మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి వద్దు!
తొలకరి పలకరించినా మామిడి పండ్ల సీజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తినే వారు.. మామిడి పండ్లు తిన్నాక కూడా నోరు ఆడిస్తూనే ఉంటారు. కానీ అలాంటి వారు ఓ విషయం....
తొలకరి పలకరించినా మామిడి పండ్ల సీజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తినే వారు.. మామిడి పండ్లు తిన్నాక కూడా నోరు ఆడిస్తూనే ఉంటారు. కానీ అలాంటి వారు ఓ విషయం గుర్తు పెట్టుకోమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే మామిడి పండ్లు తిన్న వెంటనే కొన్ని రకాల పదార్థాలను తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలొస్తాయంటున్నారు. మరి, ఇంతకీ ఏంటా పదార్థాలు? మనమూ తెలుసుకుందాం రండి..
నీళ్లు తాగద్దు!
కొంతమందికి ఏది తిన్నా వెంటనే ఓ గ్లాసు మంచినీళ్లు తాగడం అలవాటు. ఈ పద్ధతి మంచిదే అయినా మామిడి పండు విషయంలో మాత్రం వద్దంటున్నారు నిపుణులు. ఇలా పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపుబ్బరం, కడుపునొప్పి.. వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు. ఒకవేళ తాగాలనుకుంటే పండు తిన్నాక అరగంట తర్వాతే తీసుకోవడం మంచిదంటున్నారు.
మిర్చి /మసాలా ఫుడ్ వద్దు!
అలాగే మామిడి పండ్లు తిన్న వెంటనే మిర్చి /మసాలా ఫుడ్ వంటివి తీసుకోకూడదట. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కొంతమందిలో చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుందట! అలాగే కడుపుబ్బరం, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుందట. కాబట్టి ఇలాంటి ఫుడ్ కాంబినేషన్ తీసుకొని అవస్థలు పడే కంటే.. తీసుకోకపోవడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు.
ఇలా చేస్తే షుగర్ వస్తుంది!
మామిడి పండు తిన్నాక శీతల పానీయాలు కూడా తీసుకోవద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ రెండింట్లోనూ చక్కెరలు అధికంగా ఉంటాయి. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగి మధుమేహం బారిన పడే అవకాశాలు ఎక్కువట! అదే ఇప్పటికే షుగర్‌తో బాధపడుతోన్న వారికి ఈ ఫుడ్ కాంబినేషన్ మరింత ప్రమాదకరం. కాబట్టి తెలిసి తెలిసి అనారోగ్యాల్ని కొని తెచ్చుకోవడం కంటే వీటికి దూరంగా ఉండడమే మంచిది.
పెరుగుతో తింటున్నారా?
చాలామందికి పండ్ల ముక్కల్ని పెరుగుతో కలిపి తినడం అలవాటు. అయితే మామిడి ముక్కల్ని పెరుగులో వేసుకొని తినడం, లేదంటే పండు తిన్న వెంటనే పెరుగు తినడం.. వంటివి చేస్తే కొంతమందిలో జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చంటున్నారు. అదెలాగంటే.. మామిడిపండు శరీరానికి కాస్త వేడి చేస్తే.. అదే పెరుగు చలువ చేస్తుంది. ఈ రెండింటినీ వెంటవెంటనే తీసుకోవడం వల్ల జీర్ణ క్రియలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందట. అంతేకాదు.. అలర్జీ వంటి చర్మ సమస్యలు, శరీరంలో విషతుల్యాలు పేరుకుపోవడం.. వంటివీ తలెత్తుతాయట!
వీటితో పాటు కాకరకాయ వంటి చేదుగా ఉండే పదార్థాల్ని సైతం మామిడి పండ్లు తిన్నాక తీసుకోకూడదంటున్నారు నిపుణులు. తద్వారా వికారం, వాంతులు అవుతాయట! కాబట్టి మామిడిపండు తిన్నాక ఓ అరగంట పాటు ఏదీ తినకుండా ఉండడం మంచిది. తద్వారా అటు దాని రుచిని ఆస్వాదించచ్చు.. ఇటు ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు.
అయితే ఈ సమస్యలన్నీ అన్ని సందర్భాల్లోనూ అందరిలోనూ కనిపించాలని లేదు. ఎవరిలో అయితే ఇలాంటి సమస్యలు కనిపిస్తాయో వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.