సైబర్ సెక్యూరిటీలోనూ ఆరితేరుతున్నారు!

ఇలాంటి సైబర్ సంఘ విద్రోహ శక్తులతో నిరంతరం పోరాటం చేస్తున్నారు కొందరు మహిళలు. సైబర్‌ భద్రతే ధ్యేయంగా వ్యక్తిగత, సంస్థల సమాచార రక్షణకు ఓ భరోసా అందిస్తున్నారు. నిజానికి సైబర్‌ సెక్యూరిటీలో ప్రస్తుతం మహిళల సంఖ్య కేవలం 24 శాతమే....

Updated : 16 Sep 2022 20:58 IST

(Photo: Twitter)

ఓ అందమైన ఫొటో ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకోవాలంటే భయం.. ఎవరు ఏ వైపు నుంచి దొంగిలించి దాన్ని మార్ఫింగ్‌ చేస్తారోనని!

ఆన్‌లైన్‌ లావాదేవీల రూపంలో పెద్ద మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది.. కారణం.. మన కష్టార్జితాన్ని దొంగిలించడానికి సైబర్‌ నేరగాళ్లు కాచుక్కూర్చున్నారని!

ఇవే కాదు.. మనల్ని నమ్మబలికి మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించాలని చూసే ఫేక్‌ ఈ-మెయిల్‌, టెక్ట్స్‌ సందేశాలకు నెట్టింట్లో కొదవే లేదు.

వ్యక్తిగతంగానే కాదు.. వివిధ సంస్థలకు సైతం సైబర్ భద్రతకు సంబంధించి సవాళ్లెన్నో..!

ఇలాంటి సైబర్ సంఘ విద్రోహ శక్తులతో నిరంతరం పోరాటం చేస్తున్నారు కొందరు మహిళలు. సైబర్‌ భద్రతే ధ్యేయంగా వ్యక్తిగత, సంస్థల సమాచార రక్షణకు ఓ భరోసా అందిస్తున్నారు. నిజానికి సైబర్‌ సెక్యూరిటీలో ప్రస్తుతం మహిళల సంఖ్య కేవలం 24 శాతమే అని తాజా సర్వే చెబుతోంది. కానీ ఇప్పుడిప్పుడే ఈ సంఖ్యలో పురోగతి కనిపిస్తోంది. ఏదేమైనా చాలా రంగాల్లో లాగే ఇందులోనూ పురుషాధిపత్యాన్ని జయించి.. సైబర్ సెక్యూరిటీలోనూ ఆరితేరుతున్న కొందరు మహిళా నిపుణుల గురించిన ప్రత్యేక కథనం ఇది!


అడ్వొకేట్‌ పునీత్‌ భాసిన్

విభిన్న కెరీర్‌ను ఎంచుకోవాలి.. అందులో ప్రత్యేకంగా రాణించాలన్న కల కొంతమందికి ఉంటుంది. ముంబయికి చెందిన పునీత్‌ భాసిన్‌ అదే కోవకు చెందుతుంది. కళాశాలలో ఉన్నప్పుడు కంప్యూటర్‌ కోడింగ్‌పై మక్కువ పెంచుకున్న ఆమె.. ఆపై న్యాయవాద వృత్తిలో స్థిరపడాలని నిర్ణయించుకుంది. ఇక అందులోనే సైబర్‌ లాను ఎంచుకుంది. ఈ విభాగంలో పీజీ పూర్తిచేసిన ఆమె.. సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌, ప్రైవసీ ప్రొఫెషన్లో నిపుణురాలు. సైబర్‌ నేరాల్ని తగ్గించడంపై హార్వర్డ్‌ యూనివర్సిటీలో ప్రత్యేక కోర్సు చేశారామె. భారత్‌లో సాంకేతిక చట్టాలకు ఆద్యురాలిగా పునీత్‌ను పేర్కొంటారు. ముంబయి వేదికగా ‘సైబర్‌జ్యూర్‌ లీగల్‌ కన్సల్టింగ్‌’ సంస్థను స్థాపించిన ఆమె.. సాంకేతిక, వినోద, మీడియా చట్టాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

దేశంలో ఇంటర్నెట్‌ చట్టాలు, సాంకేతిక చట్టాల రూపకల్పన కోసం రాజ్యసభ వేసిన కమిటీకి సలహాదారుగా ఉన్నారు పునీత్‌. అంతేకాదు.. సమాచార రక్షణ ఫ్రేమ్‌వర్క్‌పై ‘ఎలక్ట్రానిక్స్‌-సమాచార మంత్రిత్వ శాఖ’కు సలహాలిచ్చే ప్రత్యేక కమిటీలోనూ భాగమయ్యారామె. గత మూడేళ్లుగా ‘సైబర్‌ సెక్యూరిటీ టాస్క్‌ ఫోర్స్‌’ సభ్యురాలిగానూ కొనసాగుతున్నారు. కార్పొరేట్‌, ఐటీ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటుచేసే కార్యక్రమాల్లో సైబర్‌ చట్టాలపై ఉపన్యాసాలిస్తుంటారు పునీత్‌. మరోవైపు సైబర్‌ చట్టాలు, ఇందులో ఉన్న సమస్యల గురించి వ్యాసాలు కూడా రాస్తుంటారామె. ఈ మధ్య బాగా వినిపిస్తున్న క్రిప్టోకరెన్సీ, బ్లాక్‌చెయిన్‌, ఇతర చట్టపరమైన అంశాల అమలుపై జాతీయ బ్యాంకులకు పలు సలహాలు కూడా అందిస్తున్నారు పునీత్‌. సైబర్‌ చట్టాలు-భద్రత విషయంలో ఆమె చేస్తోన్న కృషికి గుర్తింపుగా 2017లో ‘ఉమన్‌ లాయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-సైబర్‌ లాస్‌’ అవార్డుతో పాటు మరికొన్ని పురస్కారాలు కూడా అందుకున్నారామె.


