కెరీర్లో ఎదగాలంటే ఇలా చేయండి!

ఉద్యోగంలో చేరామంటే అందులో ఎదగడానికే కష్టపడుతుంటాం.. వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ, మనల్ని మనం నిరూపించుకుంటూ కెరీర్‌ గ్రాఫ్‌ని క్రమంగా పెంచుకుంటూ పోతాం. అయితే ఈ క్రమంలో మనం పనిచేసే చోట కొన్ని అలవాట్లనూ అలవర్చుకోవాలంటున్నారు కార్పొరేట్‌ నిపుణులు.

Published : 17 Sep 2021 15:29 IST

ఉద్యోగంలో చేరామంటే అందులో ఎదగడానికే కష్టపడుతుంటాం.. వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ, మనల్ని మనం నిరూపించుకుంటూ కెరీర్‌ గ్రాఫ్‌ని క్రమంగా పెంచుకుంటూ పోతాం. అయితే ఈ క్రమంలో మనం పనిచేసే చోట కొన్ని అలవాట్లనూ అలవర్చుకోవాలంటున్నారు కార్పొరేట్‌ నిపుణులు. తద్వారా మన పనితనమే కాదు.. నడవడికా మన ఎదుగుదలలో కీలక భాగమవుతుందంటున్నారు. మరి, ఇంతకీ ఏంటా అలవాట్లు? తెలుసుకుందాం రండి..

విమర్శే ప్రశంస!

పనిచేసే చోట మన పనిని బట్టి ప్రశంసలే కాదు.. అప్పుడప్పుడూ విమర్శలూ ఎదుర్కోవాల్సి రావచ్చు. అది సహోద్యోగులతో కావచ్చు.. లేదంటే బాస్‌తో కావచ్చు! నిజానికి మన పైఅధికారులు ఇలా మన పని గురించి విమర్శించడం, తప్పొప్పులు చెప్పడం.. వంటివి చేశారంటే అది మన ఎదుగుదల కోసమే అని గుర్తుంచుకోండి..! ఈ క్రమంలో వాళ్లు మాటలన్నారని బాధపడడం కాకుండా.. వాళ్లు సూచించిన మార్పులు చేర్పులు చేసుకుంటే కెరీర్‌లో మరింత ముందుకు దూసుకెళ్లచ్చు. అంతేకాదు.. ఇలా ప్రతి విషయాన్నీ సానుకూల దృక్పథంతో తీసుకుంటే ఒత్తిడి ఎదురుకాకుండా.. దాని ప్రభావం మనం చేసే పనిపై పడకుండా జాగ్రత్తపడచ్చు.

అడగడంలో తప్పు లేదు!

ఆఫీస్‌ అన్నాక ఒకే పనికి పరిమితమవుతానంటే కుదరదు. అత్యవసర పరిస్థితుల్లో సహోద్యోగులు రానప్పుడు ఆ పని భారం మన మీద పడచ్చు. ఒక్కోసారి మన పనితనాన్ని గమనించడానికి పైఅధికారులు మనకు కొత్త పనులు పురమాయించచ్చు. ఇలాంటి సమయంలో చాలామంది ‘ఈ పని నాకు కొత్త.. నేను చేయలేనేమో!’ అన్న సందిగ్ధంలో పడిపోతారు. కొందరేమో.. పనిలో ఏవైనా సందేహాలున్నప్పుడు నివృత్తి చేసుకోవడానికి తోటి ఉద్యోగులను అడిగితే.. ‘ఇది కూడా తెలియదా?’ అనుకుంటారేమోనని వెనకడుగు వేస్తుంటారు. అయితే ఇలా మొహమాట పడి తప్పులు చేసే బదులు ముందే మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అందుకే అది చిన్న పనైనా, పెద్ద పనైనా.. అందులో ఎలాంటి సందేహమున్నా సరే.. దాని గురించి తెలిసిన వారిని ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలంటున్నారు. తద్వారా మనకు తెలియని ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. కెరీర్‌ అభివృద్ధికి ఇదీ ఓ కీలక మెట్టే!

అలా అనకండి!

