అమ్మలు బిజీగా ఉంటే పిల్లల ప్రవర్తన మారుతుందా?
close
Published : 05/12/2021 17:24 IST

అమ్మలు బిజీగా ఉంటే పిల్లల ప్రవర్తన మారుతుందా?

తల్లులు అటు ఇంటి పనిని, ఇటు ఆఫీసు పనిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడమంటే సవాలే! ఇలా వాళ్లు ఇంత కష్టపడుతున్నా.. ఉద్యోగం పేరుతో పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, స్వార్థంగా వ్యవహరిస్తారని, ఇతరుల్ని చులకనగా చూస్తారని.. ఇలా వాళ్ల గురించి నలుగురు నానా రకాలుగా అనుకుంటుంటారు. అయితే ఈ ఆలోచనలన్నీ అపోహలేనని, ఇలా వాళ్లను వివక్షతో చూడడం మాని అసలు వాస్తవాలు గ్రహించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగం చేసే తల్లుల గురించి చాలామందిలో ఉండే అపోహలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలేంటో తెలుసుకుందాం రండి..

అపోహ: ఉద్యోగం చేసే తల్లులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడపరు.

వాస్తవం: సాధారణంగా ఏ ఉద్యోగైనా 8, 9 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. మరీ పనిభారం ఎక్కువైతే మరో గంట అదనంగా సమయం కేటాయించాల్సి రావచ్చు. ఇది తప్పించి మిగతా సమయమంతా ఇంటి పనులకు, పిల్లలతో గడపడానికే మొగ్గు చూపుతారు ఎక్కువ శాతం మంది తల్లులు. ఇంకా చెప్పాలంటే.. ఈ విషయంలో తండ్రులే తమ పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించలేరట! ఇక ఈ రోజుల్లో పలు కారణాల రీత్యా చాలామందికి ఇంటి నుంచి పనిచేసే అవకాశం దక్కడంతో మరింత సమయం పిల్లలకు కేటాయించగలుగుతున్నామని చాలామంది తల్లులు చెబుతున్నారు. ఇలా వృత్తిని మినహాయిస్తే మిగిలిన సమయంలో పిల్లలకు కేటాయించడానికే అధిక ప్రాధాన్యమిస్తున్నప్పుడు పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తారనడం ఎంత వరకు సమంజసం? అని అడుగుతున్నారు.

పిల్లల వ్యక్తిత్వ సమస్యలకు తల్లుల బిజీ లైఫ్‌స్టైలే కారణం!

ఇది ముమ్మాటికే అపోహే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఉద్యోగం చేసే మహిళలకు స్వతంత్ర భావాలు ఎక్కువ. ఏ విషయంలోనైనా ఇతరులపై ఆధారపడకుండా స్వీయ నిర్ణయాలు తీసుకోవడంలో వారు ముందుంటారు. పైగా వారు ఆర్థికంగా కూడా దృఢంగా ఉంటారు. ఇలాంటి ఇంట్లో భార్యాభర్తల మధ్య సమానత్వం కూడా ఉంటుంది. ఇవన్నీ పెరిగే పిల్లలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. స్త్రీలను గౌరవించడం, స్వతంత్రంగా జీవించడం.. వంటి ఎన్నో మంచి విషయాలు అలవర్చుకోగలుగుతారు. అలాంటప్పుడు వారిలో వ్యక్తిత్వ సమస్యలు రావడానికి అవకాశమే లేదంటున్నారు నిపుణులు.

ఇంటి పనులు తప్పించుకోవడానికే తల్లులు ఉద్యోగం చేస్తుంటారు.

ఉద్యోగం, అందులో ఉండే సవాళ్ల గురించి తెలియని చాలామంది ఇలాగే అనుకుంటారు. కానీ ఆఫీసులో పని చేయడమంటే రోజూ సవాలే అని చెప్పాలి! పని ఒత్తిడిని తట్టుకోవడం, కొత్త పనులు స్వీకరించడం, సమయపాలన, లక్ష్యాలను చేరుకోవడం.. వీటన్నింటినీ సానుకూలంగా ఎదుర్కొన్నప్పుడే సంస్థకు చక్కటి ఉత్పాదకతను అందించచ్చు.. కెరీర్‌లోనూ ఎదగచ్చు! పైగా ఆఫీస్‌లో ఇంత పనిచేసినా.. ఇంటికొచ్చాక చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. వాటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు వర్కింగ్‌ మదర్స్‌.

పనుల్ని సమన్వయం చేసుకోలేక ఒత్తిడికి లోనవుతుంటారు.

నిజానికి మహిళలు మల్టీ టాస్కింగ్‌ చేయడంలో దిట్ట. ఇందుకు వారు చేసే ఇంటి పనులే ప్రత్యక్ష సాక్ష్యం. ఇదే లక్షణాన్ని ఆఫీస్‌లోనూ ప్రదర్శిస్తుంటారు ఉద్యోగినులు. తద్వారా వివిధ రకాల పనులు నిర్వర్తిస్తూ తమ ప్రతిభాపాటవాల్ని చాటుకుంటారు. ఈ క్రమంలో ఏ కాస్త ఒత్తిడి ఎదురైనా తట్టుకొని ముందుకు సాగుతుంటారు. అంతేకానీ.. అక్కడితో ఆగిపోరు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇలాంటి మల్టీ టాస్కింగ్‌ అటు వారి వ్యక్తిగత జీవితంలోనూ, ఇటు వృత్తిపరంగానూ వారికి ప్లస్‌ అవుతుంది. తద్వారా వారు అమ్మతనాన్నీ, జీవితాన్నీ సంతృప్తికరంగా గడుపుతారని నిపుణులు చెబుతుంటారు.

పని చేసే తల్లులు ఇంటి దగ్గర ఉండే వారిని చిన్నచూపు చూస్తారు.

ఇందులో ఏమాత్రం వాస్తవం లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఉద్యోగం చేసినా చేయకపోయినా ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు ప్రతి తల్లికి సమానంగానే ఉంటాయి. ఈ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించీ వారికి అవగాహన ఉంటుంది. అలాంటప్పుడు చిన్న చూపు చూసే అవకాశం ఎక్కడుంటుంది అనేది నిపుణుల భావన.

వర్కింగ్‌ మదర్స్‌కి స్వార్థం ఎక్కువ!

ఈ భావన చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే దాకా.. ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు, ఆఫీస్‌ పనులు.. ఇలా ప్రతి క్షణం వాళ్లు తమ గురించి, తమ కుటుంబం గురించే ఆలోచిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే కొంతమంది వారిపై స్వార్థం అనే ముద్ర వేస్తుంటారు. కానీ ఈ ఆలోచన సరికాదంటున్నారు నిపుణులు. వాళ్లు తమ గురించి, తమ కుటుంబం బాగోగుల గురించి తీరిక లేకుండా గడుపుతున్నారన్న వాస్తవాన్ని గ్రహించమంటున్నారు. అంతేకాదు.. తీరిక లేని జీవనవిధానంలో ఉండే కష్టసుఖాలపై వారికి పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి వీలుంటే ఈ విషయాల్లో ఇతర తల్లులకు సహాయం చేయడానికీ వారు వెనకాడరు. అలాంటప్పుడు వారిపై స్వార్థం అన్న నిందలేయడం మాని మీకు తోచిన సహాయం చేస్తూ అండగా నిలవడంలో తప్పు లేదంటున్నారు.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని