సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన పెంచుకుందాం..!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ముందు వరుసలో ఉంటుంది. మొదటి దశలో దీన్ని గుర్తించకపోవడం, అవగాహనా లోపం.. వంటి కారణాల వల్ల దీని బారిన పడి ఏటా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మహిళల్లో క్యాన్సర్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది రొమ్ము క్యాన్సర్.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ముందు వరుసలో ఉంటుంది. మొదటి దశలో దీన్ని గుర్తించకపోవడం, అవగాహనా లోపం.. వంటి కారణాల వల్ల దీని బారిన పడి ఏటా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మహిళల్లో క్యాన్సర్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది రొమ్ము క్యాన్సర్. కానీ దీంతో పాటు సర్వైకల్ క్యాన్సర్/గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో వచ్చే నాలుగో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా గుర్తించినట్లు నిపుణులు చెబుతున్నారు. జనవరిని ‘సర్వైకల్ క్యాన్సర్ అవగాహన మాసం’గా జరుపుకుంటోన్న నేపథ్యంలో ఈ మహమ్మారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి..
ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసుల్లో నాలుగో వంతు కేసులు, మూడో వంతు మరణాలు మన దేశం నుంచే నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్యాన్సర్‌కు కారణమయ్యే హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) శరీరంలోకి ప్రవేశించాక క్యాన్సర్‌గా అభివృద్ధి చెందడానికి 15-20 ఏళ్లు పడుతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే నిర్ణీత వ్యవధుల్లో సంబంధిత పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని ఆదిలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
అధ్యయనాలేం చెబుతున్నాయి?
* సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి ఏటా మన దేశంలో దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోతున్నారని ‘ఇండియన్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్’ సంస్థ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. అలాగే 50 ఏళ్లలోపు వారిలో 80 శాతం మందికి పైగానే ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తుంది.
* మరోవైపు.. ముంబయికి చెందిన ‘మెట్రోపోలిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ సంస్థ’ ప్రకారం.. ఒక ఏడాదిలో దాదాపు 36 వేల మందికి పైగా మహిళలకు ఈ క్యాన్సర్ ఉన్నట్లు, అందులో 70 శాతం మందికి జన్యువుల ద్వారానే ఆ వ్యాధి సోకినట్లు వెల్లడించింది. అంతేకాదు.. ఎప్పటికప్పుడు పాప్‌స్మియర్, హెచ్‌పీవీ టెస్టులను చేయించుకోవడం వల్ల మొదటి దశలోనే ఈ వ్యాధిని గుర్తించి సరైన చికిత్స తీసుకునే అవకాశం ఉందని సూచిస్తుంది.
* ‘నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్)’ నిర్వహించిన అధ్యయనంలో భాగంగా.. ప్రతి 53 మంది భారతీయ మహిళల్లో ఒకరు తమ జీవిత కాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి వంద మందిలో ఒకరు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారట.
మహిళలకు సోకే నాలుగో అతి సాధారణ క్యాన్సర్‌గా, అన్ని క్యాన్సర్లలోకెల్లా ఏడో అతి సాధారణ క్యాన్సర్‌గా సర్వైకల్ క్యాన్సర్‌ను గుర్తించారంటే ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం ఎంతలా ఉందో ఇట్టే గ్రహించవచ్చు.
ఇలా గుర్తించచ్చు..
సర్వైకల్ క్యాన్సర్ సోకడానికి అతి ప్రధానమైన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ). ఎక్కువమంది భాగస్వాములతో లైంగిక చర్యలో పాల్గొనడం, గర్భ నిరోధక మాత్రలు ఉపయోగించడం, వంశపారం పర్యంగా.. తదితర కారణాల ద్వారా ఇది సంక్రమించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అయితే కొన్ని ప్రాథమిక లక్షణాల ద్వారా దీన్ని గుర్తించచ్చంటున్నారు.
* నెలసరి సమయంలో అధికంగా రక్తస్రావం కావడం..
* మెనోపాజ్ తర్వాత, లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత.. కూడా రక్తస్రావం కావడం.
* పొత్తి కడుపులో నొప్పి రావడం, లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు-ఆ తర్వాత వెజైనా దగ్గర నొప్పి, మంట రావడం..
* దుర్వాసనతో కూడిన వెజైనల్ డిశ్చార్జి..
* పదే పదే యూరిన్‌కి వెళ్లాల్సి రావడంతో పాటు ఆ సమయంలో నొప్పిగా అనిపించడం..
* తరచూ కడుపుబ్బరం వేధిస్తున్నా, అలసట, నీరసం, విరేచనాలు.. వంటి సమస్యలున్నా సర్వైకల్ క్యాన్సర్‌గా అనుమానించాలంటున్నారు నిపుణులు.
ఈ చికిత్సల ద్వారా..
ఇలాంటి లక్షణాలతో సర్వైకల్ క్యాన్సర్‌గా అనుమానించిన వెంటనే దాన్ని నిర్ధరించుకోవడానికి నిపుణుల సలహా మేరకు కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో ముందుగా పాప్ స్మియర్ టెస్టు చేస్తారు. ఒక పరికరం సహాయంతో గర్భాశయ ముఖ ద్వారం నుంచి కొన్ని కణాలను సేకరించి పరీక్షించడం ద్వారా దీన్ని గుర్తిస్తారు. అలాగే పెల్విక్ ఎగ్జామినేషన్, బయాప్సీ విధానాల ద్వారా కూడా దీన్ని నిర్ధరించుకోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ సోకిందని తేలితే అది ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి ఎక్స్‌రే తీయించుకోవడంతో పాటు అబ్డామినల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటివి చేయాల్సి ఉంటుంది. తొలి దశలో ఉన్న క్యాన్సర్‌కి హిస్టరెక్టమీ చికిత్స అందిస్తారు. అలాగే శరీరంలో క్యాన్సర్ ఎంతగా వ్యాపించిందో దాని తీవ్రతను బట్టి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు చేయించుకోవాల్సి ఉంటుంది.
రాకుండా ఉండాలంటే..
ఈ క్యాన్సర్ బారిన పడి ఇబ్బంది పడే కంటే రాకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ క్రమంలో హెచ్‌పీవీ వైరస్ సోకకుండా ముందస్తు వ్యాక్సినేషన్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీన్ని 9 నుంచి 26 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకు వేయించడం వల్ల భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. అలాగే 21 ఏళ్లు దాటాక డాక్టర్ సలహా మేరకు నిర్ణీత వ్యవధుల్లో పాప్ స్మియర్ టెస్టు చేయించుకోవడం కూడా ముఖ్యమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.