ఆఫీస్‌లో కొంతమంది ఉద్యోగులు మా పనితనం ఇంతే అంటూ గిరిగీసుక్కూర్చుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఓ పని అదనంగా చేయాల్సి వచ్చినా ‘ఇది నా పని కాదు’ అంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. కెరీర్‌లో ఎదగాలనుకునే వారి లక్షణం ఇది కానే కాదంటున్నారు నిపుణులు. ఏ పనైనా, తన సొంతం చేసుకొని.. ఆస్వాదిస్తూ చేసినప్పుడే చక్కటి ఉత్పాదకతను అందించచ్చు. ఫలితంగా మన నైపుణ్యాలూ మరింత మెరుగుపడతాయి. కెరీర్‌ అభివృద్ధికి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి! అందుకే పని ప్రదేశంలో ‘ఇది నాది కాదు’ అన్న ధోరణిని మార్చుకొని ప్రతిదీ తమ సొంతం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.

కాస్త వెచ్చిస్తే పోయేదేముంది!

పనిలో చక్కటి సమయపాలన పాటించడం ఉత్తమ ఉద్యోగి లక్షణం. అలాగని రోజూ ఆఫీస్‌ సమయం అయిపోగానే కచ్చితంగా అదే టైమ్‌కి వెళ్తానంటే కుదరకపోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఇతర పనుల వల్ల అదనంగా సమయం కేటాయించాల్సి రావచ్చు. దానికి అనుగుణంగా మన ప్రణాళికను మార్చుకొని.. పని పూర్తి చేసి వెళ్లడం ఒక పద్ధతి. ఒకవేళ అది అత్యవసరంగా చేయాల్సిన పని కాకపోతే.. మరుసటి రోజు దాని ప్రభావం ఇతర పనులపై పడకుండా ఉండాలంటే.. ఇంకాస్త సమయం కేటాయించాల్సి రావచ్చు. ఇలా అవసరమున్నప్పుడల్లా ఆఫీస్‌ పని కోసం అదనంగా సమయం వెచ్చించడంలో తప్పేం లేదంటున్నారు నిపుణులు. అందుకే దృష్టంతా సమయం అయిపోతుందన్న దానిపై పెట్టకుండా.. చేసే పనిపై పెడితే మెరుగైన అవుట్‌పుట్‌ను అందించచ్చు.

ఇవి కూడా!

* ఆఫీస్‌ రాజకీయాలు, కొలీగ్స్‌పై రూమర్స్‌, చాడీలు చెప్పుకోవడం.. పని ప్రదేశంలో ఇలాంటి ప్రతికూల వాతావరణం కూడా ఉంటుంది. కాబట్టి దీనికి ప్రభావితం కాకుండా మీ పనేదో మీరు చూసుకోవడం మంచిది.

* పని విషయంలో ఒకరిపై కంప్లైంట్‌ ఇచ్చే బదులు మీరే దాన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచించే మార్గం చూడడం ఉత్తమం. తద్వారా ఉద్యోగులందరి మధ్య సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఇదీ మీ కెరీర్‌కి ప్లస్‌ పాయింటే!

* కెరీర్‌లో దూసుకెళ్లాలంటే మన పనితనమే కాదు.. డ్రస్సింగూ ముఖ్యమేనంటున్నారు నిపుణులు. అందుకే ఫ్యాషన్లను పాటించినప్పటికీ పద్ధతిగా, ప్రొఫెషనల్‌గా దుస్తులు ధరించడం అలవాటు చేసుకోవాలి.

* పని పూర్తవ్వాలని ఆదరాబాదరాగా ముగించేయడం కాకుండా.. చేసిన పనిని ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవడం అలవాటుగా మార్చుకోమంటున్నారు నిపుణులు. తద్వారా చేసిన పనిలో దొర్లిన తప్పుల్ని చాలావరకు సరిదిద్దుకోవచ్చు.

కెరీర్‌లో దూసుకెళ్లాలంటే ఒక ఉద్యోగికి ఉండాల్సిన అలవాట్లేంటో తెలుసుకున్నారు కదా! మరి, మీ సక్సెస్‌ సీక్రెట్స్‌ ఏంటి? మాతో పంచుకోండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్