పాప సమస్య... వ్యాపారమైంది!

పిల్లల చర్మం చాలా సున్నితం. వాళ్లకు వాడే ఉత్పత్తుల్లో రసాయనాలుండొద్దు, రంగులూ, పరిమళాలున్న వాటినీ వీలైనంత మేరకు దూరంగా ఉంచాలి... అన్న సలహాలు ఎక్కువగా వింటుంటాం. కానీ అలాంటివెక్కడ దొరుకుతాయి? ఇదే సమస్య పూజా దుగర్‌కి ఎదురైంది. ఆ సమస్య తీర్చడానికి ‘ఎల్లో నేచురల్స్‌’ను ప్రారంభించింది.

Published : 03 Jun 2024 04:11 IST

పిల్లల చర్మం చాలా సున్నితం. వాళ్లకు వాడే ఉత్పత్తుల్లో రసాయనాలుండొద్దు, రంగులూ, పరిమళాలున్న వాటినీ వీలైనంత మేరకు దూరంగా ఉంచాలి... అన్న సలహాలు ఎక్కువగా వింటుంటాం. కానీ అలాంటివెక్కడ దొరుకుతాయి? ఇదే సమస్య పూజా దుగర్‌కి ఎదురైంది. ఆ సమస్య తీర్చడానికి ‘ఎల్లో నేచురల్స్‌’ను ప్రారంభించింది. ఆమె మనోగతమిదీ...

పిల్లల ఆరోగ్యం కోసం ప్రతి తల్లిదండ్రులూ తపన పడుతుంటారు. వాళ్లకు వాడే ఉత్పత్తుల విషయంలో డాక్టర్‌ సలహా లేనిదే కొత్తవాటి జోలికి పోనివారూ ఎక్కువే. కొన్నిసార్లు వాళ్లు సిఫారసు చేసినవీ దద్దుర్లు, దురదలు లాంటి చర్మ సమస్యలకు కారణమవుతుంటాయి. నా కూతురి విషయంలో నాకూ ఇలాంటి చేదు అనుభవమైంది. తనది సెన్సిటివ్‌ స్కిన్‌. ఏ కాస్త రసాయన ఉత్పత్తి తగిలినా వెంటనే అలర్జీలు వచ్చేవి. ఎంతమంది డాక్టర్లని మార్చినా, ఖరీదైన ఉత్పత్తులు వాడినా లాభం లేకపోయింది. కారణం ఆ ఉత్పత్తుల్లో ఎంతో కొంత రసాయనాలు ఉండటమే! అందుకే పిల్లలకి సహజ పదార్థాలతో సబ్బులూ, క్రీములూ తయారు చేసే సంస్థను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన మొదలైంది. మాది గుడ్‌గావ్‌. 12 ఏళ్లు కాస్మెటిక్స్‌ మార్కెటింగ్‌ రంగంలో పనిచేశాను. ఆ అనుభవంతో రసాయనరహిత ఉత్పత్తులు తయారు చేయడమే లక్ష్యంగా 2023లో ‘ఎల్లో నేచురల్స్‌’ను ఏర్పాటు చేశా.

పాతకాలం చిట్కాలే...

సహజ పద్ధతుల్లో ఉత్పత్తులను తయారు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఇంటర్నెట్‌లో వెతకడం మొదలుపెట్టాను. ఒక సర్వేనూ చేశా. అమ్మలూ, అమ్మమ్మలూ, నాయనమ్మల చిట్కాలను తెలుసుకోవడంతోపాటు మూలికలకు సంబంధించిన అవగాహననూ పెంచుకున్నా. ఆపై తొమ్మిది మంది బృందంతో హిమాచల్‌ప్రదేశ్‌లో పనులు ప్రారంభించా. వారిలో టాక్సికాలజిస్టులూ, డెర్మటాలజిస్టులూ ఉన్నారు. తొమ్మిది నెలలు కష్టపడి మూడు ప్రొడక్ట్స్‌ తయారు చేశాం. వెన్న, అవకాడో, సహజ నూనెలు, పసుపు, కుంకుమపువ్వు, బియ్యప్పిండి లాంటివి ఉపయోగించి వీటిని తీర్చిదిద్దాం. మొత్తం ఐదు దశల్లో తయారైన వీటిని మొదట మా అమ్మాయికే వినియోగించా. ఫలితం బాగుంది. ఆ తరవాతే మార్కెట్లోకి విడుదల చేశాం. ఎల్లో నేచురల్స్‌కి ప్రస్తుతం 3వేల మందికిపైగా వినియోగదార్లు ఉన్నారు. ప్యాకింగ్‌లో వినియోగించేవీ పర్యావరణ హితమైనవే. వచ్చే మూడేళ్లలో ఈ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తం చేయాలన్నది నా లక్ష్యం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్