Published : 02/10/2021 11:27 IST

అందుకే గర్భంతో ఉన్నప్పుడు కుంకుమ పువ్వు తీసుకోవాలట!

సాధారణంగా కుంకుమ పువ్వు అనగానే మనకు ముందుగా గర్భిణులే గుర్తుకొస్తారు. కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగితే పిల్లలు అందంగా, మంచి రంగుతో పుడతారని చాలామంది నమ్మకం. అయితే ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఇందులోని పోషకాలు మాత్రం బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. అదేవిధంగా ప్రెగ్నెన్సీ సమయంలో కలిగే వివిధ రకాల సమస్యలు, నొప్పులను తగ్గిస్తుందంటున్నారు. మరి కుంకుమ పువ్వును ఆహారంలో చేర్చుకోవడం వల్ల గర్భిణులకు ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఒకసారి తెలుసుకుందాం రండి.

మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది!

గర్భిణులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో మూడ్‌ స్వింగ్స్‌ ఒకటి. హార్మోన్లలో అసమతుల్యతతో పాటు శరీరంలోని కొన్ని మార్పులు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అప్పటికప్పుడు మూడ్ మారిపోతుంటుంది. విపరీతమైన కోపం, చికాకు, ఆందోళన వెంటాడుతుంటాయి. అయితే ఇలాంటి మూడ్‌ స్వింగ్స్‌ను దూరం చేయడంలో కుంకుమ పువ్వు అద్భుతంగా పని చేస్తుంది. కుంకుమ పువ్వులోని సెరటోనిన్‌ యాంటీ డిప్రెసెంట్‌లా పనిచేస్తుంది. ఇది శరీరంలో రక్త ప్రవాహాన్ని క్రమబద్ధీకరించి భావోద్వేగాలను నియంత్రిస్తుంది. ఫలితంగా మనసుకు ప్రశాంతత చేకూర్చుతుంది.

నిద్ర లేమి దూరం

గర్భంతో ఉన్న సమయంలో శరీరంలో కలిగే కొన్ని మార్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా పొట్ట పెరిగే కొద్దీ నొప్పులు తీవ్ర ఇబ్బంది పెడుతుంటాయి. ఫలితంగా సరిగా నిద్ర పట్టదు. ఇలాంటి సమస్యలు తగ్గిపోయి రాత్రి పూట సరిగా నిద్ర పట్టాలంటే గోరువెచ్చని పాలల్లో కాసిన్ని కుంకుమ పువ్వు రేకులను కలిపి తాగాలి. ఇది యాంగ్జైటీ లాంటి భావోద్వేగాలను నియంత్రించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఫలితంగా ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

తిమ్మిర్లను తగ్గిస్తుంది!

గర్భిణులను వేధించే మరో ప్రధాన సమస్య తిమ్మిర్లు. హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఈ సమస్య వస్తుంది. కొన్నిసార్లు ఈ సమస్య మామూలుగా ఉంటే మరికొన్ని సందర్భాల్లో తీవ్రమైన దురదతో భరించలేనివిగా ఉంటాయి. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం అందించడంలో పెయిన్‌ కిల్లర్‌గా పనిచేస్తుంది కుంకుమ పువ్వు. శరీరంలోని కండరాల నొప్పులను తగ్గించడంలో కూడా ఇది మెరుగ్గా పనిచేస్తుంది.

గుండె పనితీరును మెరుగుపరుస్తుంది!

గర్భిణులకు ఆహార కోరికలు (ఫుడ్‌ క్రేవింగ్స్‌) ఎక్కువగా ఉంటాయి. వివిధ రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల క్యాలరీలతో పాటు శరీరంలో కొవ్వుల శాతం పెరుగుతుంది. ఇది గుండె పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో కుంకుమ పువ్వులోని పోషకాలు శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తాయి. ఫలితంగా ధమనుల్లో రక్త ప్రసరణకు ఎలాంటి ఆటంకం ఉండదు. రక్తపోటు లాంటి సమస్యలు దరిచేరవు. శరీరంలో ఆక్సిజన్‌ స్థాయులు కూడా పెరుగుతాయి.

అలర్జీలను అడ్డుకుంటుంది!

గర్భంతో ఉన్నప్పుడు దగ్గు, జలుబు, తుమ్ములు లాంటి సీజనల్‌ అలర్జీలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీలో అసౌకర్యం తదితర సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో కుంకుమ పువ్వులోని వ్యాధి నిరోధక శక్తి గుణాలు ఈ అలర్జీల నుంచి రక్షణ కలిగిస్తాయి. అదేవిధంగా వివిధ అనారోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడతాయి.

రక్తహీనతను నిరోధిస్తుంది!

* గర్భిణుల్లో ఎసిడిటీ, కడుపుబ్బరం, మలబద్ధకం లాంటి జీర్ణక్రియ సమస్యలను తగ్గించడంలో కుంకుమ పువ్వు అద్భుతంగా పని చేస్తుంది.

* కుంకుమ పువ్వులో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల గర్భిణుల్లో హెమోగ్లోబిన్‌ లెవెల్స్ పెరిగి రక్తహీనతను నిరోధిస్తాయి.

* శరీరంలో ఎలక్ర్టోలైట్స్‌ను సమతుల్యం చేయడంలో పొటాషియం ప్రముఖ పాత్ర వహిస్తుంది. గర్భిణులకు కూడా ఇది ఎంతో అవసరం. కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయులు పెరుగుతాయి.

* గర్భం ధరించిన సమయంలో మొటిమలు, మచ్చలు తదితర సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. కుంకుమ పువ్వును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సాధ్యమైనంతవరకు ఈ సమస్యలను తగ్గించవచ్చు.

కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల గర్భిణులకు ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలిసిందిగా. అయితే దీనిని తగిన మోతాదులో తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ మొత్తంలో దీనిని తీసుకుంటే దుష్ర్ఫభావాలు తప్పవు. కాబట్టి మొదటిసారి కుంకుమ పువ్వును తీసుకునేముందు ఒకసారి వైద్యులను సంప్రదించడం ఎంతో ఉత్తమం.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని