెళ్లైనా.. మారక్కర్లేదు!

పెళ్లయ్యాక అమ్మాయిల జీవితంలో చాలా మార్పులొస్తాయంటారు. భర్త, అత్తింటి వాళ్ల ఒత్తిడితో కొన్ని, గొడవలెందుకన్న ఉద్దేశంతో తమకు తామే కొన్ని త్యాగాలు చేయడం.. ఇలాంటి వాటి వల్ల కొంతమంది మహిళలు తమ సొంత గుర్తింపును కోల్పోతుంటారు.

Published : 10 Sep 2023 14:03 IST

పెళ్లయ్యాక అమ్మాయిల జీవితంలో చాలా మార్పులొస్తాయంటారు. భర్త, అత్తింటి వాళ్ల ఒత్తిడితో కొన్ని, గొడవలెందుకన్న ఉద్దేశంతో తమకు తామే కొన్ని త్యాగాలు చేయడం.. ఇలాంటి వాటి వల్ల కొంతమంది మహిళలు తమ సొంత గుర్తింపును కోల్పోతుంటారు. అయితే ఇలా ప్రతి విషయంలో సర్దుకుపోవడం, మార్పులు చేసుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం తగ్గే అవకాశాలే ఎక్కువంటున్నారు నిపుణులు. దీనివల్ల శారీరకంగా, మానసికంగానూ పలు సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే పెళ్లయ్యాక కూడా అమ్మాయిలు కొన్ని విషయాల్లో మార్పులు చేసుకోకపోవడమే మేలంటున్నారు.

ఉద్యోగం.. మన ఇష్టం!

సమాజంలో మనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఇచ్చే అంశాల్లో వృత్తిఉద్యోగాలదీ కీలక పాత్రే! అయితే పెళ్లయ్యాక అత్తింటి వారి ఒత్తిడితో, ఇతర కారణాల రీత్యా కొంతమంది అమ్మాయిలు వీటికి దూరంగా ఉండాల్సి రావచ్చు. అది కూడా అయిష్టంగానే! ఈ క్రమంలో ఇతరుల ఇష్టాలకు విలువిచ్చి, మన ఇష్టాలను త్యాగం చేయడం ఎంతవరకు సమంజసం? అనేది ఆలోచించమంటున్నారు నిపుణులు. అందుకే ఈ విషయంలో మిమ్మల్ని మీరు బాధపెట్టుకునే బదులు.. ఉద్యోగం కొనసాగించే విషయంలో మీ భర్త, అత్తింటి వారి అభిప్రాయం పెళ్లికి ముందే తెలుసుకోండి. ఒకవేళ వాళ్లు ఒప్పుకోకపోతే.. ఆ సంబంధం విషయంలో పునరాలోచన చేయడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వృత్తిఉద్యోగాల విషయంలోనే మీ ఇష్టాలకు విలువివ్వని వారు.. ఆ తర్వాత ప్రతి విషయంలోనూ మిమ్మల్ని, మీ అభిప్రాయాల్ని గౌరవిస్తారన్న గ్యారంటీ ఏముంది?!

డ్రస్సింగ్..

తమకు నచ్చినా, నచ్చకపోయినా.. పెళ్లయ్యాక కొన్ని అభిరుచుల్ని మార్చుకుంటారు. డ్రస్సింగ్‌తో పాటు ఆహారపుటలవాట్లలోనూ మార్పులు చేసుకుంటుంటారు. నిజానికి దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గడంతో పాటు మనం ఏదైనా పొరపాటు చేస్తున్నామేమోనన్న భావనే మనల్ని ఎక్కువగా వేధిస్తుంటుంది. కాబట్టి అసభ్యంగా లేనంత వరకు అది ట్రెడిషనల్ అయినా, మోడ్రన్‌ అయినా చక్కటి డ్రస్సింగ్‌ సెన్స్‌ను కొనసాగించడం మంచిదంటున్నారు నిపుణులు. అంతగా అవసరమనిపిస్తే.. మీ అభిప్రాయాన్ని మీ భాగస్వామితో పంచుకొని వారిని ఒప్పించచ్చు. అలాగే ఆయా విషయాల్లో మీ భాగస్వామి అభిప్రాయాలకు కూడా విలువనివ్వడం వల్ల.. ఇద్దరి మధ్య అరమరికల్లేకుండా ముందుకెళ్లచ్చు.

ఫ్రెండ్స్‌.. స్ట్రెస్‌బస్టర్స్!

పెళ్లికి ముందు మనకంటూ ఓ ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌ ఉంటుంది. వీలు చిక్కినప్పుడల్లా వారితో సమయం గడుపుతూ బోలెడన్ని మధుర జ్ఞాపకాల్ని మూటగట్టుకుంటుంటాం. అయితే పెళ్లి తర్వాత ఒక్కసారిగా దీన్ని మార్చుకోవాలని చెప్పే హక్కు గానీ, అవతలి వారి కోసం మనకు మనమే మన స్నేహాన్ని త్యాగం చేసే అవసరం గానీ లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికైనా, శారీరక-మానసిక ఉల్లాసానికైనా.. మనకంటూ కొంత సమయం కేటాయించుకోవడం, నచ్చిన వారితో గడపడం ముఖ్యమంటున్నారు.

పెళ్లైనా.. బాధ్యత మారదు!

పెళ్లయ్యాక అమ్మాయి పుట్టింటి వారి గురించి పట్టించుకోవక్కర్లేదనే భావన ఇప్పటికీ కొంతమందిలో చూస్తుంటాం. నిజానికి ఇలాంటి ఆంక్షల వల్ల కొడుకులు లేని తల్లిదండ్రుల బాగోగులు చూసే వారే కరువవుతుంటారని చెప్పచ్చు. కానీ ఇలా ఆలోచించే సమాజాన్ని పక్కన పెట్టి.. పెళ్లైనా అమ్మాయిలు తమ పూర్వ బాధ్యతల్ని కొనసాగించడమే మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో తల్లిదండ్రుల బాధ్యత చూసుకోవడం, వృద్ధాప్యంలో వారిని చేరదీయడం, ఆర్థికంగా మీకున్న బాధ్యతల్ని కొనసాగించడం (ఉదాహరణకు.. పొదుపు, రుణాలు చెల్లించడం.. వంటివి).. మొదలైన విషయాల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ విషయాల్లో పెళ్లయ్యాక తగాదాలు రాకుండా ఉండాలంటే.. మీ భాగస్వామితో ముందే మాట్లాడి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

ఆ విషయంలోనూ..

పెళ్లయ్యాక చాలామంది అమ్మాయిల ఇంటి పేరు మారుతుంటుంది. ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతోన్న పద్ధతి. అయితే ఇప్పుడు కొంతమంది పెళ్లైనా తమ తల్లిదండ్రుల ఇంటి పేరునే ప్రతి చోటా ఉపయోగిస్తున్నారు. ఇక మరికొందరు.. తమ పూర్తి పేరు వెనక తమ భర్త పేరు లేదంటే అత్తింటి వారి ఇంటి పేరును చేర్చుకుంటున్నారు. సెలబ్రిటీలే కాదు.. సామాన్యులూ ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను కొనసాగించడం చూస్తూనే ఉన్నాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్