వందనా వర్మ

అప్లికేషన్‌ సెక్యూరిటీ దగ్గర్నుంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, క్లౌడ్‌ సెక్యూరిటీ.. వంటి అంశాల్లో తనకున్న పూర్వానుభవంతో ప్రస్తుతం DevSecOps అనే అప్లికేషన్‌ సెక్యూరిటీపై దృష్టి సారించింది బెంగళూరుకు చెందిన వందనా వర్మ. విప్రో, ఐబీఎం, యాక్సెంచర్‌.. వంటి మేటి ఐటీ కంపెనీల్లో 17 ఏళ్లకు పైగా పనిచేసి సుదీర్ఘ అనుభవం గడించిందామె. తను మంచి వక్త, ట్రైనర్‌ కూడా! జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే సైబర్‌ సెక్యూరిటీ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగిస్తుంటుందామె. OWASP (వెబ్‌ అప్లికేషన్‌ సెక్యూరిటీ కోసం పనిచేస్తోన్న ఆన్‌లైన్‌ కమ్యూనిటీ ఇది) అనే స్వచ్ఛంద సంస్థ గ్లోబల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో వందన ఒకరు. InfosecGirls, InfosecKids మొదలైన ఆన్‌లైన్ కమ్యూనిటీలలో కీలక పాత్ర పోషిస్తూ- సైబర్ సెక్యూరిటీకి సంబంధించి విద్యార్థినులు, మహిళలు, పిల్లలు,  పేరెంట్స్ లో అవగాహన పెంపొందించి సైబర్ మోసాలు, నేరాల విషయంలో వారిని చైతన్యవంతుల్ని చేస్తోంది వందన. ఇలా ఆన్‌లైన్‌ సమాచార భద్రత పట్ల తన కృషికి గుర్తింపుగా 2020లో ‘సైబర్‌ సెక్యూరిటీ ఉమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకుంది. అలాగే గ్లోబల్‌ సెక్యూరిటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ‘వైట్‌సోర్స్‌’ వందనను ‘అప్లికేషన్‌ సెక్యూరిటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌-2020’ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం ‘Synk’ అనే సంస్థలో ‘సెక్యూరిటీ సొల్యూషన్స్‌ ఆర్కిటెక్ట్‌’గానూ కొనసాగుతోందీ సైబర్‌ లేడీ.


సత్యవతి దివదారి

‘అత్యుత్తమమైన పనితనాన్ని అలవాటుగా మార్చుకున్నప్పుడే విజయం సాధించగలం’ అంటారు బెంగళూరుకు చెందిన సైబర్‌ సెక్యూరిటీ నిపుణురాలు సత్యవతి దివదారి. ఒక దర్జీ కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు.. సైబర్‌ భద్రత కెరియర్‌లో 22 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈ క్రమంలో ఐటీ, ఐటీఈఎస్‌, టెలికాం, బీపీఓ.. వంటి ఎన్నో సంస్థలతో కలిసి పనిచేశారామె. సైబర్‌ భద్రత, సమాచార గోప్యత, ఎంటర్‌ప్రైజ్‌ ఆర్కిటెక్చర్‌, ఫ్రాడ్‌ మేనేజ్‌మెంట్‌, ప్రాజెక్ట్‌ నిర్వహణ, ఆడిటింగ్‌.. వంటి ఎన్నో అంశాల్లో నైపుణ్యం ఆమె సొంతం. ప్రస్తుతం ‘మైక్రో ఫోకస్‌’ అనే ఐటీ సంస్థలో భాగమైన ఆమె.. ఈ క్రమంలో ఎన్నో క్లిష్టమైన సెక్యూరిటీ ప్రాజెక్టులను సమర్థంగా పూర్తి చేస్తున్నారు. దేశంలో ఉన్న టాప్‌-20 సెక్యూరిటీ ఇన్‌ఫ్లుయెన్సర్లలో ఒకరిగా పేరు పొందిన సత్యవతి మంచి వక్త కూడా! జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సైబర్‌ భద్రతపై ప్రసంగిస్తూ ఎంతోమందిలో దీనిపై అవగాహన పెంచుతున్నారామె. ఇంటర్నెట్‌ సెక్యూరిటీలో తన కృషికి గుర్తింపుగా 2020లో ‘Wequity’ అవార్డు అందుకున్నారు సత్యవతి.


వీళ్లు కూడా!

❀ బెంగళూరుకు చెందిన అంజనా సత్యన్‌ ప్రస్తుతం ‘CloudSEK’ సంస్థలో కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. కృత్రిమ మేధతో రిస్క్‌ మానిటరింగ్‌ చేయడంలో ఈ కంపెనీ ప్రత్యేక సేవలందిస్తోంది. స్మార్ట్‌ఫోన్లలోని సమాచార గోప్యత, ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌లోని లోపాల్ని గుర్తించడం.. వంటి పలు అంశాల పైనా ప్రస్తుతం దృష్టి సారించిందామె.

❀ కర్ణాటకకు చెందిన మరో సైబర్‌ భద్రతా నిపుణురాలు అరుణిమా సాహా ఎలక్ట్రిక్‌ వాహనాలు, వాటి ఛార్జింగ్‌ స్టేషన్లకు సంబంధించిన సమాచార భద్రతపై పనిచేస్తోంది. ప్రస్తుతం ఆమె ‘రాబర్ట్ బాష్ ఇంజినీరింగ్‌ అండ్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌’ అనే సంస్థలో ఎథికల్‌ హ్యాకర్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్